వరుస తుపాన్లు, తెగుళ్లతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోకపోగా.. మరింత కష్టాల్లోకి నెడుతోంది. సాగర్ ఎడమ కాల్వ కింద మేజర్లకు మంగళవారం నుంచి నీటిని బంద్ చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వరినాట్లు వేసి పుల్క కట్టే సమయంలో నీరు నిలిపి వేయడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఎడమ కాల్వకింద సుమారు 3.5లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. అందులో సుమారు 40వేల నుంచి 50వేల వరకు రెండు మూడు రోజుల క్రితం నాట్లు వేసినవే. సకాలంలో వరిపంటకు పుల్క కట్టకపోతే దిగుబడి తీవ్రంగా తగ్గే ప్రమాదముందని రైతులు భయపడుతున్నారు.
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సీజన్‌లోనే తుపాను, దోమకాటు వల్ల వరి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. కాగా రబీలోనైనా వరి సాగు చేసుకోవచ్చని భావించిన రైతులకు నాట్లు పూర్తి కాకముందే నీటిని నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్‌కు గాను వరి నాట్లకోసం డిసెంబర్ 20వ తేదీ నుంచి ఎన్‌ఎస్‌పీ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా అప్పట్లో ఖరీఫ్ వరి కోతలు సాగుతున్నందున నార్లు సిద్ధంగా లేకపోవడంతో రైతులు వరి నాట్లు వేసుకోలేదు. కాలువ చివరి భూములకు నీరు అందే వరకు ఆలస్యం కావడం వల్ల ఇప్పటికి కూడా నాట్లు పూర్తి కాలేదు.
అయినా వారబందీ పద్ధతి ప్రకారం ఈ నెల 4వతేదీన(మంగళవారం) ఎడమ కాలువ పరిధిలోని మేజర్లుకు నీటిని నిలిపివేశారు. దాంతో రైతులు దిక్కతోచని స్థితిలో ఉన్నారు. రబీ సీజన్‌లో సాగర్ ఎడమ కాలువ పరిధిలో కేవలం 4,31,325 ఎకరాలకే సాగునీటిని అందించడానికి 50 టీఎంసీల నీటిని కేటాయించారు. కాగా ఇప్పటి వరకు 24 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎన్‌ఎస్‌పీ అధికారులు ప్రకటించారు. మిగతా 26 టీఎంసీల నీటిని నాలుగు విడతలుగా అందించనున్నారు.
9న తిరిగి నీటి విడుదల
వారబందీ పద్ధతిలో ఈ నెల 4న సాగర్ ఎడమ కాలువ పరిధిలోని మేజర్లకు నీటిని నిలిపి వేసిన అధికారులు తిరిగి ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ముందుగా ప్రకటించినట్లుగా నాలుగు విడతలుగా నీటిని విడుదల చేయనున్నారు. వరి నాట్లు పూర్తికాని రైతులతో పాటు ఇటీవల రెండు, మూడు రోజుల క్రితం నాట్లు వేసిన వరి పొలాలు కూడా వరుసగా ఐదు రోజుల పాటు నీళ్లు లేకుంటే ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
బీళ్లుగా భూములు
పదేళ్లుగా దామరచర్ల మండలం ముదిమాణిక్యం, వజీరాబాద్‌లలోని భూములకు ఎన్‌ఎస్‌పీ కాలువల ద్వారా నీరు అందడం లేదు. ఈ గ్రామాల పేర్లు మేజర్‌లకు పెట్టారు. కానీ నీళ్లు మాత్రం అందడం లేదు. ముదిమాణిక్యం మేజర్ కాలువ పరిధిలో 25 వేల ఎకరాల ఆయకట్టు, వజీరాబాద్ మేజర్ కాలువ పరిధిలో 32 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ ఇప్పటి వరకు కాలువ చివరి భూములకు నీళ్లు చేరకపోవడంతో బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.
రైతులకు ‘వర్రీ’
Published Wed, Feb 5 2014 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement
Advertisement