జూనియర్ స్టాఫ్ నర్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ పరిధిలోని ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో నిర్దేశిత అంశాల నుంచి కాకుండా ఇతర ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మెరిట్ జాబితాపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ 84 జూనియర్ స్టాఫ్ నర్స్ ‘డి’గ్రేడ్ పోస్టుల భర్తీకి భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కొత్తగూడెం, పాల్వంచల్లోని 18 కేంద్రాల్లో ఆదివారం రాత పరీక్షను నిర్వహించింది. అయితే, హాల్‌టికెట్‌లో పేర్కొన్నట్లుగా నర్స్ ఉద్యోగ ప్రశ్న లు కాకుండా 90% ల్యాబ్ టెక్నీషియన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాల్‌టికెట్, ప్రశ్నపత్రం అభ్యర్థులకు ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఇదిలాఉంటే ప్రశ్నపత్రంలో 150 ప్రశ్నలు ఇచ్చి, ఓఎంఆర్ షీట్‌లో మాత్రం సమాధానాలు ఇవ్వడానికి 200 గడులు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది.
అనర్హత ఎలా?: రాత పరీక్షకు 11,133 మంది దరఖాస్తు చేసుకోగా 7,666 మంది హాజరయ్యారు. వీరిలో పది శాతం మందిని సంస్థ అనర్హులుగా ప్రకటించింది. అయితే 25.33 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థిని అనర్హుడిగా పేర్కొన్న సంస్థ అవే మార్కు లు వచ్చిన మరికొందరి పేర్లను మెరిట్ జాబితాలో పొందుపరిచింది. దీనిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్నుంచీ సింగరేణిలో నియామకాలపై విమర్శలు వస్తుండగా, తాజా పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఈ విషయంపై సంస్థ జీఎం పర్సనల్(రిక్రూట్‌మెంట్ సెల్) అందెల ఆనందరావును ‘సాక్షి’వివరణ కోరగా ప్రశ్నపత్రాన్ని నిపుణులతోనే సిద్ధం చేయించామని తెలిపారు. ప్రశ్నపేపర్ అభ్యర్థులకు ఇచ్చే విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment