miryala guda
-
యువకుడిపై ఫిర్యాదు చేసిన అమృత
సాక్షి, నల్గొండ : మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఎదురుగా ఉండే విజయ్ అనే యువకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీంకు చేరవేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గత ఏడాది దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసులో కరీం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. అమృత తండ్రి మారుతీరావు మరణం అనంతరం.. శనివారమే ఆమె తల్లి గిరిజను కలిశారు. ( పోలీసుల రక్షణతో తల్లిని కలిసిన అమృత ) -
అవినీతి ఆరోపణలపై ఎస్సై సస్పెండ్
సాక్షి, మిర్యాలగూడ : అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సైదాబాబును పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. సైదాబాబుపై పలు అవినీతి ఆరోపణలతో పాటు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయకుండా జాప్యం చేయడం, సాండ్ టాక్స్ సక్రమంగా అమలు చేయకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సై సైదాబాబు కాల్‌డేటాతో పాటు పూర్తిస్థాయి విచారణ జరిపిన ఎస్పీ రంగనాథ్ ఎస్సైని సస్పెండ్ చేయమంటూ డీఐజీకి సిఫారసు చేశారు. ఎస్పీ సిఫారసు మేరకు హైద్రాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి సైదాబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నేరగాళ్లకు ఇదో సిగ్నల్
సాక్షి, నల్గొండ : అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో నేరగాళ్లకు సిగ్నల్ పంపినట్లు అయింది. అత్యాచారాలు, హత్యలు చేయాలంటే నేరగాళ్లకు భయం ఏర్పడాలి. ఎవరైనా నేరం చేయాలని అనుకుంటే ఈ ఘటన గుర్తుకు వచ్చేలా చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మ శాంతిస్తుందని భావిస్తున్నా. దిశకు న్యాయం జరిగింది. – పందిరి రవీందర్, రిటైర్ట్ ప్రిన్సిపాల్, కేఎన్ఎం కళాశాల, మిర్యాలగూడ -
నకిలీ..మకిలీ..!
సాక్షి, మిర్యాలగూడ : నకిలీ పురుగు మందుల వ్యాపారానికి మిర్యాలగూడ పట్టణం అడ్డాగా మారింది. వేల రూపాయలు వెచ్చించి పురుగు మందులు కొనుగోలు చేస్తున్న రైతులు తెగుళ్లు తగ్గకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులను నకిలీ పురుగు మందులు మరింత అఘాతంలోకి నెడుతున్నాయి. నాణ్యమైన మందులు కాకుండా ఎక్కువ శాతం లాభాలు వచ్చే వాటిని ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు రైతులకు మాయమాటలు చెప్పి విక్రయిస్తున్నారు. అంతే కాకుండా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు తెగుళ్లపై అవగాన కల్పించి ఏ మందులు పిచికారీ చేయాలో తెలియజేయడం లేదు. దీంతో రైతులు ఫర్టిలైజర్ దుకాణ యజమాని చెప్పిన మందులను తీసుకెళ్లడంతో తెగుళ్లు అలాగే ఉంటున్నాయి. చివరికి రైతు జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టులో పరిధిలో వరి పంటలతో పాటు పత్తి సాగు చేస్తున్నారు. రైతులు ఎక్కువగా చీడ పీడలు ఆశిస్తే నేరుగా పురుగుమందుల దుకాణానికి వెళ్లి వారు చెప్పిన మందునే కొనుగోలు చేస్తున్నారు. వరి, పత్తి పంటలకు ప్రధానంగా వేరుకుళ్లు, ఆకుమచ్చ, ఆకు ముడత, తెల్లమచ్చ, తెల్లదోమ, లద్దెపురుగు, రసం పీల్చే పురుగు, ఎండు తెగుళ్లు సోకుతాయి. కానీ నకిలీ మందుల కారణంగా చీడపీడలు తగ్గకపోవడంతో రైతులు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. బయో ఉత్పత్తులకు అడ్డాగా.. బయో కెమికల్స్ పేరుతో రైతులను మరింత మోసానికి గురి చేస్తున్నారు. బయో కెమికల్స్‌ను ఎక్కువగా పండ్ల తోటలకు ఎంతో ఉపయోగకరమని ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. దీంతో వాటిని రైతులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. రైతుల ఆలోచనలను ఆసరాగా చేసుకున్న కొంత మంది నకిలీ బయోకెమికల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు. గత ఏడాది మిర్యాలగూడలో 5.89 లక్షల విలువైన నకిలీ బయో ఉత్పత్తులను విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నకిలీ పురుగుమందులు, బయో ఉత్పత్తుల్లో నకిలీ మందులు తయారు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కంపెనీ పేర్లతోనే మోసం వరి, పత్తి పంటలకు సోకే తెగుళ్ల నివారణకు ఎక్కువగా మోనోఎస్ఫేట్, ఫ్రైడ్, కాన్ఫిడార్, ట్రైజోపాస్, ప్రోగ్నోఫాన్, క్లోరిఫైరీఫాస్, ఫోరేట్ గుళికలు, ఫోర్జీ, త్రిజీ గుళికలు, పాస్పామిడాన్‌లు ఉపయోగిస్తారు. ఆయా కంపెనీల పేర్లతోనే రైతులు గుర్తించలేని విధంగా తయారు చేసి నకిలీ మందులను అంటగడుతున్నారు. ఫ్రైడ్ కంపెనీకి చెందిన ‘ఫేమ్’ అకుముడత నివారణ మందును అదే పేరుతో నకిలీది దిలావర్పూర్ గ్రామానికి చందిన రైతు రాజశేఖర్‌రెడ్డికి ఇటీవల విక్రయించారు. నకిలీ మందును విక్రయించినట్లుగా గుర్తించి రైతు, ఆ కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ మందుల విక్రయం వెలుగులోకి వచ్చింది. బ్యాచ్ నంబర్లు లేకుండా ఇష్టానుసారంగా మందులు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ పురుగు మందులు విక్రయిస్తే చర్యలు నకిలీ పురుగు మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవల నకిలీ పురుగు మందులు విక్రయించినట్లుగా ఫిర్యాదు వచ్చింది. మిర్యాలగూడ పట్టణంలో పురుగు మందుల దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. నకిలీ మందులు విక్రయిస్తున్నట్లుగా మా దృష్టికి వస్తే తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఏఓ, మిర్యాలగూడ -
వాట్సాప్‌లో ఆహ్వాన పత్రిక చక్కర్లు
మిర్యాలగూడ టౌన్ : ఈనెల 11వ తేదీన జరగనున్న 13వ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కొంత మంది యువకులు ఆహ్వాన పత్రిక ముద్రించి వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. ఆహ్వానం...సాధారణ ఎన్నికలు–2019, నూతన సభ్యుల ఉత్సవం, ముహూర్తం 11.04.2019 గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటలు, వేదిక.. మీ ప్రాంతంలోని మీ ఓటు నమోదైన పోలింగ్ కేంద్రం, విన్నపం...ఈ ఎన్నికల ఉత్సవానికి సంబంధించి ఎటువంటి కానుకలు ఇవ్వరాదు...తీసుకోరాదు.. అంటూ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ముద్రించారు. ఈ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఆహ్వాన పత్రికపై సర్వత్రా చర్చ జరుగుతుంది. -
పదోసారి పోటీకి సై.. ఓడినా పట్టింపు నై..
సాక్షి, నల్లగొండ: ‘‘ప్రజాసేవ చేయాలన్నదే నా ఆశయం. అందుకోసం జీవితాంతం పోటీ చేస్తూనే ఉంటా.. ఒక్క ఓటు వచ్చినా.. రాకున్నా పోటీ చేస్తూనే ఉంటాను. డిపాజిట్లు ముఖ్యం కాదు. నాకు ఆశయమే ముఖ్యం. అందుకోసం నేను బతికున్నంత కాలం ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటా’’ అని ఇండిపెండెంట్ అభ్యర్థి మర్రి నెహెమియా అంటున్నారు. నల్లగొండ లోక్‌సభకు శుక్రవారం నామినేషన్ వేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటి వరకు ఆయన నామినేషన్ వేయడం పదోసారి. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘నా అభిమానులు నాకున్నారు. ప్రతిసారీ నేను పోటీ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారీ ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో అత్యధికంగా అభిమానులు ఓట్లు వేశారు’ అని అంటున్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన తనకు మొదటి నుంచి రాజకీయాలంటే ఎంతో అభిమానమని, కేవలం కరపత్రాలు, పోస్టర్లు మినహా పెద్దగా ఖర్చు పెట్టడం లేదని తెలిపారు. తాను బతికున్నంతకాలం పోటీ చేస్తూనే ఉంటానన్నారు. 1984 నుంచి అప్పటి మిర్యాలగూడ లోక్‌సభ స్థానానికి, మిర్యాలగూడ రద్దయిన తర్వాత నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఆయన నామినేషన్లు వేసి పార్లమెంట్‌కు పోటీ చేస్తూనే ఉన్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో 9వ సారి పోటీ చేశాను. 56 వేల ఓట్ల పైచిలుకు వచ్చాయని, 10వ సారి నల్లగొండ ఎంపీగా నామినేషన్ సమర్పించినట్లు తెలిపారు. అంతకుముందు నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని, మరో మూడు పర్యాయాలు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసినట్లు చెప్పారు. – మీసాల శ్రీనివాసులు, సాక్షి– నల్లగొండ -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, నల్లగొండ క్రైం : మిర్యాలగూడ కేంద్రంగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యుల గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.ఐదు లక్షల 18 వేల 500 నగదు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ రంగనాథ్ తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ప్రధానసూత్రధారి వేముల పుల్లారావుతో పాటు అతడి అనుచరులు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వేముల పుల్లారావు గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామం నుంచి 20 ఏళ్ల క్రితం త్రిపురారం వచ్చి కిరాణ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాడని, మూడేళ్ల నుంచి స్నేహితులతో కలిసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కొంత నష్టం రావడంతో తానే సొంతంగా బొంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ సంస్థ నుంచి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని నెలకు రూ.15 వేలు యాప్ సంస్థకు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిచయం ఉన్న స్నేహితుల నుంచి సులభంగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో క్రికెట్ యాప్‌తో పాయింట్స్ ఆధారంగా, ఒక పాయింట్‌కు రూ.100 వసూలు చేస్తాడని, బెట్టింగ్ విస్తరణకు కొందరిని డిస్టిబ్యూటర్లుగా నియమించుకున్నాడని వివరించారు.బెట్టింగ్‌లో కస్టమర్ గెలిస్తే గెలిసిన డబ్బులో 5 శాతం డబ్బును తీసుకొని మిగతాది చెల్లించేవాడని, ఓడిపోతే వచ్చిన డబ్బును డిస్టిబ్యూటర్లతో కలిసి పంచుకునేవాడని తెలిపారు. నష్టం వచ్చే పరిస్థితి నెలకొంటే పాయింట్స్ అమ్మే వాడుకాదని, లేకుంటే మ్యాచ్ అయిపోయే వరకు పాయింట్స్ విక్రయించే వాడని చెప్పారు. డిస్టిబ్యూటర్లు వీరే... కాగా పుల్లారావు డిస్టిబ్యూటర్లుగా షేక్‌సాదీక్, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్, కోటి, భగత్ అలియాస్ కన్న, ఉపేందర్, సుమన్‌ను నియమించుకున్నాడు. వీరికి ప్రతి నెలా ఔరా 24 బెట్ సంస్థ వాళ్లు 3000 పాయింట్లు విక్రయిన్నారు. వీటిని డిస్టిబ్యూటర్లకు అమ్మగా వారు ప్రజలకు అధిక ధరకు విక్రయించేవారు. కీలక వ్యక్తుల అరెస్ట్ మిర్యాలగూడ అశోక్‌నగర్‌కు చెందిన వేముల పుల్లారా వు త్రిపురారంలో ఐదేళ్లపాటు చిట్టీలను నడిపాడు. మిర్యాలగూడలో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడు. చైతన్యనగర్‌కు చెందిన గోలి శ్రీనివాస్, శాంతినగర్‌కు చెందిన బోలిగొర్ల కోటేశ్వరావు, మోబైల్ షాపు నిర్వహిస్తున్న షేక్ ఇదయతుల్లా, శరణ్య గ్రీన్‌హోంకు చెందిన కనగంటి ఉపేందర్, అశోక్‌నగర్‌కు చెందిన కంబాల సుమన్ మొబైల్ షాపులు నిర్వహిస్తున్నారు. అశోక్‌నగర్‌లో పుల్లారావు ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. షేక్ సాదీక్, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్, భగత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎన్నికలకు ‘ఆర్టీసీ’ సిద్ధం..!
సాక్షి,మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ నిత్యం సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో ముందుండే ఆర్టీసీ సంస్థ ఎన్నికల రూపంలో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను ఈ ఎన్నికల్లో రీజియన్‌కు రూ.32లక్షలకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి 364 ఆర్టీసీ బస్సులతో పాటు 7డీజీటీ(ఆర్టీసీ గూడ్స్)లను ఈ ఎన్నికల్లో రెండు రోజుల పాటు సేవలు అందించనున్నాయి. అందుకుగాను ఒక్కొక్క బస్సుకు రూ.21వేల చొప్పున ఎన్నికల కమిషన్ ఆర్టీసీ సంస్థకు అద్దే రూపంలో చెల్లించనున్నది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ బస్సులను అన్నీ విధాలుగా అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసులు, ఈవీఎంలను తరలించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తోంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఆర్టీసీ అధికారులకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలనుఆర్టీసీ రీజినల్‌కు పంపించిన విషయం విధితమేఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఆర్టీసీ బస్సులను సన్నద్ధం చేయాలని ఇప్పటికే ఆర్ఎంకు అందించిన లేఖలో పేర్కొనడంతో ఆయన ఆదేశాల మేరకు ఎన్నికలకు అవసరమైన ఆర్టీసీ బస్సులను రీజియన్‌లోని కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, నల్లగొండ, నార్కట్‌పల్లి, యాదగరిగుట్ట డీపోలలో అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పొలింగ్ సిబ్బందిని మొదలుకుని పోలీస్ యంత్రాంగం, ఈవీఎంల తరలింపు తదితర రవాణా సౌకర్యాలకు ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపట్టింది. అందులో ప్రధానంగా ఈవీఎంల తరలింపు ఎంతో భద్రతతో కూడిన పని కావడంతో డీపో గ్యారేజీ ట్రాన్స్‌ఫోర్ట్(గూడ్స్)బస్సులో ఈవీఎంలను తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.మరో వైపు ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ఆయా పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డిపోలలోని బస్సులను ఎన్నికల నిర్వహణకు పంపించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 364 బస్సులు : ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, యాదాద్రి భునవగిరి, నల్లగొండ, సూర్యాపేట, నార్కట్‌పల్లి డిపోలకు చెందిన 364 ఆర్టీసీ బస్సులతో పాటు 7 డీజీటీ బస్సులను ఈ ఎన్నికలకు ఆర్టీసీ బస్సులు అవసరమని ఎన్నికల కమిషన్ కోరింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డీపోల్లో సుమారు 800 ఆర్టీసీ బస్సులు ఉండగా అందులో సగానికి పైగా ఎన్నికల నిర్వహణ కోసమే తరలించనున్నారు. ప్రధానంగా డిసెంబరు 6, 7వ తేదీల్లో ఆర్టీసీ బస్సులను ఎన్నికల అధికారులు ఉపయోగించనున్నారు. అయితే నల్లగొండ జిల్లాలో 150 ఆర్టీసీ బస్సులతో పాటు 4డీజీటీ బస్సులు, సూర్యాపేట జిల్లాలోని 150 ఆర్టీసీ బస్సులు రెండు డీజీటీ బస్సులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 64 ఆర్టీసీ బస్సులు ఒక డీజీటీ బస్సును ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉన్నందున నల్లగొండ జిల్లా నుంచి కొన్నింటిని తరలి స్తున్నారు. ఏడు డిపోలు కలిసి 364 ఆర్టీసీ బస్సులు ఎన్ని కల విధుల్లో ఉంటాయి. రెండు రోజుల పాటు ఎన్ని కల వి«ధుల్లో ఉన్నంతరం ఎన్నికలు ముగియగా నే తిరిగి ఏ బస్సులు ఆ డిపోలకు వెళ్లిపోనున్నాయి. ఆర్టీసీకి చేకూరనున్న భారీ ఆదాయం : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ అదనపు ఆదాయాన్ని చేకూర్చుకొనున్నది. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీకి అసెంబ్లీ ఎన్నికలు కొంత వరకు లాభాన్ని చేకురుస్తుంది.ఎన్నికలకు ఉపయోగించే ఆర్టీసీ బస్సులకు ఒక్కదానికి 21వేయి రూపాయలను ఆర్టీసీ సంస్థకు ఎన్నికల అధికారులు చెల్లించనున్నది. ఈ లెక్కన చూస్తే 364 ఆర్టీసీ బస్సులకు రెండు రోజులకు గాను రూ.1.52కోట్ల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఈవీఎంలను తరలించేందుకు ఏర్పాటు చేసే డీజీటీ బస్సులకు మరో రెండు లక్షల 10వేల రూపాయల వరకు ఆదాయం రానున్నది. అన్నీ ఖర్చులు పోను ఒక్కో ఆర్టీసీ బస్సుకు రూ.4 నుంచి 5వేల వరకు మిగులుబాటు ఉండవచ్చని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్టీసీ బస్సులను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బస్సులను ఉపయోగిస్తే ఆ సమయంలో ఒక్కో బస్సుకు కేవలం రూ.14వేల చొప్పున చెల్లించారు. కానీ ప్రస్తుతం పెరిగిన డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులతో ఈ సారి ఒక్కో బస్సుకు రూ.21వెయ్యి వరకు చెల్లించేందుకు ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రెండు రోజులకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో సంస్థ నిర్వహణ ఖర్చులు పోను 25లక్షల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నల్లగొండ రీజియన్‌లో గత ఎప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ సంస్థ ఆరు కోట్ల రూపాయల వరకు నష్టాల్లో ఉందని అంటున్నారు. కాగా బహిరంగం సభలకు కూడా ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో కొంత మేరకు ఆదాయం పెరుగనున్నది. డిసెంబరు 6, 7 తేదీల్లో ఇక్కట్లు : అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో డిసెంబరు 6, 7వ తేదీల నల్లగొండ రీజియన్‌లో పరిధిలో ఆర్టీసీ బస్సులు ఎన్నికల్లో భాగంగా తగ్గనున్నాయి. 7వ తేదీన ఎన్నికలు అయినందున ఒక రోజు ముందుగానే ఆర్టీసీ బస్సులో సిబ్బందిని, ఈవీఎంలను తరలించేందుకు రెండు రోజుల పాటు బస్సులను ఉపయోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో 364 ఆర్టీసీ బస్సులు సగానికి పైగా తగ్గుతుండటంతో ప్రధాన రూట్లు అయిన మిర్యాలగూడ నుంచి దేవరకొండ, కోదాడ, నల్లగొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు బస్సులు తగ్గనున్నాయి. ఈ రెండు రోజులు ఆయా ప్రాంతాలకు సుమారు 10 ఆర్టీసీ బస్సులను మాత్రమే పంపించనున్నారు. అదే విధంగా డిసెంబరు మొదటి వారంలో కూడా పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా అధికంగా ఉన్నందున ఆ బస్సులను ఎన్నికలకు తరలించడంతో ఆ రెండు రోజుల పాటు ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక చర్యలు తీసుకుంటాం: ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ బస్సులను వినియోగించడం వలన కొంత వరకు ఆర్టీసీ బస్సులు తగ్గినప్పటికి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలను చేపడతాం. బస్సులను స్పెషల్ ఆపరేషన్‌ను చేయించి ఇబ్బందులు రాకుండా చర్యలను తీ సుకుంటాం. కాగా డిసెంబరు 6, 7వ తేదీల్లో 48 గంటల పాటు ఆర్టీసీ సంస్థకు ప్రయాణికులు సహకరిం చాలి. – సుధాకర్‌రావు, ఆర్టీసీ డీఎం, మిర్యాలగూడ -
పల్లెలు ప్రశాంతం..!
సాక్షి,మిర్యాలగూడ రూరల్ : శాసన సభ ఎన్నికల పుణ్యమా అని పచ్చని పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇదేంటి అనుకుంటున్నారా.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీస్, ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుండడంతో మండలంలోని గ్రామాల్లో అక్రమంగా నిర్వహించే మద్యం బెల్ట్ షాపులు మూతపడ్డాయి. దీంతో విచ్చల విడిగా మద్యం లభించకపోవడంతో మం దుబాబులు పొద్దుగూకగానే గూటికి చేరుకుంటున్నారు. దీనివల్ల గ్రామాల్లో ప్రశాతంత నెలకొంది. గ్రామాలకి 3–5 బెల్ట్ షాపులు ఎన్నికల ప్రకటన రాక మునుపు ప్రతి మారు మూల పల్లెల్లో సహితం 3నుంచి 5 బెల్ట్ షాపులు అక్రమంగా నిర్వహించేవారు. బెల్ట్ షాపులో ఎప్పుడు మద్యం అయిపోయినా వైన్ షాపు నిర్వాహకులు వెంటనే సరఫరా చేసే వారు. దీంతో మద్యం ప్రియులకు ఎప్పుడుపడితే అప్పుడు మందు అందుబాటులో ఉండేది. నిషేధంతో మహిళలు హర్షం ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఎప్పుడైతే పోలీసులు బెల్ట్‌షాపులపై ఖచ్చితత్వం పాటించారో.. గ్రామాల్లో అక్రమంగా నిర్వహించే బెల్ట్ షాపులు మూత పడ్డాయి. మందు ప్రియులకు విచ్చలవిడిగా మద్యం లభించకపోవడంతో తమ పతులు త్వరగా ఇళ్లకు చేరుతున్నారని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిషేధం కొనసాగించాలి: బెల్టుషాపుల నిషేధం కొనసాగించాలి. వీటి వల్ల గ్రామాల్లో విచ్చల విడిగా మధ్యం లభించడంతో అదుపులేకుండా మద్యం సేవించి రోగ్యం, ఇటు ఆర్థికంగా గుల్ల అయ్యేవారు. బెల్టుషాపుల నిషేధంతో మద్యం అందుబాటులో లేక పోవడంతో మందు ప్రియులు మితిమీరిన చేష్టలు కట్టడి అయ్యాయి. పల్లెలు ప్రశాతంగా మారాయి.–చలెండ్ల పద్మయ్య, అవంతీపురం -
మొదటి రోజు రెండు నామినేషన్లు
సాక్షి,మిర్యాలగూడ : సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల దరఖాస్తులను రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) జగన్నాథరావు స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. కాగా మొదటి రోజు రెండు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుకు అందజేశారు. మిర్యాలగూడకు చెందిన తెలంగాణ యువజన సేవా సంఘం రాష్ట్ర «అధ్యక్షుడు సుంకు శ్రీనువాస్, దామరచర్ల మండలం దూద్య తండాకు చెందిన ధనావత్ లాలునాయక్ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. కాగా నామినేషన్ దాఖలు చేసిన వారిలో సుంకు శ్రీను ఈ ఎన్నికల్లోనే మొదటి సారి నామినేషన్ వేయగా లాలునాయక్ 2014లో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. భారీగా పోలీస్ బందోబస్త్ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ సోమవారం ప్రారంభం కావడంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట పోలీసులు భారీ బందోబస్త్‌ను నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ఓ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కార్యాలయంకు నాలుగు వైపులా బారీ కేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను మళ్లించారు. కార్యాలయం గేటు వద్ద పోలీస్‌లు ప్రత్యేక బందోబస్త్‌ను నిర్వహించి నామినేషన్ల వేసే అభ్యర్థులను ప్రతిపాదింధించే ఓటర్లను మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. నామినేషన్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులకు డీఎస్పీ పలు సూచనలు చేశారు. బందోబస్త్‌లో సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, సదానాగరాజు, రాములు, రమేష్‌బాబులతో పాటు పోలీస్ బలగాలు ఉన్నాయి. -
ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి!
వరంగల్ అర్బన్ : మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఆపధర్మ మంత్రి కేటీఆర్ అనుమతివ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రణయ్ కేసులో రాజకీయ, ఆర్థిక అండదండలతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి ఉందని, ఈ కేసును హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులకు నిజంగా శిక్ష పడాలనే ఆలోచన ఉంటే.. ట్విటర్ ద్వారా స్పందించండం కాదు.. ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు నిందితులను సస్పెండ్ చేయలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు మారుతి రావు అన్ని పార్టీలను గుప్పిట్లో పెట్టుకున్నాడని విమర్శించారు. ప్రణయ్, అమృతలకు ప్రమాదం ఉందని తెలిసినా.. పోలీసులు కాపాడేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మారుతి రావు సెటిల్మెంట్లతో అక్రమాస్తులు కూడగట్టుకున్నాడన్నది అందరికీ తెలుసనని, అధికారుల అండదండలు చూసుకునే అతను ఈ హత్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. హత్యకు గంట ముందు మారుతిరావు వేములపల్లి కట్టమీద డీఎస్పీతో పదిహేను నిమిషాలు మాట్లాడడని అన్నారు. ఈ హత్యకు సంబంధించి నిందితులందరికీ శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన వైఖరిని తెలుపాలని కోరారు. ఈ ఘటన నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 24 వరకు గ్రామ మండల స్థాయిలో ఉదయం నిరసనలు, సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు. -
ప్రణయ్ హత్య వెనుక పలువురు ప్రముఖులు!
సాక్షి, మిర్యాలగూడ : పెరుమాళ్ల ప్రణయ్ హత్య వెనుక తన తండ్రి తిరునగరు మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్‌తో పాటు ఓ తాజా మాజీ ఎమ్మెల్యే, పలువురి ప్రముఖుల హస్తం ఉందని ఆయన భార్య అమృత అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య వెనుక టీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది భరత్‌కుమార్, నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం, వ్యాపారస్తులు రంగా శ్రీకర్, రంగా రంజిత్ కూడా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. తమను విడగొట్టేందుకు వేముల వీరేశం, భరత్, గూడూరు శ్రీను గతంలో ప్రణయ్‌ను, తనను బెదిరించారని అమృత ఆరోపించారు. ఎల్ఐసీ డబ్బులు కట్టలేదని గతంలో ప్రణయ్ నాన్నపై తప్పుడు కేసు పెట్టారని, ఈ విషయంలో తాము ఐజీ దగ్గరికి కూడా వెళ్లామని పేర్కొన్నారు. బిహార్ గ్యాంగ్‌తో తమను బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. ప్రణయ్ హత్యలో ఎంతమంది ఉన్నారో, వారినీ దారుణంగా చంపాలని అమృత డిమాండ్ చేశారు. ఇక.. తనకు అత్తా,మామలే తల్లిదండ్రులని, వీళ్ల దగ్గరే ఉంటానని తెలిపారు. -
మహిళా సంక్షేమమే లక్ష్యం
మిర్యాలగూడ రూరల్ : రైతు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వెంకటాద్రిపాలెం, జప్తివీరప్పగూడెం, తుంగపహాడ్, బాదలాపురం, ఆలగడప, రాయినిపాలెం, గూడూరు, రుద్రారం, కొత్తగూడెం, ఉట్లపల్లి, తక్కెళ్లపహాడ్, తడకమళ్ల గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 359 మందికి రూ.1,83,09,000 కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందజేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పేదలకు ఆడపిల్ల భారం కాకూడదని వారి పెళ్లికి రూ.75,016 అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాడని అన్నారు. మార్చిలో రైతుకు నూతన పాస్ పుస్తకాలు జారీ, మేలో రైతులకు ఎకరాకు రూ.4వేలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ఎంపీపీ ఒగ్గు జానయ్య, వైస్‌ఎంపీపీ నూకల సరళహన్మంతరెడ్డి, జెడ్పీటీసీ మట్టపల్లి నాగలక్ష్మీసైదులు యాదవ్, నాయకులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేడ సురేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు మంజులవెంకటేశ్వర్లు, శశికళ శ్రీనివాసరెడ్డి, వీరమ్మ, ఎంపీటీసీ లలిత, చిట్టిబాబు, చౌగాని భిక్షంగౌడ్, యదగిరి, సైదులు, అశోక్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
మిర్యాలగూడ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగతుర్తి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిహర్ష(2) అనే చిన్నారి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నాగార్జున సాగర్ నుంచి మిర్యాలగూడకు ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమద్యంలో తుంగతుర్తి వద్ద లారీ ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ సంఘటనలో సాయిహర్ష అక్కడికక్కడే మృతి చెందగా తన తల్లిదండ్రులు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. -
మిల్లర్లకు పంట
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో మిల్లర్ల పంట పండుతోంది. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం పేరుకుపోయి కాంటాలు, ఎగుమతులు కాక రోజులు గడుస్తున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న మిల్లర్లు మాత్రం మిల్లుల వద్ద తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఐకేపీ కేంద్రాలతోపాటు మార్కెట్‌కు వచ్చే ధాన్యానికి వివిధ రకాల కొర్రీలు పెడుతున్న మిల్లర్లు నేరుగా మిల్లుల వద్దకు వచ్చే 1010 రకం ధాన్యానికి క్వింటాకు రూ.1200కే కొనుగోలు చేస్తున్నారు. మిర్యాలగూడ సమీపంలోని ఏ మిల్లు వద్ద చూసినా ధాన్యం ట్రాక్టర్లు భారీగా బారులు తీరి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 10లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. కానీ జిల్లాలో ఇప్పటివరకు ఐకేపీ కేంద్రాలలో సుమారుగా 90వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఐకేపీ కేంద్రాలలో మహిళా సంఘాల వారు కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకోవడానికి మిల్లర్లు నానా ఇబ్బందులు పెడుతున్నారు. మిల్లుల వద్ద దోపిడీ మిల్లుల వద్దకు నేరుగా ధాన్యం తీసుకొచ్చే రైతులకు క్వింటాకు రూ.1100 నుంచి రూ.1200 లోపు మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్ లోడు ధాన్యానికి హమాలీ ఖర్చుతో పాటు రవాణా చార్జీలు ఉన్నప్పటికీ రైతుకు వెయ్యి రూపాయల అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్ని రైస్‌మిల్లుల్లో ధాన్యం ధర నిర్ణయించిన తర్వాత కూడా దిగుమతి కాగానే తక్కువ ధర ఇస్తామని, లేకుంటే తిరిగి తీసుకెళ్లమని కొర్రీలు పెడుతున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకుంటే రోజుల తరబడి గడపాల్సి వస్తున్నందున నష్టపోతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. అవంతీపురం మార్కెట్లో పేరుకుపోయిన ధాన్యం మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం పేరుకుపోయింది. సోమవారం 77వేల బస్తాల ధాన్యం మార్కెట్‌కు రావడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. అయినా కేవలం కాంటాలు మాత్రమే వేసి ఎగుమతులు మాత్రం నిలిపివేశారు. మిల్లర్ల హమాలీలు కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నందున ఎగుమతులు నిలిచిపోయాయి. ఒక్కరోజు మార్కెట్లో టెండర్లు నిర్వహిస్తే కాంటాలు, ఎగుమతి అయ్యే వరకు మూడు రోజులకు పైగా సమయం పడుతుంది. దీంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే గడపాల్సి వస్తుంది. -
రూ.లక్షతో ఉడాయింపు
నకిలీ బంగారం తాకట్టుపెట్టి.. బాదలాపురం (మిర్యాలగూడ క్రైం), న్యూస్‌లైన్ : మహిళ వద్ద నకిలీ బంగారం తాకట్టుపెట్టి లక్ష రూపాయలతో ఓ జంట ఉడాయించింది. ఈ ఘటన బాదలాపురం గ్రామపంచాయతీ పరిధి అవంతీపురంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పర్వతం ఎల్లమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జంట తమ పేర్లు శివ, లక్ష్మి అని, తమది పుట్టపర్తి అని చెప్పుకుంటూ వారం రోజులుగా గ్రామంలో తుంగచాపల వ్యాపారం నిర్వహిస్తున్నారు. చాపలు విక్రయించిన తర్వాత రాత్రివేళ అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 28వ తేదీన తన అల్లుడికి ప్రమాదం జరిగిందని, డబ్బులు అవసరముందని లక్ష్మి, శివలు రోదిస్తూ ఎల్లమ్మతో తెలి పారు. తమవద్ద ఉన్న బంగారు బిల్లలు తాకట్టు పెట్టుకొని లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. ఒక బిల్లను పరిశీలించుకోమని ఇచ్చారు. ఆ బిల్ల బంగారపుదే కావడంతో ఎల్లమ్మ నమ్మి తన బిడ్డ పెళ్లి కోసం దాచిన లక్ష రూపాయలను వారికి ఇచ్చింది. రెండురోజుల్లో వచ్చి తమ బంగారం తీసుకెళతామని చెప్పి శివ, లక్ష్మి వెళ్లిపోయారు. వారం రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లేకపోవడంతో అనుమానం వచ్చి బిల్లలను పరీక్ష చేయించగా నకిలీవని తేలాయి. దీంతో ఆమె లబోదిబోమంటూ మంగళవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ప్రొబేషనరీ డీఎస్పీ విజయ్‌భాస్కర్ తెలిపారు. -
డీఈఓ జగదీష్‌కు పోలీసు రక్షణ
మిర్యాలగూడ, జిల్లా విద్యాశాఖాధికారి ఆచార్య ఎన్.జగదీష్‌కు పోలీసు రక్షణ ఏర్పాటు చేయనున్నారు. వివిధ కారణాల రీత్యా తనకు కొందరి వల్ల ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని డీఈఓ పోలీసుశాఖకు లేఖ రాశారని సమాచారం. వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరించిన పోలీసు శాఖ ఆయనకు గన్మెన్ల రక్షణ ఇవ్వడానికి అంగీకరించింది. డీఈఓ జగదీష్ జిల్లాలో పలువురు ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. ఆయన జిల్లాలో బాధ్యతలు చేపట్టాక విద్యాశాఖలో పాత రికార్డులను తిరగేస్తూ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో మెడికల్ బిల్లులు కాజేశారని 121 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులకు ఫిర్యాదు చేశారు. 63 మంది ఉపాధ్యాయులు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందారని, 33 మంది ఉపాధ్యాయులు నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని, 8 మంది నకిలీ సర్టిఫికెట్లతో డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సంపాదించారని, అక్రమాలకు పాల్పడ్డారని ముగ్గురు డీఈఓ కార్యాలయ ఉద్యోగులపై, మొత్తంగా 300 మందికిపైగా క్రిమినల్ కేసులు పెట్టించారు. డీఈఓ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కావడం కూడా ఓ పెద్ద వివాదంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు ఏమైనా హాని జరగవచ్చని భావించిన డీఈఓ పోలీసు శాఖ రక్షణ కోరినట్లు సమాచారం. గన్‌మెన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు - జగదీష్, డీఈఓ, నల్లగొండ పోలీసు ప్రొటెక్షన్ ఇస్తామని, గన్‌మెన్ ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ధ్రువీకరించారని డీఈఓ జగదీష్ వివరించారు. 24 గంటల సెక్యూరిటీని ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారని, తాను కూడా అందుకు అంగీకరించానన్నారు. మరో పది రోజుల్లో గన్‌మెన్‌ను ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
రైతులకు ‘వర్రీ’
వరుస తుపాన్లు, తెగుళ్లతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోకపోగా.. మరింత కష్టాల్లోకి నెడుతోంది. సాగర్ ఎడమ కాల్వ కింద మేజర్లకు మంగళవారం నుంచి నీటిని బంద్ చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వరినాట్లు వేసి పుల్క కట్టే సమయంలో నీరు నిలిపి వేయడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఎడమ కాల్వకింద సుమారు 3.5లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. అందులో సుమారు 40వేల నుంచి 50వేల వరకు రెండు మూడు రోజుల క్రితం నాట్లు వేసినవే. సకాలంలో వరిపంటకు పుల్క కట్టకపోతే దిగుబడి తీవ్రంగా తగ్గే ప్రమాదముందని రైతులు భయపడుతున్నారు. మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సీజన్లోనే తుపాను, దోమకాటు వల్ల వరి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. కాగా రబీలోనైనా వరి సాగు చేసుకోవచ్చని భావించిన రైతులకు నాట్లు పూర్తి కాకముందే నీటిని నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్‌కు గాను వరి నాట్లకోసం డిసెంబర్ 20వ తేదీ నుంచి ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా అప్పట్లో ఖరీఫ్ వరి కోతలు సాగుతున్నందున నార్లు సిద్ధంగా లేకపోవడంతో రైతులు వరి నాట్లు వేసుకోలేదు. కాలువ చివరి భూములకు నీరు అందే వరకు ఆలస్యం కావడం వల్ల ఇప్పటికి కూడా నాట్లు పూర్తి కాలేదు. అయినా వారబందీ పద్ధతి ప్రకారం ఈ నెల 4వతేదీన(మంగళవారం) ఎడమ కాలువ పరిధిలోని మేజర్లుకు నీటిని నిలిపివేశారు. దాంతో రైతులు దిక్కతోచని స్థితిలో ఉన్నారు. రబీ సీజన్లో సాగర్ ఎడమ కాలువ పరిధిలో కేవలం 4,31,325 ఎకరాలకే సాగునీటిని అందించడానికి 50 టీఎంసీల నీటిని కేటాయించారు. కాగా ఇప్పటి వరకు 24 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎన్ఎస్పీ అధికారులు ప్రకటించారు. మిగతా 26 టీఎంసీల నీటిని నాలుగు విడతలుగా అందించనున్నారు. 9న తిరిగి నీటి విడుదల వారబందీ పద్ధతిలో ఈ నెల 4న సాగర్ ఎడమ కాలువ పరిధిలోని మేజర్లకు నీటిని నిలిపి వేసిన అధికారులు తిరిగి ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ముందుగా ప్రకటించినట్లుగా నాలుగు విడతలుగా నీటిని విడుదల చేయనున్నారు. వరి నాట్లు పూర్తికాని రైతులతో పాటు ఇటీవల రెండు, మూడు రోజుల క్రితం నాట్లు వేసిన వరి పొలాలు కూడా వరుసగా ఐదు రోజుల పాటు నీళ్లు లేకుంటే ఎండిపోయే పరిస్థితి వచ్చింది. బీళ్లుగా భూములు పదేళ్లుగా దామరచర్ల మండలం ముదిమాణిక్యం, వజీరాబాద్లలోని భూములకు ఎన్ఎస్పీ కాలువల ద్వారా నీరు అందడం లేదు. ఈ గ్రామాల పేర్లు మేజర్లకు పెట్టారు. కానీ నీళ్లు మాత్రం అందడం లేదు. ముదిమాణిక్యం మేజర్ కాలువ పరిధిలో 25 వేల ఎకరాల ఆయకట్టు, వజీరాబాద్ మేజర్ కాలువ పరిధిలో 32 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ ఇప్పటి వరకు కాలువ చివరి భూములకు నీళ్లు చేరకపోవడంతో బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. -
కూపన్ సరే..రేషన్ ఏదీ?
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: లబ్ధిదారులకు రేషన్‌కార్డులు ఉన్నా సరుకులు అందని పరిస్థితి నెలకొంది. టెంపరరీ రేషన్‌కార్డులు, కూపన్ల పంపిణీపై శ్రద్ధ వహించిన అధికారులు వాటికి రేషన్ కోటాను జారీ చేయడాన్ని విస్మరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 43వేల మంది లబ్ధిదారులు రేషన్ కోసం నిరీక్షిస్తున్నారు. రెండో విడత రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకున్న వారిలో 43వేల మందిని అర్హులుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీరి నుంచి ఫొటోలు సేకరించారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో వీరికి టెంపరరీ కార్డులతో పాటు రేషన్ కూపన్లు పంపిణీ చేశారు. డిసెంబర్ నెలతో పాటు 2014 జూన్ వరకు గాను రేషన్ దుకాణాల్లో సరుకులు తెచ్చుకోవడానికి వీలుగా కూపన్లు పంపిణీ చేశారు. కానీ అధికారులు రేషన్ కోటా జారీ చేయడం మరిచారు. దాంతో లబ్ధిదారులు డిసెంబర్ నెల కూపన్‌ను తీసుకుని రేషన్‌దుకాణానికి వెళ్తే కోటా రాలేదని డీలర్లు చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొత్త కార్డులకు డిసెంబర్ నెల కోటాకు సంబంధించి డీలర్లు డీడీలు చెల్లించకపోవడం వల్ల రేషన్‌ను పంపిణీ చేయడం లేదు. దాంతో డిసెంబర్ నెల కూపన్ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనమూ లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. దుకాణాల్లో నిండుకున్న సరుకులు ఇప్పటికే జిల్లాలో 9.35 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. కాగా కొత్తగా రెండవ రచ్చబండలో దరఖాస్తులు చేసుకున్న వారిలో 65,962 మందిని అర్హులుగా గుర్తించారు. కానీ సుమారు 43 వేల మంది కుటుంబాలకు సంబంధించిన ఫొటోలను రెవెన్యూ అధికారులు సేకరించారు. కాగా వారందరికీ డిసెంబర్ నెల నుంచే రేషన్ సరుకులు ఇవ్వడానికి కూపన్లు ఇచ్చారు. కానీ ఈ నెల గడువు ముగుస్తున్నా సరుకులు మాత్రం దుకాణాలలో లేవు. ఈ నెల కూపన్లకు లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులకు తెలిసినా డీడీలు కట్టేలా డీలర్లను ఆదేశించకపోవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.