55 రోజుల్లో.. 68 ప్రాణాలు | Maoists,Police Crackdown On Border Areas | Sakshi
Sakshi News home page

55 రోజుల్లో.. 68 ప్రాణాలు

Published Thu, Apr 26 2018 7:00 AM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM

Maoists,Police Crackdown On Border Areas - Sakshi

మావోయిస్టుల సామగ్రిని పరిశీలిస్తున్న దృశ్యం(ఫైల్‌)

జిల్లా సరిహద్దులో రోజురోజుకు టెన్షన్‌ పెరిగిపోతోంది. అనుక్షణం యుద్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. పోలీస్‌ కాల్పులు, మావోయిస్టు దాడులతో గిరిజనం ఆందోళనకు గురవుతోంది. గత 55 రోజుల్లో తడపలగుట్టల్లో 10మంది, గడ్చిరోలిలో 38 మంది మావోయిస్టులు పోలీస్‌ కాల్పుల్లో మృతి చెందారు. 12 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లతోపాటు ఇన్‌ఫార్మర్లు సహా మొత్తం 20 మందిని మావోయిస్టులు హతమార్చారు.  

సాక్షి, కొత్తగూడెం : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, నారాయణపూర్, గడ్చిరోలి జిల్లాల్లో రోజు రోజుకు టెన్షన్‌ పెరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిత్యం పేలుళ్ల మోత, తుపాకీ తూటాల చప్పుళ్లతో సరిహద్దు గ్రామాల్లో దడ నెలకొంది. ఆయా రాష్ట్రాల్లోని అధికార బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు. సరిహద్దు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన 55 రోజుల్లో ఏకంగా 68 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గత మార్చి 2వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా, తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. మొత్తం 48 మంది మావోయిస్టులు మృతి చెందారు.

తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌ తరువాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన మావోయిస్టులు అప్పటినుంచి సరిహద్దుల్లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, నారాయణపూర్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో పలు విధ్వంస కార్యకలాపాలు, హత్యలకు పాల్పడుతున్నారు. భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, మొత్తం 20 మందిని హతమార్చారు. మావోయిస్టుల దాడి మృతుల్లో 12 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లతో పాటు బీజాపూర్‌ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఒక సర్పంచ్, ఒక కాంట్రాక్టర్, ఒక ఇంజినీర్, ఒక మాజీ కానిస్టేబుల్, ఇద్దరు మాజీ మావోయిస్టులు ఉన్నారు. తాజాగా బుధవారం దంతెవాడ జిల్లా కొవ్వకొండ పరిధిలోని గర్‌మిరి గ్రామంలో పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో గ్రామస్తుడిని హత్య చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఈనెల 25న నిరసనదినంగా చేపట్టాలని మావోయిస్టులు ఈ నెల 24న భద్రాద్రి జిల్లా చర్ల మండలం ఆంజనేయపురం – చినముసిలేరు గ్రామాల మధ్య పోస్టర్లు, కరపత్రాలను వదిలిపెట్టారు. చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో ఈ పోస్టర్లను విడుదల చేశారు. 
తాజాగా బుధవారం చర్ల మండలంలోని పెదమిడిసీలేరు వద్ద రోటింతవాగుపై ఉన్న వంతెనను మావోయిస్టులు పేల్చివేశారు. దండకారణ్యం దాటి వచ్చి మరీ ఈ విధ్వంసానికి మావోయిస్టులు పాల్పడ్డారు. 
భద్రాద్రి, జయశంకర్‌ జిల్లాల్లో కార్యకలాపాలు..  
నోట్ల రద్దు కారణంగా దెబ్బతిన్న మావోయిస్టులు ఆర్థిక వనరులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రాంతం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రెండు జిల్లాల్లోని గుండాల, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, మహాముత్తారం మండలాల్లో గతంలో తమకు డెన్‌లుగా ఉన్న గ్రామాల్లో రిక్రూట్‌మెంట్ల ద్వారా పూర్వవైభవం సాధించేందుకు మావోలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొరియర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వలస గొత్తికోయల గ్రామాలను సైతం ఇందుకోసం ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. చాపకింద నీరులా తెలంగాణ జిల్లాల్లో విస్తరించేందుకు ఇటీవలే కమిటీలు సైతం వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మావోయిస్టులు పేలుడు పదార్థాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇక్కడి పోలీసుల తనిఖీల్లో పేలుడు పదార్థాలు పట్టుబడడం ఇందుకు నిదర్శనం. మరోవైపు 6 నెలలుగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల ద్వారా గోదావరి దాటి ఇతర జిలాల్లోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గత నెల 2న తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. దీంతో అప్పటినుంచి సరిహద్దుల్లో నిత్యం యుద్ధ వాతావరణం నెలకొంది. సాధారణంగా భారీగా ఆకురాలే ఎండాకాలంలో మావోయిస్టులు తాము సమాంతర ప్రభుత్వం నడుపుతున్న బస్తర్‌ దండకారణ్యంలోని అబూజ్‌మడ్‌(షెల్టర్‌జోన్‌)కు వెళతారు.

ఈసారి మాత్రం అనుకున్న సమయానికి మావోలు దండకారణ్యానికి చేరుకోలేకపోయారు. ఇప్పటికే సంఖ్యాబలం పరంగా, నోట్ల రద్దుతో ఆర్థికంగా బలహీనపడ్డారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోనూ కార్యకలాపాలు పెంచేందుకు ఐదు నెలలుగా రిక్రూట్‌మెంట్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొత్తగా తెలంగాణలోని ఏరియా, డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్థిక వనరులు, పేలుడు సామగ్రి సమీకరించుకునేందుకు గోదావరి దాటి తెలంగాణలోని ఇతర జిల్లాల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎడతెగని పోరు సాగుతోంది.  
మావోయిస్టు దాడులు

ఈనెల 20వ తేదీన సుకుమా జిల్లా కిష్టారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ మృతి చెందాడు. 
16న ఫైదగూడ రోడ్డు నిర్మాణ పనుల ఇంజనీర్‌ను హత్యచేశారు. 
 15న సుక్మా జిల్లా చింతగుప్ప వద్ద ఐఈడీ పేల్చడంతో డీఆర్‌జీ జవాన్‌ గాయపడ్డాడు.   
 14న సుక్మా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఫైదగూడ వద్ద రోడ్డు నిర్మాణంలో ఉన్న వాహనాన్ని తగులబెట్టారు. కార్మికులను కొట్టారు. అదే సీఆర్‌ఫీఎఫ్‌ క్యాంపులోని  మూడు ఖాళీ బ్యారక్‌లను పేల్చివేశారు.  

9న బీజాపూర్‌ జిల్లా ఫర్సెగఢ్‌ పరిధిలోని కుట్రు మార్గంలో బస్సును పేల్చివేయడంతో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  
8న సుకుమా జిల్లా బడేసుట్టి గ్రామ సర్పంచ్‌ను మావోయిస్టులు గొంతుకోసి హత్యచేశారు. రెండు మిక్సర్లను, నాలుగు వాహనాలను ధ్వంసం చేశారు. 
7న బీజాపూర్‌ జిల్లా ఖేరామ్‌గఢ్‌ అటవీ శాఖ సిబ్బందిని చితకబాదారు. 
5న చర్ల ఏరియా తిప్పాపురం–పామేడు గ్రామాల మధ్య పోలీసులే లక్ష్యంగా ఐఈడీ బాంబు పేల్చడంతో స్థానిక గిరిజనుల పశువులు మృతిచెందాయి.  
మార్చి 28వ తేదీన పోలీస్‌ ఇన్ఫార్మర్ల నెపంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పకు చెందిన ఇర్ప లక్ష్మణ్‌ అలియాస్‌ భరత్‌ అనే మాజీ మావోయిస్టును హతమార్చారు. 
మార్చి 28న బీజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిన్న ఊట్లపల్లి గ్రామానికి చెందిన సోడి అండాలు అనే మాజీ మావోయిస్టును హతమార్చారు.  
గత మార్చి 27న బీజాపూర్‌ జిల్లా భూపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీష్‌ కొండెరను హత్య చేశారు.

మార్చి 19న బీజాపూర్‌ జిల్లా నూకన్‌పాల్‌వద్ద రోడ్డుపనులు చేయిస్తున్న కాంట్రాక్టర్‌ విశాల్‌కుమార్‌ను హతమార్చారు.  
మార్చి 13న సుకుమా జిల్లా కిష్టారం వద్ద శక్తిమంతమైన ఐఈడీ పేల్చడం ద్వారా 9 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు.  
 తెలంగాణలోకి మరింతగా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించే మావోయిస్టులు పూజారి కాంకేర్‌ ఎన్‌కౌంటర్‌కు ముందు జనవరి 24న చర్ల మండలం క్రాంతిపురంలో ఒకరిని హత్యచేశారు. జనవరి 26వ తేదీన పినపాక మండలం జానంపేట సమీపంలోని ఉమేష్‌చంద్రనగర్‌లో మరొకరిని హత్యచేశారు. 
పోలీస్‌ కాల్పులు, అరెస్ట్‌లు : ఈ నెల 1న సుకుమాజిల్లా కిష్టారం వద్ద ఎస్‌టీఎఫ్, డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ దళాలు 12 మంది మావోయిస్టులను అరెస్టు చేశాయి. మార్చి 2న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో  38 మంది మావోయిస్టులు మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement