నకిలీ..మకిలీ..! | Fraud Pesticides Buisiness Doing In Nalgonda | Sakshi
Sakshi News home page

నకిలీ..మకిలీ..!

Published Sat, Nov 9 2019 8:02 AM | Last Updated on Sat, Nov 9 2019 9:21 AM

Fraud Pesticides Buisiness Doing In Nalgonda  - Sakshi

సాక్షి, మిర్యాలగూడ : నకిలీ పురుగు మందుల వ్యాపారానికి మిర్యాలగూడ పట్టణం అడ్డాగా మారింది. వేల రూపాయలు వెచ్చించి పురుగు మందులు కొనుగోలు చేస్తున్న రైతులు తెగుళ్లు తగ్గకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులను నకిలీ పురుగు మందులు మరింత అఘాతంలోకి నెడుతున్నాయి. నాణ్యమైన మందులు కాకుండా ఎక్కువ శాతం లాభాలు వచ్చే వాటిని ఫర్టిలైజర్‌ దుకాణాల యజమానులు రైతులకు మాయమాటలు చెప్పి విక్రయిస్తున్నారు.

అంతే కాకుండా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు తెగుళ్లపై అవగాన కల్పించి ఏ మందులు పిచికారీ చేయాలో తెలియజేయడం లేదు. దీంతో రైతులు ఫర్టిలైజర్‌ దుకాణ యజమాని చెప్పిన మందులను తీసుకెళ్లడంతో తెగుళ్లు అలాగే ఉంటున్నాయి. చివరికి రైతు జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టులో పరిధిలో వరి పంటలతో పాటు పత్తి సాగు చేస్తున్నారు.  

రైతులు ఎక్కువగా చీడ పీడలు ఆశిస్తే నేరుగా పురుగుమందుల దుకాణానికి వెళ్లి వారు చెప్పిన మందునే కొనుగోలు చేస్తున్నారు. వరి, పత్తి పంటలకు ప్రధానంగా వేరుకుళ్లు, ఆకుమచ్చ, ఆకు ముడత, తెల్లమచ్చ, తెల్లదోమ, లద్దెపురుగు, రసం పీల్చే పురుగు, ఎండు తెగుళ్లు సోకుతాయి. కానీ నకిలీ మందుల కారణంగా చీడపీడలు తగ్గకపోవడంతో రైతులు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

బయో ఉత్పత్తులకు అడ్డాగా..
బయో కెమికల్స్‌ పేరుతో రైతులను మరింత మోసానికి గురి చేస్తున్నారు. బయో కెమికల్స్‌ను ఎక్కువగా పండ్ల తోటలకు ఎంతో ఉపయోగకరమని ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. దీంతో వాటిని రైతులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. రైతుల ఆలోచనలను ఆసరాగా చేసుకున్న కొంత మంది నకిలీ బయోకెమికల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు.

గత ఏడాది మిర్యాలగూడలో 5.89 లక్షల విలువైన నకిలీ బయో ఉత్పత్తులను విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నకిలీ పురుగుమందులు, బయో ఉత్పత్తుల్లో నకిలీ మందులు తయారు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.

కంపెనీ పేర్లతోనే మోసం
వరి, పత్తి పంటలకు సోకే తెగుళ్ల నివారణకు ఎక్కువగా మోనోఎస్ఫేట్, ఫ్రైడ్, కాన్ఫిడార్, ట్రైజోపాస్, ప్రోగ్నోఫాన్, క్లోరిఫైరీఫాస్, ఫోరేట్‌ గుళికలు, ఫోర్‌జీ, త్రిజీ గుళికలు, పాస్పామిడాన్‌లు ఉపయోగిస్తారు. ఆయా కంపెనీల పేర్లతోనే రైతులు గుర్తించలేని విధంగా తయారు చేసి నకిలీ మందులను అంటగడుతున్నారు. ఫ్రైడ్‌ కంపెనీకి చెందిన ‘ఫేమ్‌’ అకుముడత నివారణ మందును అదే పేరుతో నకిలీది దిలావర్‌పూర్‌ గ్రామానికి చందిన రైతు రాజశేఖర్‌రెడ్డికి ఇటీవల విక్రయించారు.  

నకిలీ మందును విక్రయించినట్లుగా గుర్తించి రైతు, ఆ కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ మందుల విక్రయం వెలుగులోకి వచ్చింది. బ్యాచ్‌ నంబర్లు లేకుండా ఇష్టానుసారంగా మందులు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నకిలీ పురుగు మందులు విక్రయిస్తే చర్యలు 
నకిలీ పురుగు మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవల నకిలీ పురుగు మందులు విక్రయించినట్లుగా ఫిర్యాదు వచ్చింది. మిర్యాలగూడ పట్టణంలో పురుగు మందుల దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. నకిలీ మందులు విక్రయిస్తున్నట్లుగా మా దృష్టికి వస్తే తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటాం. 
– శ్రీనివాస్, ఏఓ, మిర్యాలగూడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement