రూ.లక్షతో ఉడాయింపు
నకిలీ బంగారం తాకట్టుపెట్టి..
బాదలాపురం (మిర్యాలగూడ క్రైం), న్యూస్‌లైన్ : మహిళ వద్ద నకిలీ బంగారం తాకట్టుపెట్టి లక్ష రూపాయలతో ఓ జంట ఉడాయించింది. ఈ ఘటన బాదలాపురం గ్రామపంచాయతీ పరిధి అవంతీపురంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పర్వతం ఎల్లమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జంట తమ పేర్లు శివ, లక్ష్మి అని, తమది పుట్టపర్తి అని చెప్పుకుంటూ వారం రోజులుగా గ్రామంలో తుంగచాపల వ్యాపారం నిర్వహిస్తున్నారు. చాపలు విక్రయించిన తర్వాత రాత్రివేళ అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 28వ తేదీన తన అల్లుడికి ప్రమాదం జరిగిందని, డబ్బులు అవసరముందని లక్ష్మి, శివలు రోదిస్తూ ఎల్లమ్మతో తెలి పారు. తమవద్ద ఉన్న బంగారు బిల్లలు తాకట్టు పెట్టుకొని లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు.
ఒక బిల్లను పరిశీలించుకోమని ఇచ్చారు. ఆ బిల్ల బంగారపుదే కావడంతో ఎల్లమ్మ నమ్మి తన బిడ్డ పెళ్లి కోసం దాచిన లక్ష రూపాయలను వారికి ఇచ్చింది. రెండురోజుల్లో వచ్చి తమ బంగారం తీసుకెళతామని చెప్పి శివ, లక్ష్మి వెళ్లిపోయారు. వారం రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లేకపోవడంతో అనుమానం వచ్చి బిల్లలను పరీక్ష చేయించగా నకిలీవని తేలాయి. దీంతో ఆమె లబోదిబోమంటూ మంగళవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ప్రొబేషనరీ డీఎస్పీ విజయ్‌భాస్కర్ తెలిపారు.