
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియలో నిబంధనలకు తూట్లు
ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ విధానానికి పాతర
మంత్రుల సిఫార్సుతో ట్రస్టులో తిష్ట వేసిన అధికారుల నిర్వాకం
సాక్షి, అమరావతి: బీమా విధానం ప్రవేశపెట్టడం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని గాలికి వదిలేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం పథకం అమలు, ట్రస్ట్ నిర్వహణను తొమ్మిది నెలల్లో అస్తవ్యస్థంగా మార్చేసింది. ఇదే అదునుగా మంత్రుల సిఫార్సులతో ట్రస్ట్‌లో మకాం వేసిన కొందరు అధికారులు అడ్డగోలు దోపిడీకి తెర తీశారు. ఎంపానెల్‌మెంట్ ప్రక్రియను అవినీతిమయంగా మార్చేశారని ఆస్పత్రుల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు.
గతంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ (ఫీఫో) విధానంలో ఎంపానెల్‌మెంట్ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించగా ట్రస్ట్‌లో ముఠాగా ఏర్పడిన కొందరు అధికారులు దీనికి తూట్లు పొడిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం బీమా విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్న నేపథ్యంలో ఎంపానెల్‌మెంట్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని ట్రస్ట్ సీఈవోను వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గతేడాది ఆదేశించారు. అయితే సీఈవోలు మారిపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వసూళ్ల దందాకు తెర తీశారు. ఫీఫో విధానాన్ని పక్కన పెట్టి 15 – 20 ఆస్పత్రుల నుంచి డబ్బులు వసూళ్లు చేసి అనుమతులు జారీ చేశారు.
కొత్త దరఖాస్తులు..
ఎన్నికల కోడ్ కారణంగా గతేడాది మార్చి నుంచే కొత్త ఎంపానెల్‌మెంట్ దరఖాస్తులను తీసుకోవడం నిలిపివేశారు. అయితే ట్రస్ట్‌లో పాగా వేసిన ముఠా ఆన్‌లైన్‌లో ఎంపానెల్‌మెంట్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించి కొన్ని ఆస్పత్రుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు వెల్లడైంది. సీఈవో ఆమోదం అనంతరం ఎంపానెల్‌మెంట్ ప్రక్రియ పూర్తయినట్టు ఆస్పత్రులకు నేరుగా మెయిల్ వెళ్లే విధానాన్ని నిలిపివేసి లాగిన్‌లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులున్నాయి. రెవెన్యూ మంత్రి సిఫార్సుతో డిప్యుటేషన్‌పై ట్రస్ట్‌కు వచ్చిన ఓ అధికారికి కీలకమైన ఎంపానెల్‌మెంట్ ఇన్‌చార్జ్ బాధ్యతలను కట్టబెట్టారు.
ఎంపానెల్‌మెంట్ దరఖాస్తుల ఆధారంగా ఆస్పత్రుల్లో తనిఖీలకు ప్రత్యేక బృందాలను నియమించి ఆ నివేదిక ఆధారంగా అన్ని అర్హతలున్న దరఖాస్తులనే ఆమోదిస్తారు. ఈ ప్రక్రియలో పారదర్శకతకు పాతరేసి ఎంపానెల్‌మెంట్ విభాగాధిపతిగా ఉన్న సదరు అధికారి ఆస్పత్రుల్లో ఇన్‌స్పెక్షన్‌లు నిర్వహించి, తానే నివేదిక రూపొందించి, ఆమోదించే వరకూ అన్ని పనులను చక్కబెట్టినట్లు తెలుస్తోంది. వైద్య శాఖ మంత్రి సిఫార్సుతో ట్రస్ట్‌లో మరో అధికారి డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఆయన పరిపాలన బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉండగా తనిఖీల పేరిట ఆస్పత్రుల్లో హడావుడి చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. వైద్యులు అందుబాటులో లేకపోవడం, సేవల్లో నిర్లక్ష్యం, ఇలా ఆస్పత్రులపై ఫిర్యాదులు వచి్చన సందర్భాల్లో ట్రస్ట్‌లో పనిచేసే వైద్యులను తనిఖీలకు పంపుతుంటారు. ఇందుకు విరుద్ధంగా నాన్–డాక్టర్ అయిన సదరు అధికారి తనిఖీలకు వెళ్లడం ఇదే తొలిసారని వైద్య శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇష్టారాజ్యంగా సస్పెన్షన్ల ఎత్తివేత
ఆస్పత్రులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడటం, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి సంబంధించి సుమారు 10 ఆస్పత్రులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో పాటు పెనాల్టీని తొలగించారు. గుంటూరులో బ్రెయిన్ హెమరేజీ చికిత్సల పేరిట దోపిడీకి పాల్పడిన ఓ ఆస్పత్రిపై గత ఏడాది సస్పెన్షన్ వేటు వేసి రూ.కోటి పెనాల్టీ విధించారు. ఈ ఆస్పత్రి యాజమాన్యంతో డీల్ కుదుర్చుకుని సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో పాటు పెనాల్టీ భారీగా తగ్గించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైద్యులు అందుబాటులో లేని ఓ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిఫార్సు చేస్తే రెండు వారాలు తిరగకుండానే దాన్ని ఎత్తివేశారు.
Comments
Please login to add a commentAdd a comment