దొంగ దొరికాడు!
► రూ.23.40 లక్షలు కాజేసినట్లు నిర్థారణ
► పదిమంది పేర్ల మీద నకిలీ బంగారం తనఖా
► పోలీసుల అదుపులో బ్యాంకు అప్రైజర్ సాగర్
పిడుగురాళ్ళ (గుంటూరు) : పట్టణంలోని ఓ జాతీయ బ్యాంకు (యూనియన్ బ్యాంక్)లో నకిలీ బంగారాన్ని పెట్టి బ్యాంకు అధికారులను మోసం చేసిన అప్రైజర్ సాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన స్నేహితులు, బంధువులు సుమారు పది మంది పేర్లపై దొంగ బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మొత్తం రూ.23.40 లక్షలను నొక్కేశాడు. బంగారాన్ని తీసుకెళ్లమని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు ఫోన్ చేయడంతో అసలు గుట్టు బయట పడింది. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని పరిశీలించి ప్రతి ఖాతాదారుడి వివరాలు, ఖాతాదారుడు ఎంత బంగారం బ్యాంకులో పెట్టాడు , ఎంత నగదు తీసుకున్నాడన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో బ్యాంకు ఆడిట్ బృందం రహస్యంగా రెండు వారాల పాటు విచారణ నిర్వహించింది.
ఆ సమయంలోనే బ్యాంకులో భారీ నగదు స్వాహా అయినట్లు సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. అప్పట్లో బ్యాంకు పరువు పోతుందని బ్యాంకు మేనేజర్ సమాచారం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బ్యాంకులో అప్రైజర్ చేసిన మోసాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు నిగ్గు తేల్చారు. దీంతో బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పట్టణ ఇన్‌చార్జి సీఐ వై. శ్రీధర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అప్రైజర్ సాగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తిని సాక్షి వివరణ కోరగా అప్రైజర్ సాగర్ దొంగ బంగారం పెట్టి బ్యాంకు సొమ్మును కాజేసిన మాట వాస్తవమేనన్నారు. అతను కాంట్రాక్టు ఉద్యోగి అని, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించామని, అతని వద్ద నుంచి బ్యాంకు నగదును రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.