మాజీ రౌడీషీటర్ హత్య | rowdy sheeter murder in Kottagudem | Sakshi
Sakshi News home page

మాజీ రౌడీషీటర్ హత్య

Published Fri, Aug 30 2013 3:34 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

rowdy sheeter murder in Kottagudem

లక్ష్మీదేవిపల్లి(కొత్తగూడెం), న్యూస్‌లైన్: పాతకక్షల నేపథ్యంలో మాజీరౌడీషీటర్‌ను ప్రత్యర్థులు దారుణంగా కొట్టి హత్య చేశారు. కొత్తగూడెంలో సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి....
 
 కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్‌బస్తీకి చెందిన మాజీ రౌడీషీటర్ వల్లబ్‌దాస్ వెంకట్‌కు సన్యాసిబస్తీకి చెందిన శ్రీరామ్‌కు గతంలో గొడవలు జరిగేవి. రెండు నెలల క్రితం కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే గొడవలు వద్దని, కలిసే ఉందామని చెప్పడానికి బుధవారం అర్ధరాత్రి బాబుక్యాంప్‌లో శ్రీరామ్ వద్దకు వెంకట్ అతని అనుచరుడు చిన్ని వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి, గొడవ జరిగింది. రెచ్చిపోయిన శ్రీరామ్ అనుచరులు క్రాంతికుమార్, పట్టాల్, పద్మారావు, అస్మత్‌తోపాటు మరికొందరు వెంకట్‌పై దాడికి దిగారు. 
 
 పక్కనే ఉన్న రాళ్లతో తలపై బలంగా మోదారు. వెంకట్‌తోపాటు వచ్చిన చిన్నికి  గాయాలు కావడంతో అక్కడినుంచి తప్పించుకొని హనుమాన్‌బస్తీలో ఉన్న సన్నిహితుల వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. అప్పటికే వెంకట్‌ను తీవ్రంగా కొట్టిన శ్రీరామ్ అనుచరులు అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతనిని చీకటి ప్రాంతంలో పడవేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు సుమారు రెండు గంటల పాటు బాబుక్యాంప్‌లో వెతుకులాడగా పాతపోలీస్‌స్టేషన్ సమీపంలో తీవ్ర గాయాలైన వెంకట్ కనిపించాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం ఖమ్మం తరలించారు. 
 
 అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం వెంకట్ మృతిచెందాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా,  తన భర్తను బలవంతంగా ఇంటి నుంచి తీసుకొని పోయిన శ్రీరామ్ అనుచరులు హత్య చేశారని వెంకట్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు పాల్పడిన శ్రీరామ్‌తోపాటు క్రాంతికుమార్, పటాల్, పద్మారావు, అస్మత్‌లను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం ఏఎస్పీ భాస్కర్ భూషణ్   విలేకరులకు తెలిపారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. వన్ టౌన్ సీఐ నరేష్‌కుమార్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement