Nalgonda Lok Sabha constituency
-
కుందూరు రఘువీర్‌రెడ్డి ఆస్తులు రూ.32 కోట్లు
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి తన పేరిట రూ.32,04,23,749 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అందులో ఆయన పేరున రూ.24,84,20,025 ఆస్తులు ఉండగా.. తన భార్య పేరున రూ.7,20,03,724 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రఘువీర్‌రెడ్డి వివిద బ్యాంకుల్లో రూ.17,41,50,500 అప్పు తీసుకున్నట్లు చూపగా.. భార్య పేరున రూ.25,29,000 అప్పులు ఉన్నట్లుగా చూపించారు. -
రక్షణరంగాన్ని తాకట్టు పెట్టాయి
సూర్యాపేట : కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా దేశ రక్షణరంగాన్ని తాకట్టు పెట్టాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ రోడ్ షోకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. తాళ్లగడ్డ నుంచి ప్రారంభమైన రోడ్ షో పూలసెంటర్ పీఎస్సార్‌సెంటర్, రాఘవప్లాజా, శంకర్ విలాస్ సెంటర్‌మీదుగా నేరుగా కొత్తబస్టాండ్ వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. కొత్తబస్టాండ్ జంక్షన్ వద్ద ప్రజలనుద్ధేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగించారు. దేశం వెనుకబాటుకు ఆ రెండు పార్టీలే ప్రధాన కారణమన్నారు. ఆ పార్టీలు ప్రజల ఎజెండాను పక్కకు పెట్టాయని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రజల ఎజెండాను అమలు పరిచిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దని ఆయన కొనియాడారు. పేదరికాన్ని పారద్రోలడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసి తామే సీనియర్లమని ప్రగల్బాలు పలుకుతున్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డిలు రాజకీయంగా ఎదిగినట్లే జిల్లాలో ఫ్లోరిన్ పెరిగిందని మంత్రి దుయ్యబట్టారు. ఫ్లోరిన్‌పై సీఎం కేసీఆర్ దాడి చేసి మిషన్ భగీరథ పేరుతో ఇంటింటి మంచినీరు అందించే పథకాన్ని ప్రవేశపెడితే.. కాంగ్రెస్ పెద్దలు ఆ పథకాన్ని అడ్డుకోచూపారని గుర్తుచేశారు. మిత్రపక్షం మజ్లిస్‌తో కలిసి 17కు 17ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలోని ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి తెలంగాణ చేరుతుందని పేర్కొన్నారు. ఉత్తమ్‌పై విసుర్లు.. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా అధికార పార్టీ ఎజెండాపై చర్చించాల్సిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలో ఆయనపై పోటీ చేస్తున్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై దాడికే పరిమితమయ్యారని విమర్శించారు. ఓటమి భయంతో నే ఉత్తమ్‌కుమారుడి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరవయ్యారని అందుకే కిందటి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన వారికి డిపాజిట్లు గల్లంతయిన వారికి టికెట్లు ఇచ్చారని తెలిపారు. నల్లగొండలో చెల్లని రూపాయిని భువనగిరిలో.. కొడంగల్‌లో చెల్లని రూపాయిని మల్కాజిగిరిలో.. కల్వకుర్తిలో చెల్లని రూపాయిని మహబూబ్‌నగర్‌లో పోటీకి దింపారని ఎద్దేవా చేశారు. -
టీఆర్ఎస్కు అభ్యర్థి దొరకలేదా?
మిర్యాలగూడ : నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడానికి టీఆర్ఎస్కు స్థానికులు దొరకలేదా? టికెట్ అమ్ముకున్నారా? అని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం మిర్యాలగూడలో రోడ్‌షో నిర్వహించారు. స్థానిక హనుమాన్‌పేట చౌరస్తా నుంచి రాజీవ్‌చౌక్ వరకు సాగింది. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి మునుగోడులో చెల్లని రూపాయి, నల్లగొండలో చెల్లుతుందా? అని అన్నారు. నల్లగొండ ప్రజలు చైతన్యవంతులని, డబ్బు, మద్యంతో వచ్చే వారిని ఓడిస్తారని అన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, రాహుల్‌గాంధీకి, నరేంద్రమోదీకి మధ్య జరుగుతున్నాయని అన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాగానే ప్రతి పేద కుటుం బానికి నెలకు రూ.6 వేల రూపాయల చొప్పున అందిస్తారని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకే సారి చేస్తారని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచి నల్లగొండ ప్రజలు గర్వపడేలా నడుచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ కార్యదర్శి, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, డీసీసీ అద్యక్షుడు శంకర్‌నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. నల్లగొండ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేశ రక్షణకు సైనికుడిగా పనిచేస్తే టీఆర్ఎస్ అభ్యర్థి భూ కబ్జాదారుడిగా ఆక్రమణ లకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇందిరమ్మ రా జ్యం రావాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాల ని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి సాధినేని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, మేడ సురేందర్‌రెడ్డి, ముజ్జ రామకృష్ణ, సలీం, ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, శాగ జలేందర్‌రెడ్డి, ఎం డీ ఇస్మాయిల్, కంచర్లకుంట్ల దయాకర్‌రెడ్డి, దేశిడి శేఖర్‌రెడ్డి, తమన్న, ఆరీఫ్, టీడీపీ నాయకులు కాసుల సత్యం, మాన్యానాయక్ పాల్గొన్నారు. -
పదోసారి పోటీకి సై.. ఓడినా పట్టింపు నై..
సాక్షి, నల్లగొండ: ‘‘ప్రజాసేవ చేయాలన్నదే నా ఆశయం. అందుకోసం జీవితాంతం పోటీ చేస్తూనే ఉంటా.. ఒక్క ఓటు వచ్చినా.. రాకున్నా పోటీ చేస్తూనే ఉంటాను. డిపాజిట్లు ముఖ్యం కాదు. నాకు ఆశయమే ముఖ్యం. అందుకోసం నేను బతికున్నంత కాలం ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటా’’ అని ఇండిపెండెంట్ అభ్యర్థి మర్రి నెహెమియా అంటున్నారు. నల్లగొండ లోక్‌సభకు శుక్రవారం నామినేషన్ వేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటి వరకు ఆయన నామినేషన్ వేయడం పదోసారి. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘నా అభిమానులు నాకున్నారు. ప్రతిసారీ నేను పోటీ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారీ ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో అత్యధికంగా అభిమానులు ఓట్లు వేశారు’ అని అంటున్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన తనకు మొదటి నుంచి రాజకీయాలంటే ఎంతో అభిమానమని, కేవలం కరపత్రాలు, పోస్టర్లు మినహా పెద్దగా ఖర్చు పెట్టడం లేదని తెలిపారు. తాను బతికున్నంతకాలం పోటీ చేస్తూనే ఉంటానన్నారు. 1984 నుంచి అప్పటి మిర్యాలగూడ లోక్‌సభ స్థానానికి, మిర్యాలగూడ రద్దయిన తర్వాత నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఆయన నామినేషన్లు వేసి పార్లమెంట్‌కు పోటీ చేస్తూనే ఉన్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో 9వ సారి పోటీ చేశాను. 56 వేల ఓట్ల పైచిలుకు వచ్చాయని, 10వ సారి నల్లగొండ ఎంపీగా నామినేషన్ సమర్పించినట్లు తెలిపారు. అంతకుముందు నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని, మరో మూడు పర్యాయాలు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసినట్లు చెప్పారు. – మీసాల శ్రీనివాసులు, సాక్షి– నల్లగొండ -
నల్లగొండ.. అండెవరికో ?
సాయుధ రైతాంగ పోరాటంలో నల్లగొండది ఓ ప్రత్యేక చరిత్ర. ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న ప్రధాన నాయకుల్లో రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, భీంరెడ్డి నర్సింహారెడ్డి వంటి సాయుధ పోరాట యోధులంతా ఇక్కడి వారే. బందూకుల నుంచి బ్యాలెట్ దాకా సాగిన వీరి రాజకీయ జీవితంతో జిల్లాకు గుర్తింపు వచ్చింది. అంతటి ఘనమైన చర్రిత ఉన్న నల్లగొండ తెలంగాణ రాష్ట్ర పోరాటంలోనూ ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల పోరులో ఇక్కడి లోక్‌సభ స్థానం ప్రతిష్టాత్మకంగా మారడంతో అన్ని పార్టీలూ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నాయి. నల్లగొండ: లోక్‌సభ నియోజకవర్గం ప్రస్తుత ఎంపీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు: నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ (ఎస్టీ). మొత్తం ఓటర్లు: 14,60,881 పురుషులు: 7,29,653 మహిళలు: 7,31,192 ప్రస్తుతం బరిలో నిలిచింది: 9 ప్రత్యేకతలు: మెజారిటీ ప్రాంతం నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోకి వస్తుంది. సిమెంటు పరిశ్రమ, పారా బాయిల్డ్ రైసు మిల్లులు ఎక్కువ . ఎస్సీ, బీసీ, రైతు, కార్మికులు మహిళల ఓట్లు కీలకం ప్రధాన అభ్యర్థులు వీరే: గున్నం నాగిరెడ్డి ( వైఎస్సార్ సీపీ) గుత్తా సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్) తేరా చిన్నపురెడ్డి (టీడీపీ ) నంద్యాల నర్సింహారెడ్డి (సీపీఎం) పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) ఎన్. క్రాంతి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన టీ కాంగ్రెస్ ఎంపీల్లో ఒకరైన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈసారి తెలంగాణ ఓటుపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అయితే తొలిసారి టీఆర్ఎస్ కూడా బరిలోకి దిగుతూ అదే తెలంగాణవాద ఓటుపై ఆశలు పెట్టుకుంది. మరో వైపు పరువు నిలబె ట్టుకునేందుకు మాత్రమే పోటీకి దిగుతున్న టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. సీపీఎం కూడా నల్లగొండలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గుత్తాకు ఎదురుగాలి గత ఎన్నికల సమయంలో రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఎంపీగా టికెట్ దక్కించుకున్న ‘గుత్తా’.. వైఎస్ హవాతో బయటపడ్డారు. అయితే ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా బరిలోకి దిగడంతో ఆయన గెలుపు నల్లేరుమీద నడక కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా.. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో అభివృద్ధి ఊసే ఎత్తని కాంగ్రెస్ తీరును ప్రత్యర్థి రాజకీయ పక్షాలు ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏర్పాటైన తొలి రైల్వేలైన్ బీబీనగర్-నడికుడి లైన్లో రైల్వేకు కావాల్సినంత ఆదాయం ఉన్నా డబ్లింగ్ పనులు కానీ, విద్యుద్దీకరణ పనుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని వైరి పార్టీలు విమర్శలు సంధిస్తున్నాయి. అలాగే నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ.. ఇలా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద ఉన్నా ఇక్కడి రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడంతో రైతులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి, సాగునీటి గురించి కాంగ్రెస్ పాలకులు ఆలోచించడమే మర్చిపోయారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుత ఎన్నికల్లో కాం గ్రెస్‌కు ప్రతిబంధకంగా మారనున్నాయి. అగమ్యగోచరంగా టీడీపీ పరిస్థితి ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడంతో కేవలం ఉనికి కోసమే ఇక్కడ బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తువల్ల ఇక్కడ టీడీపీకి ఒనగూడే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువనేది రాజకీయ విశ్లేషకుల భావన. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న తేరా చిన్నపురెడ్డిని ఈసారి నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపుతూ టీడీపీ ప్రయోగం చేస్తోంది. అయితే నల్లగొండ అసెంబ్లీ సీటును బీజేపీకి ఇచ్చేయడంతో అక్కడి టీడీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అలాగే కోదాడలో సిట్టింగు ఎమ్మెల్యే వేనేపల్లిని పక్కన పెట్టడంతో అక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది. ఇవన్నీ తెలుగుదేశానికి ప్రతికూలాంశాలు కానున్నాయి. సంచలనం కోసం టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీగా తమకే పట్టం కడతారన్న ఆశ టీఆర్ఎస్లో కనిపిస్తోంది. అయితే రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని విద్యాసంస్థల అధినేత పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇచ్చి సంచలనం కోసం వేచి చూస్తోంది. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో ఆ అభ్యర్థి అందరికీ పరిచయం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే తెలంగాణ అభిమాన ఓటు గట్టెక్కించకపోతుందా అన్న ఆశ ఆ పార్టీలో ఉంది. కేడర్‌పైనే భారం వేసిన సీపీఎం సీపీఎం తొలిసారి జిల్లావ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థులను ఎన్నికల క్షేత్రంలోకి దింపింది. కేవలం కేడర్‌పైనే భారం వేసిన సీపీఎం నంద్యాల నర్సింహారెడ్డిని ఇక్కడి లోక్‌సభ స్థానం నుంచి పోటీలో నిలిపింది. తమకున్న బలమైన కేడర్‌తోపాటు కొంత కష్టపడితే విజయం సాధించవచ్చనే ధీమా ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. వైఎస్ సంక్షేమ పథకాలే అండగా వైఎస్సార్ సీపీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి పల్లెల్లో ఉన్న ఆదరణ ఓటుగా మారుతుందని వైఎస్సార్ సీపీ భావిస్తోంది. ఆ పార్టీ తరపున బరిలో ఉన్న గున్నం నాగిరెడ్డి.. వైస్సార్ సంక్షేమ పథకాలే తమను విజయ తీరానికి చేరుస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఎస్‌ఎల్‌బీసీతోపాటు ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు వైఎస్సార్ హయాంలో చకచకా సాగాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య కూడా ఎక్కువే కావడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. అలాగే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కూడా తమకే పడుతుందని వైఎస్సార్ సీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నే.. గెలిస్తే: బలాబలాలు గున్నం నాగిరెడ్డి (వైఎస్సార్ సీపీ) - విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తా - ఫ్లోరైడ్ సమస్యను నివారించేందుకు అన్ని గ్రామాలకు కృష్ణా జలాలు అందించే కృషి చేస్తా - {పజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రుల్లో పడకల స్థాయిని పెంచుతా - రైతులకు ఏడు గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తా. 9 గంటలు ఇవ్వడంపై దృషిపెడతా. - రహదారులను మెరుగుపరుస్తా. అనుకూలం - వైఎస్సార్‌పై ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న అభిమానం -ఙ్ట్చఛగ్రామ గ్రామాన ఉన్న వైఎస్ఆర్ అభిమాన ఓట్లు - వైఎస్సార్ ఆరేళ్ల పాలనలో లభించిన సుబిక్షమైన పాలన - ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంటు, ఉచిత విద్యుత్ లబ్ధిదారుల ఓట్లు ప్రతికూలం - రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు బరిలో లేకపోవడం గుత్తా సుఖేందర్ రెడ్డి (కాంగ్రెస్) - నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తా - పెండ్లిపాకల రిజర్వాయర్ సామర్థ్యం పెంచడం, నక్కలగండి పనులు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తా - కొత్త జాతీయరహదారి నిర్మాణానికి కృషి చేస్తా - తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తా - నల్లగొండలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తా అనుకూలం - {పత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యమించిన టీ కాంగ్రెస్ ఎంపీల్లో ముఖ్యుడు కావడం - పార్టీలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో సత్సంబంధాలు - ఏడు సెగ్మెంట్ల కాంగ్రెస్ కార్యర్తలతో నేరుగా పరిచయాలు ఉండడం ప్రతికూలం - తెలంగాణ కార్యక్రమాల వరకే పరిమితం కావడం - చెప్పుకోదగిన అభివృద్ధి పనులు చేయకపోవడం - కొత్త అభ్యర్థులు, సీపీఐతో పొత్తు దేవరకొండలో ఫలించే అవకాశం లేకపోవడం - తెలంగాణ ఓటు చీలిపోవడం తేరా చిన్నపరెడ్డి (టీడీపీ) - ఫ్లోరైడ్ సమస్య నిర్మూలనకు కృషి - మండల కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ కేంద్రాలు - నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి అనుసంధానంగా కార్పొరేట్ స్థాయిలో నర్సింగ్ కాలేజీ - {పతి మండలానికి డిగ్రీ కాలేజీ, ఐటీఐ, పాలిటె క్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయిస్తా - {పతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి కట్టిస్తా అనుకూలం - నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చూపిన పోరాట పటిమ - వివాద రహితుడు, సౌమ్యుడు ప్రతికూలం - అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు బలహీనులు కావడం - సంస్థాగతంగా ఉన్న గ్రూపుల గొడవలు - తెలంగాణపై టీడీపీ అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం - బీజేపీతో పొత్తు పెద్దగా లాభించకపోవడం నంద్యాల నర్సింహారెడ్డి (సీపీఎం) - నల్లగొండ -మాచర్ల రైల్వేలైను ఏర్పాటు కృషి చేస్తా - కేంద్ర ప్రభుత్వ నిధులతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయిస్తా - విద్యాభివృద్ధికి కృషిచేస్తా - భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పిస్తా - 9 వేల ఎకరాల అటవీ భూములను పేదలకు పంచిపెడతాం. - యురేనియం త వ్వకాలను నిలిపేస్తాం అనుకూలం - ముందు నుంచీ కమ్యూనిస్టులకు పట్టున్న నియోజకవర్గం కావడం - గ్రామ స్థాయిలో పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు ప్రతికూలం -సమైక్య రాష్ట్ర విధానానికే కట్టుబడి వెనుకబడి పోవడం - అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ చెల్లాచెదురు కావడం హామిర్యాలగూడ మినహా, ఇతర నియోజకవర్గాలో వెనుకబడి ఉండడం పల్లా రాజేశ్వరరెడ్డి (టీఆర్ఎస్) - ప్రజలకు ఫ్లోరైడ్ రహిత జలాలు అందిస్తా - ఎత్తిపోతల పథకాలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తా - సూర్యాపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయిస్తా - నల్లగొండలో నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు చేయిస్తా - దేవరకొండలో బత్తాయి మార్కెట్, జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషిచేస్తా - సిమెంట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా. - నియోజక వర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా అనుకూలం - తెలంగాణవాద ఓటు ప్రతికూలం - స్థానికేతరుడు కావడం - రాజకీయాలకు కొత్త. నియోజకవర్గ ప్రజలకు కొత్త ముఖం - పనిచేసే క్షేత్ర స్థాయి బలగం సరిగా లేకపోవడం -
ఊపు కోసం ...!
నేడు నల్లగొండలో టీఆర్ఎస్ సభ హాజరుకానున్న కేసీఆర్ నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధి నుంచి జన సమీకరణ సాక్షిప్రతినిధి, నల్లగొండ, సంస్థాగత నిర్మాణం ఏ మాత్రం ఆశా జనకంగా లేని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఈ సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ పడుతోంది. గత ఎన్నికల్లో ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయిన టీఆర్ఎస్ ఈసారి మాత్రం బోణీ కొట్టాలని చూస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన ఈ ఉద్యమ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ఓటుపై పేటెంట్ తమదేనన్న భరోసాతో ఉంది. అయితే, కేవలం తెలంగాణవాద ఓటు మాత్రమే ఒడ్డున పడేయలేదన్న విషయాన్ని గుర్తించిన ఆ పార్టీ నాయకత్వం ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు దీటైన జవాబులు ఇస్తూనే, తెలంగాణ కొత్త రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో, తెలంగాణ నవ నిర్మాణానికి తమ వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటో ప్రజానీకానికి తెలియజే సేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో రెండు లోక్‌సభ, పన్నెండు అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి నిలిపిన టీఆర్ఎస్కు కొన్ని నియోజకవర్గాల్లో నామమాత్ర ప్రాతినిధ్యం కూడా లేదు. దీంతో పార్టీకి ఊపు తెచ్చేందుకు, బలమైన ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్‌ను సమర్ధంగా ఢీ కొట్టేందుకు ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యూహరచన చేశారు. పార్టీ కొంత బలహీనంగా ఉందని ప్రచారం జరుగుతున్న నల్లగొండ లోక్‌సభ నియోజవర్గంలోనే జిల్లాలో తొలి ప్రచార బహిరంగ సభను ఏర్పాటు చేశారు. నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ సెగ్మెంట్లలో పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. దీనికితోడు ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారిలో కొత్త వారు, రాజకీయంగా ఏమాత్రం గుర్తింపు, పరిచయాలు లేని వారున్నారు. దేవరకొండ అభ్యర్థి లాలూనాయక్‌కు విధిలేని పరిస్థితుల్లోనే అభ్యర్థిగా ప్రకటించారు. నాగార్జునసాగర్‌లో పోటీ అనుమానమని భావించిన తరుణంలో సీపీఎం నుంచి బయటకు వచ్చిన నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో ఆయన రూపంలో అందివచ్చిన అవకాశాన్ని వాడుకుని సాగర్ అభ్యర్థిగా ప్రకటించారు. పీఆర్పీ నుంచి టీఆర్ఎస్లో చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి మిర్యాలగూడ బరిలో ఉన్నారు. ఉద్యమ కార్యక్రమాల్లోనూ అంతంత మాత్రంగానే పాల్గొన్న ఆయన కేడర్‌ను తయారు చేసుకోలేదు. పార్టీకి ఇన్చార్జ్ కూడా లేని హుజూర్నగర్ నియోజకవర్గంలో అమరుల కుటుంబం కోటాలో రాజకీయ నేపథ్యమే లేని శంకరమ్మను పోటీకి పెట్టారు. నియోజకవర్గానికి, పార్టీ ఉద్యమ కార్యక్రమాలకు దూరంగానే ఉన్న శశిధర్‌రెడ్డిని కోదాడ బరిలోకి దించారు. సూర్యాపేటలో జగదీష్‌రెడ్డి, నల్లగొండలో దుబ్బాక నర్సింహారెడ్డి అటు ఉద్యమంలో, ఇటు పార్టీకి దన్నుగా ఉన్న వారే కావడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో సమస్య లేకున్నా, మిగిలినచోట్ల ఊపు లేదు. చివరకు నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగినరాజేశ్వర్రెడ్డి టీఆర్ఎస్తో కానీ, సుదీర్ఘంగా జరిగిన తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సబంధం లేని వ్యక్తి. ఆయన పార్టీలో చేరిన వారంలోనే అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే నల్లగొండ లోక్‌సభ స్థానం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కొత్త ఊపు కోసం కేసీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ ఇండోర్ స్టేడియంలో సోమవారం సాయంత్రం సభ జరగనుందని, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులను సమీకరిస్తున్నామని, కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అంతా కదిలిరావాలని టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ బండా నరేందర్‌రెడ్డి కోరారు. టీఆర్ఎస్ సభ ఏర్పాట్లు పూర్తి నల్లగొండ రూరల్ : జిల్లా కేంద్రంలోని మేఖల అభినవ్ స్టేడియంలో సోమవారం జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దుబ్బాక నర్సింహారెడ్డి పరిశీలించారు. జిల్లా నుంచి 2 లక్షల మంది కార్యకర్తలు సభకు హాజరవుతారని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మైనం శ్రీనివాస్, ఫరీద్, పట్టణ అధ్యక్షుడు అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, రవినాయక్ పాల్గొన్నారు.