huge rain fall
-
అతలాకుతలం
మానవపాడు: మానవపాడు, కొడంగల్ మండలాలు కుండపోత వర్షంతో అతలాకుతలమయ్యాయి. రెండురోజుల క్రితం భారీవర్షం కురవగా.. అదేస్థాయిలో మంగళవారం కూడా కురిసింది. సాయంత్రం 7గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా రాత్రి 10గంటల వరకు కురుస్తూనే ఉంది. దీంతో పలు లోతట్టుకాలనీలు జలమయమయ్యాయి. అలాగే మానవపాడు మండలం పది గ్రామాల్లోని వాగులు, వంకలు ఏకమయ్యాయి. 2009లో వచ్చిన వరదల మాదిరిగానే మండలంలోని చెన్నిపాడు, పోతులపాడు, అమరవాయి, మానవపాడు, బొంకూరు, పెద్దఅముదాలపాడు, నారాయణపురం గ్రామాల్లోని పలు ఇళ్లల్లోకి భారీగా వరదనీరు చేరింది. వర్షం కురవడంతో ఈ గ్రామాలకు పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. నాటి వరదలను తలచుకొని భయభ్రాంతులకు గురయ్యారు. కనీసం వారి గోడును పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. మండల కేంద్రంలోని అయిజ కొట్టాల కాలనీ పూర్తిగా జలమయంకావడంతో నీటిలోనే రాత్రిమొత్తం గడిపారు. కనీసం భోజనం కూడా చేసుకోలేని పరిస్థితి దాపరించిందని, లోతట్టుప్రాంతం నుంచి తమ పిల్లలు, వంట సామగ్రిని సురక్షితంగా బంధువులకు ఇళ్లకు తరలించుకున్నారు. చెన్నిపాడు గ్రామంలో వాగు దాటుతుండగా అమరవాయి గ్రామానికి చెందిన ఓ యువకుడు నీటిలో కొట్టుకొనిపోతుండగా గ్రామస్తులు రక్షించారు. వాహనం నీటిలో గల్లంతైంది. బొంకూరులో పెద్దవాగు పొంగిపొర్లడంతో అలంపూర్ చౌరస్తానుంచి రాయిచూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ వాహనాల్లోనే ఉండిపోయారు. అమరవాయి వాగు పొంగిపొర్లడంతో ప్రయాణికులు అక్కడ కూడా ఇబ్బందులు పడ్డారు. ఎటుచూసినా.. నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దిక్కుతోచక నీటిలోనే ఉండిపోయారు. -
‘అకాల’నష్టం: నేల రాలిన మామిడి
* జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వాన * నేల రాలిన మామిడి * కల్లాల్లో తడిసిన మిర్చి, వరి పంటలు * పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలికి తోడు వడగండ్ల వర్షం పడడంతో మామిడికాయలు నేలరాలాయి. పలు గ్రామాల్లో ఈదురు గాలులు ప్రభావంతో విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, వైర్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం వాటిల్లింది. వరిపనలు తడవడం, కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి పోవడంతో చేతికొచ్చిన పంటలు చేజారిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, వైరా, ఇల్లెందు, ఖమ్మం, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో ఆదివారం అకాల వర్షం కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం, టేకులపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, అశ్వారావుపేట, వేలేరుపాడు ప్రాంతాల్లో గాలివాన బీభత్సంతో మామిడికాయలు నేలరాలాయి. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో గాలి వాన రావడంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు టార్బాలిన్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాల్లిందని రైతులు చెపుతున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడం, స్తంభాలు కూలడంతో సరఫరాకు అంతరాయం వాటిల్లింది. అధివారం అర్థరాత్రి వరకు కూడా ఖమ్మం నగరంతో పాటు పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. రఘునాధపాలెం, ఖమ్మం రూరల్, ముది గొండ మండలాల పరిధిలో గాలివాన మూలంగా పలు ప్రాంతాల్లో కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. కొత్తగూడెంలో రోడ్లు వాగులను తలపించాయి. పట్టణంలోని జాతీయ రహదారిపై భారీగా చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద సైతం భారీ స్థాయిలో వరదనీరు చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మూడు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో సుమారు గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా ఎంతమేర పంట నష్టం జరిగిందనే వివరాలు సోమవారం తెలుస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. -
అతలాకుతలం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా శుక్రవారం రెండోరోజు కూడా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. జిల్లాలో సగటున 31.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. అంతా అతలాకుతలమైంది. గరిడేపల్లిలో అత్యధికంగా 85.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. తిర్మలగిరి, మిర్యాలగూడ మండలాల్లో 85 మిల్లీమీటర్లు, నేరేడుచర్లలో 80.2, దామరచర్లలో 79.6, త్రిపురారంలో 70 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెన్‌పహాడ్‌లో 60.4, చిలుకూరులో 43.2, కోదాడలో 13.6, మేళ్లచెర్వులో 19.4, నాంపల్లిలో 34, చింతపల్లిలో 43, పీఏపల్లి 40, దేవరకొండలో 52, డిండి 23.6, చందంపేట 54.8, వేములపల్లి 50.2, నిడమనూర్ 28.2, హుజూర్నగర్ 40.2, మఠంపల్లి 25.4, హాలియా 32.4, పెద్దవూర 20.4, తుంగతుర్తి 33.2, నూతనకల్ 35.4, ఆత్మకూర్ (ఎస్) 32, అర్వ పల్లి 16.8, సూర్యాపేట 38, చివ్వెంల 44.2, మోతె 12.4, నడిగూడెం 26.2, మునగాల 29.2, గుర్రంపోడు, 15.2, మర్రిగూడ 34, కనగల్ 11.4, చండూరు 13.6, నారాయణపూర్ 4.4, మునుగోడు 15.2, నల్లగొండ 8.4, తిప్పర్తి 19.2, కేతేపల్లి 35, నకిరేకల్ 26.8, కట్టంగూరు 14.9, నార్కట్‌పల్లి 8.8, చిట్యాల 3.4, శాలిగౌరారం 25.2, రామన్నపేట 9.2, చౌటుప్పల్ 14.8, పోచంపల్లి 15.4, బీబీనగర్ 12.4, భువనగిరి 13, వలిగొండ 25.2, ఆత్మకూర్ (ఎం) 23.2, మోత్కూరు 45.8, గుండాలలో 43.8, ఆలేరు 8.2, యాదగిరిగుట్ట 10.6, రాజాపేట 8.4, తుర్కపల్లి 5.2, బి.రామారంలో 5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. - న్యూస్‌లైన్, నల్లగొండ అగ్రికల్చర్