అంతర్రాష్ట్ర ముఠాలు ఏమార్చే నకిలీ బంగారు నాణేలు(ఫైల్)
పలమనేరు : జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో నకిలీ బంగారు ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న పలమనేరు పోలీసు సబ్ డవిజన్‌లో ఇలాంటి ముఠాల జోరు ఎక్కువైంది. అమాయకులను టార్గెట్ చేసి అసలు బంగారు నాణేలు చూపిస్తూ నకిలీవి అంటగట్టి మోసాలకు పాల్పడుతున్నారు. వీరి కారణంగా ఎందరో అమాయకులు లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఈ ముఠా మాటలు నమ్మి ఎలాగైనా కోట్లు సంపాదించాలనే ఆశతో ఈ ప్రాంతంలో పలువురు ఇదే వృత్తిగా చేసుకుంటున్నారు. తొలుత ఈ ముఠా వద్ద మోసపోయన బాధితులు సైతం ఇదే రొచ్చులోకి దిగి పలువురిని మోసగిస్తున్నట్లు సమాచారం. గత నాలుగైదు ఏళ్లుగా ఇలాంటి పలు ముఠాలను పలమనేరు, గంగవరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఓ ముఠా మాటలు విని సత్యవేడుకు చెందిన బాధితుడు రూ.5 లక్షలను మోసపోయి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ముఠానుపోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
పోలీసుల వేషాల్లో దాడులు..
నకిలీ బంగారు నాణేల మోసాలకు పాల్పడే స్థానికులు కొందరు, సరిహద్దు కర్ణాటక గ్రామాలకు చెందిన వారితో కలిసి ఖరీదైన కార్లను అద్దెకు తీసుకొని మొత్తం వ్యవహారమంతా రహస్య ప్రదేశాల్లోనే నిర్వహిస్తుంటారు. రాత్రి సమయాల్లో ఓ ప్రదేశానికి డబ్బుతో రమ్మని నకిలి నాణేలను ఇవ్వడం లేదా వారి మనుషులే పోలీసుల వేషాల్లో స్పాట్‌కు వచ్చి దాడులు చేస్తారు. క్రిష్ణగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారిపై గతంలో వీకోట వద్ద దాడి జరిగింది.
మోసాలు పలు రకాలు..
తమ వద్ద అద్భుత శక్తి కలిగిన రాగి చెంబు ఉందని, బంగారు నాణేలు, పాత్ర, వజ్రాలు, విగ్రహాలు ఉన్నాయంటూ పలు ముఠాలు అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. దీనికి తోడు ఆర్‌పీ(రైస్ పుల్లింగ్), సీఆర్పీ(కాపర్ రైస్ పుల్లర్), సీఐపీ (కాపర్ ఇరిడియమ్ రైస్ పుల్లర్) పేరిట మరికొన్ని గ్యాంగ్‌లు మోసాలకు పాల్పడుతున్నాయి. సంజీవిపుల్ల గ్యాంగ్, అక్షయపాత్ర, పూడుపాముల ముఠా, నక్షత్ర తాబేళ్ల ముఠాలు.. ఇలా ఎన్నెన్ని మోసాలో!.
ఐదేళ్లలో పదికి పైగా సంఘటనలు..
పైన చెప్పిన మోసాలకు సంబంధించి ఐదేళ్లలో పదికి పైగా ఘటనలు చోటుచేసుకున్నాయి. బా ధితులు రూ.మూడు కోట్లకు పైగా మోసపోయారు. ఈ గ్యాంగ్‌లలో బాగా చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, కర్ణాటక పోలీసులు ఉండడం కొసమెరుపు. స్థా నికంగా ఇలాంటి మోసాలపై నమ్మబలికే వ్యక్తులు వందమంది దాకా ఉంటే.. వారి ఏజెంట్లు మరో వందమంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది.
నకిలీ బంగారునాణేల కేసులో నలుగురి అరెస్టు
గంగవరం : నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడిన చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రామకృష్ణాచారి బుధవారం తెలిపారు. ఆయన విలేకర్లకు తెలిపిన వివరాల మేరకు.. సత్యవేడు మండలం మాదనపాళెం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం తన అన్నకు పక్షవాతం కారణంగా 15రోజుల క్రితం బైరెడ్డిపల్లి మండలం విరుపాక్షిపురానికి తీసుకొచ్చాడు. అక్కడ తనకు మునివెంకటప్ప అనే వ్యక్తి పరిచయమై తనకు తెలిసిన వారి వద్ద బంగారు నాణేలు ఉన్నాయని, ఇద్దరం కొనుక్కుని వాటిని అధిక సొమ్ముకు విక్రయిద్దామని చెప్పి నమ్మబలికాడు. ఈమేరకు బాధితుని నుంచి మూడు దఫాల్లో రూ.5లక్షలు తీసుకుని నకిలీ నాణేలను ఇచ్చారు. అవి నకిలీవని గ్రహించిన బాధితుడు వెంటనే బైరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను బైరెడ్డిపల్లి మండలం చెల్లారిగుంట క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న రూ.4లక్షల నగదు, నకిలీ బంగారునాణేలు, ఒక ఇత్తడి చెంబు, రెండు బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల్లో తమిళనాడు రాష్ట్రం బాగళూరు గ్రామానికి చెందిన మునివెంకటప్ప, కర్ణాటక రాష్ట్రం చిక్కనపల్లికి చెందిన నారాయణప్ప, ఇదే రాష్ట్రం కేపీ కొత్తూరుకు చెందిన చిన్నప్పయ్య, ముళబాగిల్‌కి చెందిన రాప్‌సాబ్ ఉన్నారు. బైరెడ్డిపల్లి ఎస్‌ఐ మునస్వామి తన సిబ్బందితో కలిసి కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. గంగవరం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
బంగారు నాణేల పేరిట ఘరానా మోసాలు..
పురాతన కాలం నాటి అసలు సిసలైన బంగారు నాణేలు తమకు భూమిలో లభించాయని నమ్మకంగా చెబుతారు. వీటిని బయట అమ్మితే తమకు సమస్యలుంటాయి కనుక రహస్యంగా తక్కువ ధరకే విక్రయిస్తున్నామంటూ కథలు చెబుతారు. ఆశపడిన వ్యక్తి నుంచి కొంత అడ్వాన్స్ తీసుకుని.. అసలు బంగారు కాయిన్ ఒకదాన్ని ఇస్తారు. దాన్ని చెక్ చేసుకున్నాక డీల్ కుదుర్చుకుంటారు. ఆపై మొత్తం డబ్బు తీసుకుని తాము చెప్పిన రహస్య ప్రదేశానికి ఒంటరిగా రావాలని చెప్పి, నకిలీ నాణేలను అంటగట్టి పంపుతారు. ఇదే తరహా మోసాలు ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. తాజాగా బైరెడ్డిపల్లి పోలీసులు పట్టుకున్న ముఠా సైతం ఇదే రీతిలో మోసం చేసింది.
అత్యాశకు పోవద్దు..
ఎవరో చెప్పే మాయమాటలు వింటే మోసపోవడం ఖాయం. అయినా బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామంటే ఎలా నమ్ముతాం. అత్యాశకు పోయేవాళ్లకు కష్టాలు తప్పవని తెలిసినా మళ్లీ ఎలా నమ్ముతారో అర్థం కాదు. ఏమారి డబ్బులిచ్చేసి బాధపడితే ప్రయోజనం ఉండదు.– రామకృష్ణాచారి, సీఐ, గంగవరం సర్కిల్
Comments
Please login to add a commentAdd a comment