ప్రభుత్వ డేగకన్నుపై నెటిజన్ల ఆందోళన
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ కార్యకలాపాల విషయంలో పోలీసు, ప్రభుత్వ విభాగాల డేగకన్నుపై నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ విభాగాలు రహస్యంగా తమ ఆన్‌లైన్ వ్యవహారాలను పర్యవేక్షంచడంపై భారత ఇంటర్నెట్ వినియోగదారుల్లో 76 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ సంస్థలూ పర్యవేక్షించడంపై 77 శాతం మంది భారతీయులు ఆందోళన వ్యక్త పరిచారని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇన్నోవేషన్, పరిశోధన సంస్థ ఇప్సాస్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. 24 దేశాల్లో 23 వేల పైచిలుకు నెటిజన్లపై ఈ సర్వే నిర్వహించారు.
అమెరికా వెలుపల ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా నేత్రాన్ని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంచిందని లీక్ చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ గురించి భారతీయ నెటిజన్లలో 62 శాతం మందికి తెలుసు. స్నోడెన్ గురించి తెలిసిన భారతీయుల్లో 69 శాతం మంది ఆన్‌లైన్ ప్రైవసీ, సెక్యూరిటీ రక్షణకు పూనుకున్నారట. భావ ప్రకటన స్వేచ్చకు ఇంటర్నెట్ ప్రధాన మాధ్యమం అన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయంగా 83 శాతం, భారతీయ నెటిజన్లలో 88 శాతం మంది వ్యక్తం చేశారు. అందుబాటు ధరలో ఇంటర్నెట్ సేవలు ఉండడం కనీస మానవ హక్కుగా 87 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్‌పై సందేహాలొద్దని చెబుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యలను 71 శాతం మంది ప్రశంసించారు. ఇక ఆన్‌లైన్ కార్యకలాపాల డేగకన్నుపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్త పర్చిన నెటిజన్ల సంఖ్య సరాసరి 61 శాతముంది. మెక్సికోలో 84 శాతం, టర్కీలో 77 శాతం మంది ప్రభుత్వ సంస్థల చర్యలపై ఆందోళనగా ఉన్నారు. గ్లోబల్ కమిషన్ ఆన్ ఇంటర్నెట్ గవర్నెన్స్‌కు మద్దతుగా ఈ సర్వే నిర్వహించారు.