
మర్రి నెహెమియా
సాక్షి, నల్లగొండ: ‘‘ప్రజాసేవ చేయాలన్నదే నా ఆశయం. అందుకోసం జీవితాంతం పోటీ చేస్తూనే ఉంటా.. ఒక్క ఓటు వచ్చినా.. రాకున్నా పోటీ చేస్తూనే ఉంటాను. డిపాజిట్లు ముఖ్యం కాదు. నాకు ఆశయమే ముఖ్యం. అందుకోసం నేను బతికున్నంత కాలం ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటా’’ అని ఇండిపెండెంట్ అభ్యర్థి మర్రి నెహెమియా అంటున్నారు. నల్లగొండ లోక్‌సభకు శుక్రవారం నామినేషన్ వేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
ఇప్పటి వరకు ఆయన నామినేషన్ వేయడం పదోసారి. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘నా అభిమానులు నాకున్నారు. ప్రతిసారీ నేను పోటీ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారీ ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో అత్యధికంగా అభిమానులు ఓట్లు వేశారు’ అని అంటున్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన తనకు మొదటి నుంచి రాజకీయాలంటే ఎంతో అభిమానమని, కేవలం కరపత్రాలు, పోస్టర్లు మినహా పెద్దగా ఖర్చు పెట్టడం లేదని తెలిపారు. తాను బతికున్నంతకాలం పోటీ చేస్తూనే ఉంటానన్నారు.
1984 నుంచి అప్పటి మిర్యాలగూడ లోక్‌సభ స్థానానికి, మిర్యాలగూడ రద్దయిన తర్వాత నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఆయన నామినేషన్లు వేసి పార్లమెంట్‌కు పోటీ చేస్తూనే ఉన్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో 9వ సారి పోటీ చేశాను. 56 వేల ఓట్ల పైచిలుకు వచ్చాయని, 10వ సారి నల్లగొండ ఎంపీగా నామినేషన్ సమర్పించినట్లు తెలిపారు. అంతకుముందు నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని, మరో మూడు పర్యాయాలు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసినట్లు చెప్పారు.
– మీసాల శ్రీనివాసులు, సాక్షి– నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment