అతలాకుతలం
మానవపాడు: మానవపాడు, కొడంగల్ మండలాలు కుండపోత వర్షంతో అతలాకుతలమయ్యాయి. రెండురోజుల క్రితం భారీవర్షం కురవగా.. అదేస్థాయిలో మంగళవారం కూడా కురిసింది. సాయంత్రం 7గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా రాత్రి 10గంటల వరకు కురుస్తూనే ఉంది. దీంతో పలు లోతట్టుకాలనీలు జలమయమయ్యాయి. అలాగే మానవపాడు మండలం పది గ్రామాల్లోని వాగులు, వంకలు ఏకమయ్యాయి. 2009లో వచ్చిన వరదల మాదిరిగానే మండలంలోని చెన్నిపాడు, పోతులపాడు, అమరవాయి, మానవపాడు, బొంకూరు, పెద్దఅముదాలపాడు, నారాయణపురం గ్రామాల్లోని పలు ఇళ్లల్లోకి భారీగా వరదనీరు చేరింది.
వర్షం కురవడంతో ఈ గ్రామాలకు పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. నాటి వరదలను తలచుకొని భయభ్రాంతులకు గురయ్యారు. కనీసం వారి గోడును పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. మండల కేంద్రంలోని అయిజ కొట్టాల కాలనీ పూర్తిగా జలమయంకావడంతో నీటిలోనే రాత్రిమొత్తం గడిపారు. కనీసం భోజనం కూడా చేసుకోలేని పరిస్థితి దాపరించిందని, లోతట్టుప్రాంతం నుంచి తమ పిల్లలు, వంట సామగ్రిని సురక్షితంగా బంధువులకు ఇళ్లకు తరలించుకున్నారు.
చెన్నిపాడు గ్రామంలో వాగు దాటుతుండగా అమరవాయి గ్రామానికి చెందిన ఓ యువకుడు నీటిలో కొట్టుకొనిపోతుండగా గ్రామస్తులు రక్షించారు. వాహనం నీటిలో గల్లంతైంది. బొంకూరులో పెద్దవాగు పొంగిపొర్లడంతో అలంపూర్ చౌరస్తానుంచి రాయిచూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ వాహనాల్లోనే ఉండిపోయారు. అమరవాయి వాగు పొంగిపొర్లడంతో ప్రయాణికులు అక్కడ కూడా ఇబ్బందులు పడ్డారు. ఎటుచూసినా.. నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దిక్కుతోచక నీటిలోనే ఉండిపోయారు.