Manavapadu Mandal
-
ముగ్గురి మృతి కలకలం: అంతా ‘మిస్టరీ’ !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు వ్యక్తుల అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం వివాదాస్పదమైంది. కల్తీ కల్లు కారణమని ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త రంగంలోకి దిగి సదరు కల్లు డిపో బాధ్యులతో కలిసి బాధిత కుటుంబాలతో మాట్లాడి సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో పలువురు ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందినట్లు సమాచారం. 7వ తేదీన ఒకరెనుక ఒకరు.. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన వెంకట్రాముడు (55), పింజరి సిద్దయ్య (47), వెంకన్న (60)కు కల్లు తాగే అలవాటు ఉంది. దాదాపుగా ప్రతి రోజూ వీరు కల్లు తాగుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ముగ్గురు రోజు వారీగానే ఈ నెల ఏడో తేదీన కల్లు తాగి సాయంత్రం వారివారి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఒకరెనుక ఒకరు మృతి చెందారు. తెల్లారి ఉదయం గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వీరి మృతికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో ఏ విషయం బయటికి రాలేదు. కానీ ఆ ముగ్గురి అనుమానాస్పద మృతిపై ఇటీవల గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగింది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు? అనుమానాస్పదంగా ముగ్గురు మృతి చెందడంతో ఉలిక్కిపడిన కల్లు డిపో పెద్దలు వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా కుటుంబాలతో సంప్రదింపులు జరిపేలా జిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేసినట్లు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.10 వేలు, 50 కిలోల బియ్యం అందజేసినట్లు తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఎక్సైజ్ అధికారుల పాత్రపైనా అనుమానాలు ఈ ఘటనలో ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురి మృతి విషయం వెలుగులోకి రావడంతో ఎక్సైజ్ అధికారులు ఈ నెల 24న గ్రామాన్ని సందర్శించారు. నేరుగా కల్లు డిపోకు వెళ్లి శాంపిళ్లు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందు కలిపినట్లు తమకు ఆధారాలేవీ లభించలేదని.. అనుమానంతో శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు. ఇక్కడ అనుమానాస్పదంగా ముగ్గురు మృతి చెందిన విషయాన్ని వెల్లడించకపోగా.. దాచిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. తాజాగా మంగళవారం గద్వాల ఆర్డీఓ రాములు, డీఎస్పీ యాదగిరి గ్రామంలోని మృతి చెందిన బాధితుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మరో ఆరుగురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం ఉందని వారు చెప్పారు. దీన్ని బట్టి తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ కుట్ర ఉందా.. గద్వాల జిల్లాలో సంబంధించి అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకే పారీ్టకి చెందిన నాయకుల మధ్య పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధికి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు పొసగడం లేదు. జల్లాపురంలో ముగ్గురి అనుమానాస్పద మృతికి సంబంధించి అధికార పార్టీ శ్రేణుల్లో చర్చ ఈ ముగ్గురి నేతల చుట్టే సాగుతోంది. ఇందులో ఏమైనా కుట్ర జరుగుతోందా.. ఈ ప్రచారం వెనుక ఎవరు ఉన్నారు.. వంటి అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై సదరు జిల్లా కీలక ప్రజాప్రతినిధి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ..‘రాజకీయ కక్షలతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. గ్రామంలో ముగ్గురు చనిపోయిన విషయం వాస్తవమే. మేము ఆ సమాచారం తెలుసుకొని గ్రామానికి వెళ్లాం. అక్కడి పరిస్థితిని చూసి అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాం. అంత్యక్రియల కోసం ఇద్దరికి డబ్బులు పంపించాం. అందులో ఒక్కరు మాత్రమే తీసుకున్నారు. పదేళ్లుగా గ్రామంలో పెళ్లిలు, శుభకార్యాలకు, మట్టి ఖర్చులకు ఇస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇస్తున్నాం. కానీ ఒక బీసీ నాయకురాలు ఎదగడం ఇష్టం లేని కొందరు రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారు. విచారణ చేసి నిజనిజాలు వెలికితీయాలని మేము పోలీసులను కోరాం.’ అని తెలిపారు. -
అతలాకుతలం
మానవపాడు: మానవపాడు, కొడంగల్ మండలాలు కుండపోత వర్షంతో అతలాకుతలమయ్యాయి. రెండురోజుల క్రితం భారీవర్షం కురవగా.. అదేస్థాయిలో మంగళవారం కూడా కురిసింది. సాయంత్రం 7గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా రాత్రి 10గంటల వరకు కురుస్తూనే ఉంది. దీంతో పలు లోతట్టుకాలనీలు జలమయమయ్యాయి. అలాగే మానవపాడు మండలం పది గ్రామాల్లోని వాగులు, వంకలు ఏకమయ్యాయి. 2009లో వచ్చిన వరదల మాదిరిగానే మండలంలోని చెన్నిపాడు, పోతులపాడు, అమరవాయి, మానవపాడు, బొంకూరు, పెద్దఅముదాలపాడు, నారాయణపురం గ్రామాల్లోని పలు ఇళ్లల్లోకి భారీగా వరదనీరు చేరింది. వర్షం కురవడంతో ఈ గ్రామాలకు పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. నాటి వరదలను తలచుకొని భయభ్రాంతులకు గురయ్యారు. కనీసం వారి గోడును పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. మండల కేంద్రంలోని అయిజ కొట్టాల కాలనీ పూర్తిగా జలమయంకావడంతో నీటిలోనే రాత్రిమొత్తం గడిపారు. కనీసం భోజనం కూడా చేసుకోలేని పరిస్థితి దాపరించిందని, లోతట్టుప్రాంతం నుంచి తమ పిల్లలు, వంట సామగ్రిని సురక్షితంగా బంధువులకు ఇళ్లకు తరలించుకున్నారు. చెన్నిపాడు గ్రామంలో వాగు దాటుతుండగా అమరవాయి గ్రామానికి చెందిన ఓ యువకుడు నీటిలో కొట్టుకొనిపోతుండగా గ్రామస్తులు రక్షించారు. వాహనం నీటిలో గల్లంతైంది. బొంకూరులో పెద్దవాగు పొంగిపొర్లడంతో అలంపూర్ చౌరస్తానుంచి రాయిచూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ వాహనాల్లోనే ఉండిపోయారు. అమరవాయి వాగు పొంగిపొర్లడంతో ప్రయాణికులు అక్కడ కూడా ఇబ్బందులు పడ్డారు. ఎటుచూసినా.. నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దిక్కుతోచక నీటిలోనే ఉండిపోయారు. -
బస్సులో పొగలు, భయంతో ప్రయాణికుల పరుగు
మానవపాడు: పాలెం దుర్ఘటన మరవకముందే మరో వోల్వో బస్సు ప్రమాదం ప్రయాణికులను భయపెట్టింది. వోల్వో బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్వీఆర్ వోల్వో బస్సులో పొగలు రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాలపాడులో నిలివేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతుండగా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సును నిలిపివేసి డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు బస్సు దిగి భయంతో దూరంగా పరుగులు తీశారు. తెల్లారినా వారిని వారిని గమ్యస్థానాలకు చేర్చే వారు రాకపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద గత అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.