ఊపు కోసం ...! | today kcr going at nalgonda | Sakshi
Sakshi News home page

ఊపు కోసం ...!

Published Mon, Apr 14 2014 1:22 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

ఊపు కోసం ...! - Sakshi

ఊపు కోసం ...!

నేడు నల్లగొండలో టీఆర్‌ఎస్ సభ హాజరుకానున్న కేసీఆర్
 నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధి నుంచి జన సమీకరణ

 
 సాక్షిప్రతినిధి, నల్లగొండ, సంస్థాగత నిర్మాణం ఏ మాత్రం ఆశా జనకంగా లేని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఈ సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ పడుతోంది. గత ఎన్నికల్లో ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయిన టీఆర్‌ఎస్ ఈసారి మాత్రం బోణీ కొట్టాలని చూస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన ఈ ఉద్యమ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ఓటుపై పేటెంట్ తమదేనన్న భరోసాతో ఉంది.

అయితే, కేవలం తెలంగాణవాద ఓటు మాత్రమే ఒడ్డున పడేయలేదన్న విషయాన్ని గుర్తించిన ఆ పార్టీ నాయకత్వం ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు దీటైన జవాబులు ఇస్తూనే, తెలంగాణ కొత్త రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో, తెలంగాణ నవ నిర్మాణానికి తమ వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటో ప్రజానీకానికి తెలియజే సేందుకు సిద్ధమవుతోంది.

జిల్లాలో రెండు లోక్‌సభ, పన్నెండు అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి నిలిపిన టీఆర్‌ఎస్‌కు కొన్ని నియోజకవర్గాల్లో నామమాత్ర ప్రాతినిధ్యం కూడా లేదు. దీంతో పార్టీకి ఊపు తెచ్చేందుకు, బలమైన ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్‌ను సమర్ధంగా ఢీ కొట్టేందుకు ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యూహరచన చేశారు. పార్టీ కొంత బలహీనంగా ఉందని ప్రచారం జరుగుతున్న నల్లగొండ లోక్‌సభ నియోజవర్గంలోనే జిల్లాలో తొలి ప్రచార బహిరంగ సభను ఏర్పాటు చేశారు. నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ సెగ్మెంట్లలో పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. దీనికితోడు ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారిలో కొత్త వారు, రాజకీయంగా ఏమాత్రం గుర్తింపు, పరిచయాలు లేని వారున్నారు.

 దేవరకొండ అభ్యర్థి లాలూనాయక్‌కు విధిలేని పరిస్థితుల్లోనే అభ్యర్థిగా ప్రకటించారు. నాగార్జునసాగర్‌లో పోటీ అనుమానమని భావించిన తరుణంలో సీపీఎం నుంచి బయటకు వచ్చిన నోముల నర్సింహయ్య టీఆర్‌ఎస్ కండువా కప్పుకోవడంతో ఆయన రూపంలో అందివచ్చిన అవకాశాన్ని వాడుకుని సాగర్ అభ్యర్థిగా ప్రకటించారు. పీఆర్పీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి మిర్యాలగూడ బరిలో ఉన్నారు.

 ఉద్యమ కార్యక్రమాల్లోనూ అంతంత మాత్రంగానే పాల్గొన్న ఆయన కేడర్‌ను తయారు చేసుకోలేదు. పార్టీకి ఇన్‌చార్జ్ కూడా లేని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అమరుల కుటుంబం కోటాలో రాజకీయ నేపథ్యమే లేని శంకరమ్మను పోటీకి పెట్టారు. నియోజకవర్గానికి, పార్టీ ఉద్యమ కార్యక్రమాలకు దూరంగానే ఉన్న శశిధర్‌రెడ్డిని కోదాడ బరిలోకి దించారు. సూర్యాపేటలో జగదీష్‌రెడ్డి, నల్లగొండలో దుబ్బాక నర్సింహారెడ్డి అటు ఉద్యమంలో, ఇటు పార్టీకి దన్నుగా ఉన్న వారే కావడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో సమస్య లేకున్నా, మిగిలినచోట్ల ఊపు లేదు.


 చివరకు నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగినరాజేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌తో కానీ, సుదీర్ఘంగా జరిగిన తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సబంధం లేని వ్యక్తి. ఆయన పార్టీలో చేరిన వారంలోనే అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే నల్లగొండ లోక్‌సభ స్థానం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కొత్త ఊపు కోసం కేసీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ ఇండోర్ స్టేడియంలో సోమవారం సాయంత్రం సభ జరగనుందని, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులను సమీకరిస్తున్నామని, కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అంతా కదిలిరావాలని టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ బండా నరేందర్‌రెడ్డి కోరారు.

 టీఆర్‌ఎస్ సభ ఏర్పాట్లు పూర్తి
 నల్లగొండ రూరల్ : జిల్లా కేంద్రంలోని మేఖల అభినవ్ స్టేడియంలో సోమవారం జరిగే టీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దుబ్బాక నర్సింహారెడ్డి పరిశీలించారు.

జిల్లా నుంచి 2 లక్షల మంది కార్యకర్తలు సభకు హాజరవుతారని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మైనం శ్రీనివాస్, ఫరీద్, పట్టణ అధ్యక్షుడు అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, రవినాయక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement