
వరంగల్ అర్బన్ : మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఆపధర్మ మంత్రి కేటీఆర్ అనుమతివ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రణయ్ కేసులో రాజకీయ, ఆర్థిక అండదండలతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి ఉందని, ఈ కేసును హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులకు నిజంగా శిక్ష పడాలనే ఆలోచన ఉంటే.. ట్విటర్ ద్వారా స్పందించండం కాదు.. ముందు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎందుకు నిందితులను సస్పెండ్ చేయలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
ప్రధాన నిందితుడు మారుతి రావు అన్ని పార్టీలను గుప్పిట్లో పెట్టుకున్నాడని విమర్శించారు. ప్రణయ్, అమృతలకు ప్రమాదం ఉందని తెలిసినా.. పోలీసులు కాపాడేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మారుతి రావు సెటిల్మెంట్లతో అక్రమాస్తులు కూడగట్టుకున్నాడన్నది అందరికీ తెలుసనని, అధికారుల అండదండలు చూసుకునే అతను ఈ హత్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. హత్యకు గంట ముందు మారుతిరావు వేములపల్లి కట్టమీద డీఎస్పీతో పదిహేను నిమిషాలు మాట్లాడడని అన్నారు. ఈ హత్యకు సంబంధించి నిందితులందరికీ శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన వైఖరిని తెలుపాలని కోరారు. ఈ ఘటన నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 24 వరకు గ్రామ మండల స్థాయిలో ఉదయం నిరసనలు, సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment