వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రంగనాథ్
సాక్షి, నల్లగొండ క్రైం : మిర్యాలగూడ కేంద్రంగా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యుల గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.ఐదు లక్షల 18 వేల 500 నగదు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ రంగనాథ్ తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ప్రధానసూత్రధారి వేముల పుల్లారావుతో పాటు అతడి అనుచరులు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
వేముల పుల్లారావు గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామం నుంచి 20 ఏళ్ల క్రితం త్రిపురారం వచ్చి కిరాణ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాడని, మూడేళ్ల నుంచి స్నేహితులతో కలిసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కొంత నష్టం రావడంతో తానే సొంతంగా బొంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ సంస్థ నుంచి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని నెలకు రూ.15 వేలు యాప్ సంస్థకు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.
పరిచయం ఉన్న స్నేహితుల నుంచి సులభంగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో క్రికెట్ యాప్‌తో పాయింట్స్ ఆధారంగా, ఒక పాయింట్‌కు రూ.100 వసూలు చేస్తాడని, బెట్టింగ్ విస్తరణకు కొందరిని డిస్టిబ్యూటర్లుగా నియమించుకున్నాడని వివరించారు.బెట్టింగ్‌లో కస్టమర్ గెలిస్తే గెలిసిన డబ్బులో 5 శాతం డబ్బును తీసుకొని మిగతాది చెల్లించేవాడని, ఓడిపోతే వచ్చిన డబ్బును డిస్టిబ్యూటర్లతో కలిసి పంచుకునేవాడని తెలిపారు. నష్టం వచ్చే పరిస్థితి నెలకొంటే పాయింట్స్ అమ్మే వాడుకాదని, లేకుంటే మ్యాచ్ అయిపోయే వరకు పాయింట్స్ విక్రయించే వాడని చెప్పారు.
డిస్టిబ్యూటర్లు వీరే...
కాగా పుల్లారావు డిస్టిబ్యూటర్లుగా షేక్‌సాదీక్, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్, కోటి, భగత్ అలియాస్ కన్న, ఉపేందర్, సుమన్ను నియమించుకున్నాడు. వీరికి ప్రతి నెలా ఔరా 24 బెట్ సంస్థ వాళ్లు 3000 పాయింట్లు విక్రయిన్నారు. వీటిని డిస్టిబ్యూటర్లకు అమ్మగా వారు ప్రజలకు అధిక ధరకు విక్రయించేవారు.
కీలక వ్యక్తుల అరెస్ట్
మిర్యాలగూడ అశోక్‌నగర్‌కు చెందిన వేముల పుల్లారా వు త్రిపురారంలో ఐదేళ్లపాటు చిట్టీలను నడిపాడు. మిర్యాలగూడలో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడు. చైతన్యనగర్‌కు చెందిన గోలి శ్రీనివాస్, శాంతినగర్‌కు చెందిన బోలిగొర్ల కోటేశ్వరావు, మోబైల్ షాపు నిర్వహిస్తున్న షేక్ ఇదయతుల్లా, శరణ్య గ్రీన్‌హోంకు చెందిన కనగంటి ఉపేందర్, అశోక్‌నగర్‌కు చెందిన కంబాల సుమన్ మొబైల్ షాపులు నిర్వహిస్తున్నారు. అశోక్‌నగర్‌లో పుల్లారావు ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. షేక్ సాదీక్, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్, భగత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment