బ్యాంక్‌ కుంభకోణంపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు | Online Complaint on Andhra bank Fake Gold Scandal | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ కుంభకోణంపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు

Published Fri, Apr 26 2019 12:51 PM | Last Updated on Fri, Apr 26 2019 12:51 PM

Online Complaint on Andhra bank Fake Gold Scandal - Sakshi

గోవాలో జల్సా చేస్తూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న గోపి (ఫైల్‌)

గుంటూరు, కాజ(మంగళగిరి): మండలంలోని కాజ ఆంధ్రాబ్యాంక్‌లో నకిలీ బంగారం కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నట్లు సమాచారం. బ్యాంకు పెట్టిన నాటి నుంచి గోల్డ్‌ అప్రైజర్‌గా పని చేస్తున్న గుత్తికొండ ప్రసాద్‌కు ముప్పై సంవత్సరాల అనుభవం, స్వగ్రామం కావడంతో ఏ అధికారి వచ్చినా అతడు చెప్పినట్లే జరిగేదని సమాచారం. గ్రామంలో మంచి పేరున్న ప్రసాద్‌.. గోపి మాటల మాయలో పడి నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి రుణం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రసాద్‌కు వాటాలున్న కారణంగానే ఇంత పెద్ద కుంభకోణం జరిగినట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. కుంభకోణం గురించి స్థానిక అధికారులు గోప్యం పాటిస్తుండగా, ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, రాతపూర్వకంగా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని కోరినట్లు తెలిసింది. మరో వైపు విషయం బయటకు పొక్కిననాటి నుంచి గంధం గోపి పరారవ్వడం గమనార్హం.

ముందే బ్యాంకులో మాట్లాడుకున్న అతడు, ఓ యువకుడిని తీసుకుని వెళ్లి ఖాతాను ప్రారంభించాడు. తర్వాత బంగారం తనఖా పెట్టి యువకుడి ఖాతాలోకి వచ్చిన నగదును తన ఖాతాలోకి మార్చుకుని జల్సా చేసినట్లు చర్చ జరుగుతోంది. రుణం తీసుకున్న యువకులు పలువురిని గత కొద్దికాలంగా గోవా తదితర ప్రాంతాలకు తిప్పి, వారితో పాటు కలిసి జల్సా చేశాడని, దీంతో వారంతా రుణం తీసుకునేందుకు సహకరించారని సమాచారం. ఎలాగైనా బ్యాంకు నగదు జమ చేసి కేసులు లేకుండా చూసుకుని తమ భవిష్యత్తును కాపాడుకోవాలని గత మూడు నెలల నుంచి బ్యాంకు ఉద్యోగులంతా గ్రామ పెద్దలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కొలిక్కి రాలేదు. విషయం బయటకు పొక్కడంతో బ్యాంక్‌  ఉన్నతాధికారులు సైతం తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఇక నకిలీ బంగారంతో రుణాలు తీసుకోకపోయినా, అవి తమ పేర్లతో ఉండడంతో కేసులు తమ మెడలకు ఎక్కడ చుట్టుకుంటాయోనని గోపికి సహకరించిన వారి కుటుంబాలను వేధిస్తోంది. ఇంత జరుగుతున్నా బ్యాంక్‌ అధికారులు మాత్రం నోరు విప్పకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement