సూర్యాపేట : కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా దేశ రక్షణరంగాన్ని తాకట్టు పెట్టాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ రోడ్ షోకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. తాళ్లగడ్డ నుంచి ప్రారంభమైన రోడ్ షో పూలసెంటర్ పీఎస్సార్‌సెంటర్, రాఘవప్లాజా, శంకర్ విలాస్ సెంటర్‌మీదుగా నేరుగా కొత్తబస్టాండ్ వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. కొత్తబస్టాండ్ జంక్షన్ వద్ద ప్రజలనుద్ధేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగించారు.
దేశం వెనుకబాటుకు ఆ రెండు పార్టీలే ప్రధాన కారణమన్నారు. ఆ పార్టీలు ప్రజల ఎజెండాను పక్కకు పెట్టాయని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రజల ఎజెండాను అమలు పరిచిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దని ఆయన కొనియాడారు. పేదరికాన్ని పారద్రోలడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసి తామే సీనియర్లమని ప్రగల్బాలు పలుకుతున్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డిలు రాజకీయంగా ఎదిగినట్లే జిల్లాలో ఫ్లోరిన్ పెరిగిందని మంత్రి దుయ్యబట్టారు.
ఫ్లోరిన్‌పై సీఎం కేసీఆర్ దాడి చేసి మిషన్ భగీరథ పేరుతో ఇంటింటి మంచినీరు అందించే పథకాన్ని ప్రవేశపెడితే.. కాంగ్రెస్ పెద్దలు ఆ పథకాన్ని అడ్డుకోచూపారని గుర్తుచేశారు. మిత్రపక్షం మజ్లిస్‌తో కలిసి 17కు 17ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలోని ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి తెలంగాణ చేరుతుందని పేర్కొన్నారు.
ఉత్తమ్‌పై విసుర్లు..
టీపీసీసీ ప్రెసిడెంట్‌గా అధికార పార్టీ ఎజెండాపై చర్చించాల్సిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలో ఆయనపై పోటీ చేస్తున్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై దాడికే పరిమితమయ్యారని విమర్శించారు. ఓటమి భయంతో నే ఉత్తమ్‌కుమారుడి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరవయ్యారని అందుకే కిందటి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన వారికి డిపాజిట్లు గల్లంతయిన వారికి టికెట్లు ఇచ్చారని తెలిపారు. నల్లగొండలో చెల్లని రూపాయిని భువనగిరిలో.. కొడంగల్‌లో చెల్లని రూపాయిని మల్కాజిగిరిలో.. కల్వకుర్తిలో చెల్లని రూపాయిని మహబూబ్‌నగర్‌లో పోటీకి దింపారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment