‘అకాల’నష్టం: నేల రాలిన మామిడి
* జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వాన
* నేల రాలిన మామిడి
* కల్లాల్లో తడిసిన మిర్చి, వరి పంటలు
* పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలికి తోడు వడగండ్ల వర్షం పడడంతో మామిడికాయలు నేలరాలాయి. పలు గ్రామాల్లో ఈదురు గాలులు ప్రభావంతో విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, వైర్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం వాటిల్లింది. వరిపనలు తడవడం, కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి పోవడంతో చేతికొచ్చిన పంటలు చేజారిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, వైరా, ఇల్లెందు, ఖమ్మం, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో ఆదివారం అకాల వర్షం కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం, టేకులపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, అశ్వారావుపేట, వేలేరుపాడు ప్రాంతాల్లో గాలివాన బీభత్సంతో మామిడికాయలు నేలరాలాయి. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో గాలి వాన రావడంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు టార్బాలిన్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాల్లిందని రైతులు చెపుతున్నారు.
కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడం, స్తంభాలు కూలడంతో సరఫరాకు అంతరాయం వాటిల్లింది. అధివారం అర్థరాత్రి వరకు కూడా ఖమ్మం నగరంతో పాటు పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. రఘునాధపాలెం, ఖమ్మం రూరల్, ముది గొండ మండలాల పరిధిలో గాలివాన మూలంగా పలు ప్రాంతాల్లో కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. కొత్తగూడెంలో రోడ్లు వాగులను తలపించాయి. పట్టణంలోని జాతీయ రహదారిపై భారీగా చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద సైతం భారీ స్థాయిలో వరదనీరు చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మూడు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో సుమారు గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా ఎంతమేర పంట నష్టం జరిగిందనే వివరాలు సోమవారం తెలుస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.