సాక్షి,సూర్యాపేట: కేవలం వంద రోజుల్లోనే తెలంగాణ అస్తవ్యస్తంగా తయారైందని, ఈ వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆదివారం నిర్వహించిన పొలం బాటలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.
పెట్టుబడిపెట్టి నష్టపోయామని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారన్నారు. తమకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువన్నారు. మూడు నెలల్లోనే ఈ పరిస్థితంటే రాబోయే రోజుల్లో ఏం జరగనుందనే భయం ప్రజల్లో ఏర్పడిందన్నారు. ‘చీఫ్ మినిస్టర్ వేర్ ఆర్ యూ స్లీపింగ్’ అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న చేస్తానన్న రైతు రుణమాఫీ ఏమైందో చెప్పాలన్నారు. డిసెంబర్ 9 వెళ్లి ఎన్నిరోజులైందని నిలదీశారు. ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.
‘రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అసమర్థత, తెలివితక్కువతనమే ఈ పరిస్థితికి కారణం. రైతులు నష్టపోతే ప్రస్తుత ప్రభుత్వంలో పట్టించుకునేవాడు దిక్కులేడు. ఎండిపోయిన పంటలపై నివేదిక తెప్పించుకుని వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఇచ్చే వరకు బీఆర్‌ఎస్ ఊరుకోదు. వెంట పడతాం. మెడలు వంచుతాం. ఒకరిద్దరని గుంజుకుని చిల్లర రాజకీయాలు చేయడం కాదు. ఎండిన పంటలకుగాను రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మూడు నెలలు ఓపిక పట్టి నాలుగో నెలలో మాట్లాడుతున్నాం. వాగ్దానాలు నెరవేర్చేదాకా వదిలిపెట్టేది లేదు. రైతులకు రూ.500 బోనస్, రుణమాఫీ ఇతర హామీలపై దీక్షలు, ధర్నాలు చేస్తాం.
నీళ్లిస్తామంటే నమ్మి పంటలు వేశామని రైతులు పొలంబాటలో నాతో చెప్పారు.రైతు బాగుండాలన్న ఉద్దేశంతో మా హయాంలో నీరు,24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పెట్టుబడి సాయం చేశాం. కొనుగోలు కేంద్రాలు, రైతు బీమా అమలు చేశాం. 2014లో 30-40 లక్షల టన్నుల ధాన్యం కూడా పండకపోయేది. కానీ ఆ తర్వాత మూడు కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించాం. త తక్కువ కాలంలో రైతులు బాధపడతారు అనుకోలేదు.జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించాం.
కన్నీరు మున్నీరుగా రైతులు విలపించారు.నీళ్ళు ఇస్తామని ముందు చెప్పారు, కానీ ఇప్పుడు ఓట్లు వేయించుకొని నీళ్ళు ఇవ్వలేదు.ముందే తెలిస్తే ఓట్లు వెయ్యకపోయే వాళ్లమంటున్నారు. రైతులకు కావాల్సింది నీళ్ళు,పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్, పంట కొనుగోలు చేయటం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిన తెలంగాణలో మళ్లీ రైతు ఆత్మహత్యలు పెరిగాయి. రాజకీయనాయకులు రాష్ట్రం మేలు కాంక్షించాలి. రాజకీయాలన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. స్వల్ప కాలంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.
హైదరాబాద్‌లో నీటి కటకట ప్రారంభం అయ్యింది. నీటి ట్యాంకర్‌లు కొనుక్కునే దుస్థితి హైదరాబాద్ ప్రజలకు వచ్చింది. మా హయాంలో తెలంగాణలో బిందె పట్టుకున్న ఆడబిడ్డ కనిపించలేదు. ఇప్పుడు నీళ్ల ట్యాంకర్లు ఎందుకు కనిపిస్తున్నాయి. మళ్లీ స్టెబిలైజర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. న్యూయార్క్, లండన్ లో కరెంట్ పోతుంది కానీ తెలంగాణ లో పోదు అనే స్థాయికి తెచ్చా’ అని కేసీఆర్ చెప్పారు. ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాట్లాడుతుండగా కరెంటు పోయింది. దీనికి స్పందించిన కేసీఆర్ కరెంటు ఇట్లా వస్తూ పోతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment