Online activities
-
సోషల్ మీడియాలో కనపడని పార్టీల సైన్యం!
ఒకప్పుడు.. ఎన్నికల ప్రచారమంటే ఊరూరా పార్టీలు, నాయకుల ర్యాలీలు.. మైకులలో హోరెత్తే ప్రసంగాలు.. ప్రచార పాటలతో తిరిగే వాహనాలు మాత్రమే అన్నట్టుండేది. ప్రతి పార్టీకి, అభ్యర్థికి వారి మద్దతుదారులే ప్రచార సేనగా ఉండేవారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా సైన్యం ఎన్నికల కదనంలో తెరవెనుక ఉంటూ కనిపించని యుద్ధం చేస్తోంది. ఓటర్లపై దీని ప్రభావం ఎక్కువే ఉంటుండటంతో.. ప్రతి పార్టీ ప్రత్యేకంగా తమకంటూ ఓ సోషల్ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. కొన్ని పార్టీల నేతలు, కొత్తగా ఎన్నికల్లో పోటీలో దిగుతున్నవారు కూడా సైతం ఎవరికి వారు సొంతంగా సోషల్ టీంలను పెట్టుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారం ఎలా ఉండబోతోంది, సాంకేతికంగా దీని వెనుకదాగున్న అంశాలపై కథనం.. – సాక్షి , హైదరాబాద్ ‘సోషల్’ప్రచారం.. ఎందులో ఎలా? ఫేస్బుక్లో ప్రత్యేక పేజీలు, ఖాతాలు సృష్టించి ప్రమోషన్.. ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ ద్వారా.. ట్విట్టర్ (ఎక్స్)లో హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా.. యూట్యూబ్ చానల్స్‌లో ఎక్కువ లైక్స్, వ్యూస్ వచ్చేలా చేయడం. సోషల్ మీడియా వాడకం సూక్ష్మంగాఇలా.. ♦ కంటెంట్ క్రియేషన్ ♦ కంటెంట్ ప్రమోషన్ అండ్ ట్రెండింగ్ ♦ సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ ♦ కంటెంట్ క్రియేషన్.. కంటెంట్ రైటర్లు.. కంటెంట్ క్రియేషన్.. కంటెంట్ రైటర్లు.. సోషల్ మీడియాలో మంచి ప్రచారం పొందాలంటే ఓటర్లను ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా.. అనుకూల ఓటరుగా మార్చేలా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, వీడియో, ఆడియో సందేశాలు ఉండాలి. ఇందుకే అన్ని రాజకీయ పార్టీలు కంటెంట్ రైటర్లను, క్రియేటర్లను నియమించుకుంటున్నాయి. నేతలు కూడా వ్యక్తిగత సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ కంటెంట్ క్రియేటర్లు రోజువారీగా వారికి ఇచ్చిన టార్గెట్ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు, సదరు రాజకీయ పార్టీ లేదా పోటీలో ఉన్న నాయకుడి గురించిన సానుకూల అంశాలు.. ప్రత్యర్థి పార్టీ, అభ్యర్థుల బలహీనతలపై విమర్శలతో కంటెంట్‌ను రాసి ఇస్తూ ఉంటారు. కంటెంట్ ప్రమోషన్ అండ్ ట్రెండింగ్.. కంటెంట్ రైటర్ల ద్వారా తీసుకున్న అంశాలతో తయారు చేసిన కథనాలు, ఆడియోలు, వీడియోలు, ఫొటోలను టార్గెట్‌గా పెట్టుకున్న అసెంబ్లీ సెగ్మెంట్, జిల్లా లేదా రాష్ట్రం మొత్తంగా ఓటర్లకు వివిధ రకాల సోషల్ మీడియా వేదికల ద్వారా చేర్చడమే కంటెంట్ ప్రమోషన్. ఇందుకోసం కంటెంట్ ప్రమోటర్లు తొలుత ఆ రాజకీయపార్టీ, నేతల పేరిట ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ చానళ్లు, వాట్సాప్ గ్రూపులు, చానళ్లు వంటివి సృష్టిస్తారు. సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ సోషల్ మీడియా అనేది బయటికి కనిపించని డిజిటల్ ప్రపంచం. అందులో మనం పోస్ట్ చేస్తున్న, వైరల్ చేస్తున్న కంటెంట్‌ను, వీడియోలు, ఫొటోలు, సమాచారం, ఆడియో మెసేజ్‌లు ఎంత వరకు టార్గెట్ ఓటర్లకు చేరుతుంది. ఒకవేళ చేరకపోతే ఎందుకు చేరడం లేదు? టార్గెట్ ఓటర్ను ఆకర్షించేలా ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి ప్రమోషన్ చేస్తున్నాయి? వాటిని కౌంటర్ చేయాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలన్న అంశాలను విశ్లేషించడాన్నే స్థూలంగా సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్‌గా చెప్పొచ్చు. దీని ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా కంటెంట్‌లో ఎలాంటి మార్పులు చేయాలనేది కంటెంట్ రైటర్లకు సూచనలు చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో అంశాలనే కాకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ప్రజల నాడి తెలుసుకోవడం కూడా ఈ సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ టీమ్‌ల పనిగా చెప్పొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సోషల్ మీడియాతో.. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆన్లైన్ డిబేట్లు, సోషల్ మీడియాలో గట్టి ప్రచారంతో ఆయన ముందంజలో నిలుస్తున్నారని అక్కడి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరింత ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు. హ్యాకింగ్ టీమ్‌లతో గుట్టు తెలుసుకుంటూ.. పలు రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు, నేతల వ్యూహాలను తెలుసుకోవడం కోసం సైబర్ హ్యాకింగ్ నిపుణుల సేవలనూ వాడుకుంటున్నారు. సోషల్ మీడియా పెనెట్రేటింగ్ టూల్స్‌ను వినియోగించి.. కీలక వివరాలు సేకరించి, తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నారు. ప్రచార ట్రెండ్ మారింది.. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను చేరేందుకు సోషల్ మీడియా అనేది రాజకీయ పార్టీలకు, నేతలకు అస్త్రంగా మారింది. ఓటర్లకు మన బలాన్ని చెప్పడంతోపాటు ఎదుటి వ్యక్తి బలహీనతలపై ఓటర్లను ఆలోచింపజేసేలా ఈ డిజిటల్ ప్రచారం ఉపయోగపడుతోంది. పార్టీలే కాదు అభ్యర్థులు సైతం సొంతంగా సోషల్ మీడియా ప్రచార టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాట్సాప్ చానల్.. నయా ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ ఉండి, ఇంటర్నెట్ వాడే ఉన్న ప్రతి ఒక్కరూ వాడుతున్న సోషల్ మీడియా యాప్ అంటే వాట్సాప్ అని టక్కున చెప్పేయొచ్చు. ఇందులో ఇటీవల జతచేసిన సరికొత్త చానల్ ఫీచర్ సైతం ఎన్నికల వేళ అభ్యర్థులకు, ఆయా పార్టీలకు బాగా ఉపయోగపడుతోంది. ఈ వాట్సాప్ చానల్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. వాట్సాప్ చానల్లో సదరు పార్టీలు, నాయకులు తమ కంటెంట్‌ను వైరల్ చేస్తూ ఓటర్లకు చేరుతున్నారు. ఇది కూడాకంటెంట్ ప్రమోషన్‌గా చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్స్.. టిక్‌టాక్ వీడియోలు, హెల్త్, యోగా, ఫ్యాషన్ ఇలా పలు అంశాలపై సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇన్ఫ్లూయెన్సర్ల (సోషల్ మీడియాలో ప్రభావవంతమైన వ్యక్తులు)కు డబ్బు చెల్లించి ఒప్పందం చేసుకోవడం ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మరో విధానం. మనం చెప్పదలచుకున్న అంశాలపై వీడియోలు, లింక్‌లు ఇస్తే.. వాటిని లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని షేర్ చేస్తారు. ఇందులో ఇన్ఫ్లూయెన్సర్ల ఫాలోవర్స్‌కు సదరు రాజకీయ పార్టీ లేదా నేత కంటెంట్‌ను చేర్చుతున్నారు. ఒక్కో చోట..ఒక్కోలా.. ♦ ఫేస్బుక్లో పార్టీ లేదా నాయకుడి కంటెంట్, ఆడియోలు, వీడియోలు, ఫొటోలు ఓటర్లకు చేరాలనుకుంటే అధికారికంగానే ఫేస్బుక్ యాడ్ సెన్స్‌లో ప్రమోషన్‌కు కొంత డబ్బులు చెల్లిస్తే చాలు. స్పాన్సర్డ్ ప్రకటనలు వైరల్ అవుతాయి. ఇందుకోసం మనం ఇచ్చిన వివరాలతో ఫేస్బుక్ ఓ జియోఫెన్సింగ్ క్రియేట్ చేస్తుంది. దాని ఆధారంగా ఈ కంటెంట్ వెళ్లేలా చేస్తారు. ♦ గూగుల్ యాడ్ సెన్స్‌లోనూ డబ్బులు చెల్లిస్తే.. ఫేస్బుక్ లింక్, యూట్యూబ్ లింక్, ఇన్‌స్ట్రాగామ్ లింక్ అందులో షేర్ చేస్తారు. ఇలా కూడా కంటెంట్ ప్రమోషన్ చేస్తున్నారు. గూగుల్లోకి వెళ్లి సెర్చ్ చేయగానే మనం ప్రమోట్ చేయాలనుకున్న లింక్‌లు హైలెట్ అయ్యేలా చేయడమే గూగుల్ యాడ్ సెన్స్. -
నవ యువ ఇన్వెస్టార్స్
‘ఎంజాయ్ చేద్దాం...దీంతో పాటు పొదుపు కూడా చేద్దాం’ అంటుంది యువతరం. పొదుపు సంగతి పక్కన పెడితే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ లెక్కల ప్రకారం మిలీనియల్స్, జెన్–జెడ్ నుంచి మదుపు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. కోవిడ్ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకున్న టెక్–శావీ యంగర్ జనరేషన్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌లపై అధిక ఆసక్తి ప్రదర్శిస్తోంది. దిల్లీకి చెందిన ప్రియాంక భాటియా మంచి ఉద్యోగమే చేస్తోంది. అయితే సహ ఉద్యోగులు సొంత ఇల్లు కొనుక్కున్నారుగానీ తాను మాత్రం కొనలేకపోయింది. దీనికి కారణం ఆ ఉద్యోగులకు ఎక్కువమొత్తంలో పొదుపు చేసే అలవాటు ఉండడం. తానేమో బాగా ఖర్చు చేస్తుంది. ‘ఇలా అయితే ఇక కష్టం’ అనుకున్న ప్రియాంక కొత్త అడుగులు వేసింది. స్టాక్ ఇన్వెస్టర్, ప్రాపర్టీ ఇన్వెస్టర్, బిజినెస్ కోచ్... మొదలైన వారితో మాట్లాడటం, పుస్తకాలు చదవడం, వర్క్‌షాప్‌లకు హాజరు కావడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకోగలిగింది. ఆ తరువాత స్టాక్మార్కెట్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయింది. పొదుపుపై అధికదృష్టి పెట్టింది. ఉద్యోగానికి రాజీనామా చేసి వావ్ (ఉమెన్ ఆన్ వెల్త్) ఫైనాన్షియల్ కోర్స్‌ను రూపొందించి ‘ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్’ పేరుతో శిక్షణ ఇస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ప్రియాంకకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువమంది యువతరమే. ఇండోర్‌కు చెందిన రాజ్ షమని డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు మంచి ఇన్వెస్టర్ కూడా. సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘పొదుపు చేయడం అనేది కూడా ఒక కళ. సరిౖయెన పద్ధతిలో పొదుపు చేయడం ఎలా?’ అనే టాపిక్‌పై రాజ్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ‘పర్సనల్ ఫైనాన్స్ నుంచి పాసివ్ ఇన్కమ్ వరకు యువతరం రకరకాల విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంది. అయితే కేవలం ఆసక్తి మాత్రమే సరిపోదు. స్టాక్‌మార్కెట్ నుంచి క్రిప్టో కరెన్సీ వరకు అవగాహన లేకుండా దిగితే నష్టాలు మూటగట్టుకోవాల్సి ఉంటుంది.’ అంటున్నారు ఆర్థికనిపుణులు. అయితే యువ ఇన్వెస్టర్లు ‘ఇన్వెస్ట్మెంట్’ను ఆషామాషీగా తీసుకోవడం లేదు. కేవలం ఉత్సాహంతో మాత్రమే ఇన్వెస్టర్ అవతారం ఎత్తడం లేదు. చాలా సీరియస్‌గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్, న్యూస్ ఆర్టికల్స్‌ను చదువుతున్నారు. తమ నిర్ణయాలపై నిపుణుల సలహాలు తీసుకొని వాటిని క్రాస్‌చెక్ చేసుకుంటున్నారు. వాట్సాప్‌లో ‘ఫైనాల్షియల్ ఇన్ఫో’ అనే గ్రూప్‌లో ఇన్వెస్ట్మెంట్, లాస్ గురించి చర్చలు జరుగుతుంటాయి. దీన్ని క్రియేట్ చేసింది ట్వంటీ ప్లస్ యువతరమే. బెంగళూరుకు చెందిన రీతిక ఇంజనీరింగ్ స్టూడెంట్. తన దగ్గర ఉన్న చిన్న పొదుపు మొత్తాలు, క్యాష్గిఫ్ట్లు అన్నీ కలిపి ఇన్వెస్ట్ చేసింది. ‘ఏ కంపెనీ బెటర్? ఏ విధంగా?’ అనే కోణంలో రకరకాలుగా స్టడీ చేసింది రీతిక. చెన్నైకి చెందిన ఇరవై మూడు సంవత్సరాల హర్షితకు పుస్తకాలు చదవడం అంటే బొత్తిగా ఇష్టం ఉండదు. అయితే ఇటీవల కాలంలో ఆమె చేతిలో ఒక పుస్తకం తప్పనిసరిగా కనిపిస్తోంది. అదేమీ టైమ్‌పాస్ పుస్తకం కాదు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే తన టైమ్‌ను మార్చివేయగల శక్తివంతమైన పుస్తకం. ఆ పుస్తకం పేరు...ది ఇంటిలిజెంట్ ఇన్వెస్టర్, రచయిత: బెంజిమిన్ గ్రాహమ్. 1949లో ప్రచురితమైన ఈ పుస్తకానికి ఇప్పటికీ గ్లామర్ తగ్గలేదు. అపర కుబేరుడు వారెన్ బఫెట్‌కు బాగా ఇష్టమైన పుస్తకం ఇది. ‘19సంవత్సరాల వయసులో తొలిసారిగా ఈ పుస్తకాన్ని చదివాను. ఇప్పటికీ అది చూపిన దారిలోనే నడుస్తున్నాను’ అంటాడు బఫెట్. ‘తెలివైన ఇన్వెస్టరెప్పుడూ వాస్తవికవాది అయి ఉంటాడు. నిరాశవాదుల నుంచి కొని ఆశావాదులకు అమ్ముతాడు’ ‘ఏ గ్రేట్ కంపెనీ ఈజ్ నాట్ ఏ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ యూ పే టూ మచ్ ఫర్ ది స్టాక్’... బెంజిమిన్ గ్రాహమ్ ప్రవచించిన ఇలాంటి తెలివైన మాటలను ఇష్టపడుతూనే ఇన్వెస్టర్లుగా తమవైన తెలివితేటలను రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది యువతరం. -
పాత ఫోన్లు, లాప్‌ట్యాప్‌లు అమ్మేస్తారా? ఇది మీకోసమే..
సాక్షి, వెబ్‌డెస్క్: వేల రూపాయలు పెట్టి కొన్న గాడ్జెట్లు నెలలు తిరగకుండానే ఓల్డ్ మోడల్ అవుతున్నాయి. ఇయర్ ఫోన్స్ మొదలు స్మార్ట్ఫోన్ల వరకు , కీబోర్డు మొదలు టచ్ ల్యాప్‌టాప్‌ల వరకు వెంట వెంటనే అప్డేట్ వెర్షన్లు వచ్చేస్తున్నాయి. కొత్త వెర్షన్ వస్తువు కొందామంటే.. పాతది ఏం చేయాలని? ఎలా రీజనబుల్ ధరకు అమ్మేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్యను తీరుస్తూ.. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల కొనడమే పనిగా ఈ-కామర్స్‌లోకి అడుగుపెట్టింది క్యాషిఫై. పాతవి అమ్మాలంటే మార్కెట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో వెనువెంటనే మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. వారం తిరక్కుండానే కొత్త ఫీచర్లతో తక్కువ ధరలో మంచి ఫోన్లు వస్తున్నాయి. దీంతో కొత్త ఫోన్లు చాలా త్వరగా ఓల్డ్ వెర్షన్ అయిపోతున్నాయి. వీటిని అమ్మి కొత్తది తీసుకుందామంటే మనకు తెలిసిన మార్కెట్లో సరైన ధర రావడం కష్టంగా మారింది. ఇలాంటి వారికి చక్కని వేదికగా మారింది క్యాషిఫై. ఈ-కామర్స్‌కు కొత్త భాష్యం చెబుతూ రీ-కామర్స్‌గా పాత ఎలక్ట్రానిక్ వస్తువులని ప్రజల నుంచి కొనుగోలు చేస్తుందీ వెబ్ పోర్టల్. రీ-కామర్స్ ఇది ఈ-కామర్స్ కాదు.. రీ-కామర్స్. అంటే పాత వస్తువుల్ని కొనడమే వీళ్ల పని. ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్, స్మార్ట్ స్పీకర్, డీఎస్ఎల్ఆర్ కెమెరా, ఇయర్‌బడ్స్ తదితర వస్తువులన్నీ ఈ సైట్లో అమ్మే అవకాశం ఉంది. క్యాషిఫై వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడున్న ఆప్షన్లను అనుసరిస్తే మీ దగ్గరున్న ప్రొడక్టుకి ఎంత ధర వస్తుందో తెలియజేస్తుంది. ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాక.. ఫైనల్ ధర ఎంతో నిర్ధారిస్తుంది. అందుకు ప్రొడక్టు ఓనర్ అంగీకరిస్తేనే డీల్ ముందుకు వెళ్తుంది. ఎక్సేంజీ కంటే మేలు ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో సైతం ఎక్సేంజ్ ఆఫర్లు రెగ్యులర్‌గా ఉంటాయి. అయితే ఎక్సేంజ్ ఆఫర్లలో కంపెనీలు పాత ఫోన్లకు చాలా తక్కువ ధరను ఆఫర్ చేస్తుంటాయి. పైగా అన్ని రకాల పాత మోడళ్లపై ఎక్సేంజీ ఆఫర్ వర్తించవు. అంతేకాదు మనకు నచ్చిన వస్తువలపై ఎక్సేంజీ ఆఫర్ ఉండకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా క్యాషిఫైలో పాత గాడ్జెట్స్ అమ్మేయోచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా ఇప్పటి వరకు ఆన్లైన్లోనే వ్యాపారం చేస్తూ వచ్చిన క్యాషిఫై తాజాగా ఆఫ్‌లైన్‌లోకి వచ్చింది. రిటైల్ చైయిన్ యూనిషాప్తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఏరియాల్లో 60కి పైగా రిటైల్ షాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా టైర్ టూ సిటీలకు కూడా విస్తరించేలా క్యాషిఫై ప్రణాళిక సిద్దం చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఆఫ్‌లైన్ సౌకర్యం హైదరాబాద్‌ని పలకరించే అవకాశమూ ఉంది. -
రోజు విడిచి రోజు స్కూలుకు..
సాక్షి, హైదరాబాద్: ఒక్కో స్కూలులో పదుల తరగతి గదులు.. ఒక్కో తరగతి గదిలో 50 – 60మంది పిల్లలు.. అందులోనూ ఒక్కో బెంచ్‌పై ముగ్గురు చొప్పున విద్యార్థులు.. పక్కపక్కనే ఆనుకొని కూర్చోవ డం.. ఇదీ ఇప్పటివరకు ఉన్న ‘తరగతి గది స్వరూపం’. కరోనా నేపథ్యంలో ఇది పూర్తిగా రూపుమారనుంది. ఒక్కో విద్యార్థికి వారంలో కొద్దిరోజులు ప్రత్యక్ష బోధన, మరికొన్ని రోజులు ఆన్ లైన్, డిజిటల్ బోధన (వీడియో పాఠాలు వినడం) దిశగా కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు చేస్తోంది. స్కూల్‌కు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్యను సగానికి కుదించే అవకాశం ఉంది. ‘భౌతికదూరం’పై కసరత్తు: లాక్డౌన్ ఎత్తివేశాక కూడా ఏడా ది వరకు భౌతికదూరం పాటించాల్సిందేనని వైద్య నిపుణుల అంచనా. అందుకు అనుగుణంగా కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) కసరత్తు ప్రారంభించింది. లాక్డౌన్ ఎత్తివేస్తే వేసవి సెలవుల తరువాత ప్రారంభమయ్యే పాఠశాల ల తరగతి గదుల్లో పాటించాల్సిన భౌతికదూరంపై సమగ్ర నివే దిక అందజేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సీఈఆర్టీ)ని ఆదేశించింది. ఇప్పటికే ఉన్నత విద్యలో కనీసం 25% ఆన్లైన్ బోధన చేపట్టేలా కార్యాచరణ రూపొందించుకో వాలని యూజీసీ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యలోనూ చేయాల్సిన మార్పులపై ఎన్సీటీఈఆర్టీ నివేది కను రూపొందించి ఎంహెచ్ఆర్డీకి అందజేయనుంది. ఒకరోజు స్కూల్.. మరోరోజు ‘ఆన్లైన్’: మొదటి రోజు సగం మంది స్కూల్‌కు వస్తే.. రెండోరోజు ఆ విద్యార్థులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్, డిజిటల్ పాఠాలు వింటారు. రెండోరోజు స్కూ ల్కు వచ్చిన మిగతా సగం మంది విద్యార్థులు మూడో రోజు ఆన్లైన్, డిజిటల్ పాఠాలు వింటారు. ఇక రెండో రోజు ఇంట్లో ఉండి పాఠాలు విన్న విద్యార్థులు మూడోరోజు మళ్లీ స్కూల్‌కు వస్తారు. ఇలా రోజు విడిచి రోజు ప్రత్యక్ష బోధన, ఆన్లైన్, డిజి టల్ బోధన చేపట్టేలా ఎన్సీఈఆర్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలి సింది. తద్వారా రోజూ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య స గానికి తగ్గుతుంది. తద్వారా భౌతికదూరం నిబంధన అమలు చేయడం వీలవుతుందని భావిస్తోంది. మరోవైపు మొత్తం విద్యా ర్థులకు రోజు విడిచి రోజు స్కూళ్లో బోధన నిర్వహించే అంశం పైనా యోచిస్తున్నట్లు తెలిసింది. ఒకరోజు స్కూల్‌కు వస్తే మరో రోజు ఇంట్లోనే ఉండి ఆన్లైన్, డిజిటల్ బోధన ద్వారా పాఠాలు వింటారు. ఈ విధానంలో భౌతికదూరం పాటించడం సమస్య కానుంది. అందుకే ఒకరోజు సగం మందికి ప్రత్యక్ష బోధన, మిగతా సగం మందికి ఆన్లైన్, డిజిటల్ బోధనవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. టీచర్లను సిద్ధంచేసే దిశగా రాష్ట్రం అడుగులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆన్లైన్, డిజిటల్ బోధన ప్రధాన సవాల్‌గా మారనుందని విద్యానిపుణుల అంచనా. అందుక నుగుణంగా ప్రభుత్వ టీచర్లను సిద్ధం చేయాలని కేంద్రం చెబుతోంది. రాష్ట్రంలోనూ ఆ దిశగా విద్యాశాఖ అడుగులు వేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణమండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ఆన్లైన్ బోధనలో టూల్స్ వినియోగంపై టీచర్లకు శిక్షణ ప్రారంభించింది. తద్వారా టీచర్లు ఆన్లైన్ బోధన చేపట్టేందుకు కూడా సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గురుకులాలు మినహా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు 27,432 ఉన్నాయి. వీటిలో 23,36,070 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి 1.24 లక్షల మంది టీచర్లు బోధన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా విద్యార్థులకు శిక్షణ కొనసాగుతోంది. ఎన్సీఈఆర్టీ రూపొందిస్తున్న విధానం ప్రకారం రాష్ట్రంలో 11.68 లక్షల మంది వరకు రోజూ స్కూల్‌కు హాజరవుతారు. తద్వారా భౌతికదూరం పాటించడం కొంత సులభం కానుంది. రోజు విడిచి రోజు, ఆన్లైన్ – డిజిటల్ బోధనకు సంబంధించి ఎన్సీఈఆర్టీ రూపొందిస్తున్న సమగ్ర మార్గదర్శకాలను త్వరలోనే కేంద్రం ప్రకటించనుంది. -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, నల్లగొండ క్రైం : మిర్యాలగూడ కేంద్రంగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యుల గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.ఐదు లక్షల 18 వేల 500 నగదు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ రంగనాథ్ తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ప్రధానసూత్రధారి వేముల పుల్లారావుతో పాటు అతడి అనుచరులు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వేముల పుల్లారావు గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామం నుంచి 20 ఏళ్ల క్రితం త్రిపురారం వచ్చి కిరాణ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాడని, మూడేళ్ల నుంచి స్నేహితులతో కలిసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కొంత నష్టం రావడంతో తానే సొంతంగా బొంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ సంస్థ నుంచి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని నెలకు రూ.15 వేలు యాప్ సంస్థకు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిచయం ఉన్న స్నేహితుల నుంచి సులభంగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో క్రికెట్ యాప్‌తో పాయింట్స్ ఆధారంగా, ఒక పాయింట్‌కు రూ.100 వసూలు చేస్తాడని, బెట్టింగ్ విస్తరణకు కొందరిని డిస్టిబ్యూటర్లుగా నియమించుకున్నాడని వివరించారు.బెట్టింగ్‌లో కస్టమర్ గెలిస్తే గెలిసిన డబ్బులో 5 శాతం డబ్బును తీసుకొని మిగతాది చెల్లించేవాడని, ఓడిపోతే వచ్చిన డబ్బును డిస్టిబ్యూటర్లతో కలిసి పంచుకునేవాడని తెలిపారు. నష్టం వచ్చే పరిస్థితి నెలకొంటే పాయింట్స్ అమ్మే వాడుకాదని, లేకుంటే మ్యాచ్ అయిపోయే వరకు పాయింట్స్ విక్రయించే వాడని చెప్పారు. డిస్టిబ్యూటర్లు వీరే... కాగా పుల్లారావు డిస్టిబ్యూటర్లుగా షేక్‌సాదీక్, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్, కోటి, భగత్ అలియాస్ కన్న, ఉపేందర్, సుమన్‌ను నియమించుకున్నాడు. వీరికి ప్రతి నెలా ఔరా 24 బెట్ సంస్థ వాళ్లు 3000 పాయింట్లు విక్రయిన్నారు. వీటిని డిస్టిబ్యూటర్లకు అమ్మగా వారు ప్రజలకు అధిక ధరకు విక్రయించేవారు. కీలక వ్యక్తుల అరెస్ట్ మిర్యాలగూడ అశోక్‌నగర్‌కు చెందిన వేముల పుల్లారా వు త్రిపురారంలో ఐదేళ్లపాటు చిట్టీలను నడిపాడు. మిర్యాలగూడలో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడు. చైతన్యనగర్‌కు చెందిన గోలి శ్రీనివాస్, శాంతినగర్‌కు చెందిన బోలిగొర్ల కోటేశ్వరావు, మోబైల్ షాపు నిర్వహిస్తున్న షేక్ ఇదయతుల్లా, శరణ్య గ్రీన్‌హోంకు చెందిన కనగంటి ఉపేందర్, అశోక్‌నగర్‌కు చెందిన కంబాల సుమన్ మొబైల్ షాపులు నిర్వహిస్తున్నారు. అశోక్‌నగర్‌లో పుల్లారావు ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. షేక్ సాదీక్, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్, భగత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ డేగకన్నుపై నెటిజన్ల ఆందోళన
న్యూఢిల్లీ: ఆన్లైన్ కార్యకలాపాల విషయంలో పోలీసు, ప్రభుత్వ విభాగాల డేగకన్నుపై నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ విభాగాలు రహస్యంగా తమ ఆన్లైన్ వ్యవహారాలను పర్యవేక్షంచడంపై భారత ఇంటర్నెట్ వినియోగదారుల్లో 76 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ సంస్థలూ పర్యవేక్షించడంపై 77 శాతం మంది భారతీయులు ఆందోళన వ్యక్త పరిచారని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇన్నోవేషన్, పరిశోధన సంస్థ ఇప్సాస్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. 24 దేశాల్లో 23 వేల పైచిలుకు నెటిజన్లపై ఈ సర్వే నిర్వహించారు. అమెరికా వెలుపల ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా నేత్రాన్ని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంచిందని లీక్ చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ గురించి భారతీయ నెటిజన్లలో 62 శాతం మందికి తెలుసు. స్నోడెన్ గురించి తెలిసిన భారతీయుల్లో 69 శాతం మంది ఆన్లైన్ ప్రైవసీ, సెక్యూరిటీ రక్షణకు పూనుకున్నారట. భావ ప్రకటన స్వేచ్చకు ఇంటర్నెట్ ప్రధాన మాధ్యమం అన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయంగా 83 శాతం, భారతీయ నెటిజన్లలో 88 శాతం మంది వ్యక్తం చేశారు. అందుబాటు ధరలో ఇంటర్నెట్ సేవలు ఉండడం కనీస మానవ హక్కుగా 87 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్పై సందేహాలొద్దని చెబుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యలను 71 శాతం మంది ప్రశంసించారు. ఇక ఆన్లైన్ కార్యకలాపాల డేగకన్నుపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్త పర్చిన నెటిజన్ల సంఖ్య సరాసరి 61 శాతముంది. మెక్సికోలో 84 శాతం, టర్కీలో 77 శాతం మంది ప్రభుత్వ సంస్థల చర్యలపై ఆందోళనగా ఉన్నారు. గ్లోబల్ కమిషన్ ఆన్ ఇంటర్నెట్ గవర్నెన్స్‌కు మద్దతుగా ఈ సర్వే నిర్వహించారు.