మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో మిల్లర్ల పంట పండుతోంది. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం పేరుకుపోయి కాంటాలు, ఎగుమతులు కాక రోజులు గడుస్తున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న మిల్లర్లు మాత్రం మిల్లుల వద్ద తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఐకేపీ కేంద్రాలతోపాటు మార్కెట్‌కు వచ్చే ధాన్యానికి వివిధ రకాల కొర్రీలు పెడుతున్న మిల్లర్లు నేరుగా మిల్లుల వద్దకు వచ్చే 1010 రకం ధాన్యానికి క్వింటాకు రూ.1200కే కొనుగోలు చేస్తున్నారు. మిర్యాలగూడ సమీపంలోని ఏ మిల్లు వద్ద చూసినా ధాన్యం ట్రాక్టర్లు భారీగా బారులు తీరి ఉన్నాయి.
జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో 10లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. కానీ జిల్లాలో ఇప్పటివరకు ఐకేపీ కేంద్రాలలో సుమారుగా 90వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఐకేపీ కేంద్రాలలో మహిళా సంఘాల వారు కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకోవడానికి మిల్లర్లు నానా ఇబ్బందులు పెడుతున్నారు.
మిల్లుల వద్ద దోపిడీ
మిల్లుల వద్దకు నేరుగా ధాన్యం తీసుకొచ్చే రైతులకు క్వింటాకు రూ.1100 నుంచి రూ.1200 లోపు మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్ లోడు ధాన్యానికి హమాలీ ఖర్చుతో పాటు రవాణా చార్జీలు ఉన్నప్పటికీ రైతుకు వెయ్యి రూపాయల అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్ని రైస్‌మిల్లుల్లో ధాన్యం ధర నిర్ణయించిన తర్వాత కూడా దిగుమతి కాగానే తక్కువ ధర ఇస్తామని, లేకుంటే తిరిగి తీసుకెళ్లమని కొర్రీలు పెడుతున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకుంటే రోజుల తరబడి గడపాల్సి వస్తున్నందున నష్టపోతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు.
అవంతీపురం మార్కెట్‌లో పేరుకుపోయిన ధాన్యం
మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం పేరుకుపోయింది. సోమవారం 77వేల బస్తాల ధాన్యం మార్కెట్‌కు రావడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. అయినా కేవలం కాంటాలు మాత్రమే వేసి ఎగుమతులు మాత్రం నిలిపివేశారు. మిల్లర్ల హమాలీలు కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నందున ఎగుమతులు నిలిచిపోయాయి. ఒక్కరోజు మార్కెట్‌లో టెండర్లు నిర్వహిస్తే కాంటాలు, ఎగుమతి అయ్యే వరకు మూడు రోజులకు పైగా సమయం పడుతుంది. దీంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు రోజుల తరబడి మార్కెట్‌లోనే గడపాల్సి వస్తుంది.
మిల్లర్లకు పంట
Published Wed, May 7 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM
Advertisement
Advertisement