కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి రాష్ట్రాలను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. మతం, భాష, సంస్కృతి పేరుతో దేశంలోని బహుళ సంస్కృతులను ఒకే గాటన కట్టేసి ఏకరూపత సాధన అంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీని ఎన్నుకుంటేనే పాలన సజావుగా ఉంటుందన్న సంకేతాన్ని ఆయా రాష్ట్ర ప్రజలకు పంపిస్తోంది. నిజానికి ప్రాంతాలకు ప్రాముఖ్యం ఇచ్చినంతకాలం, స్థానికతలను గౌరవించినంతకాలం... ఈ దేశ ప్రజలు ‘భారత్ మాతాకీ జై’ అనడానికి సంకోచించరు. వారు ఈ దేశం తమదని భావిస్తారు. స్థానిక ప్రజల అవసరాలు, కోరికలు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిం చడం; వారి సాంస్కృతిక విలువలను నిలబెట్టడం, ఆచారాలను గౌరవించడం వంటి చర్యల ద్వారా ప్రాంతీయ పార్టీలు తమ ప్రజల్ని దేశభక్తులుగా నిలబెట్టుకుంటాయి.
భిన్నత్వంలో ఏకత్వానికి అరుదైన ఉదాహరణ భారత్. అందుకు భారతీయులుగా మనమంతా గర్వించాలి. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ సందర్భాన మన సంబరం అంబరాన్ని అంటడం సహేతుకం. కానీ... గత ఏడెనిమిదేళ్ళుగా ఈ దేశంలో పరిణామాలు చూస్తే భారతీయాత్మకు ప్రమాదం ముంచుకొస్తున్నదన్న ఆందోళన కలుగుతున్నది. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగజేస్తున్న కేంద్ర ప్రభుత్వ దుందుడుకు విధానాలు ఆవేదన కలిగిస్తున్నాయి.
ఒకప్పుడు స్వాతంత్య్రమే లక్ష్యంగా దేశమంతా కాంగ్రెస్ గొడుగు కిందకు వచ్చింది. స్వాతంత్య్రానంతరం మెల్లిగానే అయినా బలంగా ప్రాంతాలు తమ గుర్తింపును నొక్కి చెప్పడం ప్రారంభించాయి, ప్రాంతీయ భావనలు, అస్తిత్వాలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో బలమైన ప్రాంతీయ నాయకుల ఆవిర్భావం ద్వారా రాష్ట్రాల ఉనికి బలపడింది. ఈ నాయకులు కేంద్రం పట్టులో ఉండకుండా తమం తట తాముగా శక్తిమంతంగా ఉన్నారు. ప్రత్యామ్నాయ ‘శక్తి కేంద్రా లను’ నిరోధించే కేంద్రం, బలమైన పట్టుకు ఇది ముప్పుగా భావించిన అధిష్టానం స్థానిక నాయకుల బలాన్ని అరికట్టే ప్రయత్నాలు చేసింది. దీనితో ప్రాంతీయ సమూహాలు కొత్త పార్టీలుగా ఆవిర్భవించడంతో, క్రమంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పట్టు తప్పింది.
విభిన్న సాంస్కృతిక వారసత్వాలు, భాషా సంపద, ఆహార ఆహార్య ఆచార వ్యవహారాలు, బహుళ మత విశ్వాసాలు కలిగిన ప్రజలను ఒకే ఒక్క గుర్తింపులో ఇమడ్చలేరు. ఇది మరింత అసహనా నికి, విభజనకు, తిరుగుబాటుకు మాత్రమే దారి తీస్తుంది. గతంలో సోవియట్ యూనియన్ విభిన్న ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించి, తనలో విలీనం చేసుకుంది. చివరికి అది కుప్పకూలి ప్రతి ప్రాంతం స్వతంత్ర దేశంగా విడిపోయింది. అమెరికాలో రాష్ట్రాలకు విస్తారమైన స్వేచ్ఛ ఉంది.
ఐక్యత ఎట్లా, ఎందుకు సాధించబడుతుందో అర్థం చేసుకోవా లంటే – దేశాలు విఫలం కావడానికి, విచ్ఛిన్నం కావడానికి గల కారణాలను అధ్యయనం చేయాలి. విచ్ఛిన్నమైన దేశాలలో స్పష్టంగా కనిపించే ఒక అంశం ఏమిటంటే ‘ఏకరూపత’ పేరిట జరిగే అరాచకం! మెజారిటీ మతం (అధికారికమైనా, కాకపోయినా) ఇతర మతాలను సహించకపోవటం; ఒక భాషకు ఇతర భాషలకంటే ప్రాముఖ్యం ఇవ్వడం; స్థానిక సంస్కృతిని విస్మరించడం; వారి మనోభావాలను, ఆకాంక్షలను పక్కన పెట్టడం! ఈ సాంస్కృతిక ఆధిపత్య ధోరణులను ఎదిరించే ప్రాంతీయ పార్టీలు, నాయకులు లేకుంటే... ఆ మాత్రం ‘ప్రెషర్ రిలీజ్ వ్యవస్థ’ లేకుంటే... వాటిని సహించకుంటే... వాటిని నిర్మూలించాలి అనుకుంటే... దీర్ఘకాలిక పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఒక్కటే మతం అన్ని రాష్ట్రాల ప్రజలను ఏకం చేయగల దనేది వట్టి అపోహ మాత్రమే కాదు, చారిత్రక అవగాహన లేక పోవడం కూడా! తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్‌లలో ఉన్న మతం ఒకటే అయినా... బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడినట్లు? ఒకటే భాష అయినంత మాత్రాన వివక్షను సహించలేమని పోరాడి రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ నేర్పిన పాఠాల్ని కూడా మర్చిపోరాదు. కాబట్టి మతం వల్ల, భాష వల్ల బలవంతంగా ఐక్యత సాధించగలమని నమ్మే వారు ఇంకా ఆలస్యం చేయకుండా మేలుకోవాలి. దేశ సమైక్యతకు ప్రాంతీయ పార్టీలు చాలా అవసరం. విస్తారమైన భౌగోళిక, సాంస్కృ తిక, భాషా వైవిధ్యం ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ ఒక్కటిగా ఎట్లా ఉండగలుగుతున్నదని ఈ వ్యాస రచయితలను ఇంగ్లండులో కొలీగ్స్ అడిగారు. ఇంకా ఎందరో ఈ భిన్నత్వంలో ఏకత్వ భావనకు ఆశ్చర్యపడుతూ ఉంటారు. కేవలం భావనయే కాదు, అది స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇంకా బలంగా ఉండడం ఒక అబ్బురమైన వాస్తవం. దానికి ప్రాంతీయ పార్టీలే కారణం. ప్రాంతాలకు ప్రాముఖ్యం ఇచ్చినంతకాలం, స్థానికతలను గౌరవించినంతకాలం ఈ దేశ ప్రజలు ‘భారత్ మాతాకీ జై’ అనడానికి సంకోచించరు. వారు ఈ దేశం తమదని భావిస్తారు. స్థానిక ప్రజల అవసరాలు, కోరికలు, ఆకాంక్షలకు ప్రాతి నిధ్యం వహించడం; వారి సాంస్కృతిక విలువలను నిలబెట్టడం; వారి ఆచారాలను గౌరవించడం వంటి చర్యల ద్వారా ప్రాంతీయ పార్టీలు తమ ప్రజల్ని దేశభక్తులుగా నిలబెట్టుకుంటాయి.
మన దేశ ఐక్యతకు ప్రమాదం బలమైన ప్రాంతీయ పార్టీల వల్ల కాదు, రాష్ట్రాలపై కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే వస్తుంది. రాష్ట్రాలలో బలమైన పార్టీలు, నాయకులు ప్రజాస్వామిక మార్గాల ద్వారా, ప్రజలను సమీకరించడం ద్వారా ప్రాంతీయ గౌర వాన్ని నిలబెట్టవచ్చు, రక్షించవచ్చు. రాష్ట్రాల ఆకాంక్షలు గౌరవించని, స్థానిక సంస్కృతితో సంబంధం లేని ‘ఏకరూప’ రాజకీయ, సామాజిక విధానాలు ఉండే జాతీయ పార్టీలు మనలేవు అనడానికి దక్షిణాది మంచి ఉదాహరణ. తమ పాలనలోని ఒక్క కర్ణాటకలో తప్ప దక్షిణాది రాష్ట్రాలపట్ల కేంద్రంలోని అధికార పార్టీ వివక్ష ఈ ఏడేళ్ళల్లో తారస్థాయికి చేరుకున్నది. తెలుగు రాష్ట్రాల పట్ల వివక్ష మరీ ఎక్కువ అయింది. బెంగాల్, ఢిల్లీ, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలతో సహా దక్షిణాది కూడా బలంగా ఈ ‘ఫెడరల్ విఘాతం’ పట్ల గొంతు కూడదీసుకుంటున్నది. రాష్ట్రాలలో పార్టీలు ఏవైనా... రాజకీయ అవగాహనలు, అవసరాలు ఎట్లున్నా... కేంద్రం పెత్తనాన్ని నిలువరిం చకపోతే ఆయా పార్టీలకే కాదు రాష్ట్రాల ఉనికికి కూడా అర్థం లేకుండా పోతుంది. ‘మీపై అన్ని హక్కులూ మావే – బాధ్యతలు మాత్రం మాకొద్దు’ అన్న రీతిలో కేంద్రం రాష్ట్రాల మీద దాష్టీకం చేస్తున్నది.
రాజ్యాంగం, ఫెడరల్ వ్యవస్థ నేడు నామమాత్రం అయినాయి. ఒక్కటొక్కటిగా రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నది. రాష్ట్రాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను తన అధీనంలోకి తీసుకుంటున్నది. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్ర పరిధిలోది అయినా కొను గోళ్ళు–అమ్మకాలు, ఎరువులు–ఎగుమతులు, మద్దతుధర–గోడౌన్లు అన్నీ తన గుప్పెటలో ఉంచుకున్నది. రాష్ట్రాలు ఆందోళన చెందు తున్న మరో అంశం– విద్యుత్ సంస్కరణలు. ‘విద్యుత్ చట్ట సవరణల బిల్లు’ ఉద్దేశం కార్పొరేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పగించడమే! పంపుసెట్ల దగ్గర మీటర్లు పెట్టడం దగ్గర నుంచి, రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ నిర్వహణ మొత్తం తన గుప్పిటలో పెట్టుకుంటోంది కేంద్రం. విద్యుత్ ధరలు, కొనుగోళ్ళు, సరఫరా మొత్తం కేంద్రం అజమాయి షీలో ఉంటాయి. వారు చెప్పినట్టు వినకపోతే రాష్ట్రాలకు పెనాల్టీ విధిస్తుంది. రాష్ట్రాలకు అప్పులు రాకుండా చేస్తుంది! న్యాయంగా రాష్ట్రాలకు రావలసిన పన్నుల వాటాను కూడా ఇవ్వడంలో ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాల చేతుల్లోని సహకార వ్యవస్థనూ కేంద్రం గుప్పిట్లోకి తీసుకుంది. ఇప్పుడు ‘జనన, మరణ రిజిస్ట్రేషన్ చట్టం’ సవరణ ముసుగులో రాష్ట్రాల మరో అధికారాన్ని కూడా కత్తి రించ బూనుకుంటున్నది. వారు తలపెట్టిన ‘సంస్కరణల’ ప్రకారం జనన, మరణ రిజిస్ట్రేషన్ వివరాల పర్యవేక్షణ కేంద్ర హోంశాఖ అధీనంలోకి వెళ్తుంది. సివిల్ సర్వెంట్స్‌ను తమ ఇష్టం వచ్చినట్టు, రాష్ట్రాలతోనూ అధికారులతోనూ సంప్రదించకుండా కేంద్ర సర్వీసుల లోనికి రప్పించుకోవడం కోసం ఒక దుర్మార్గమైన చట్టాన్నీ తేబోతున్నది కేంద్రం. గతంలో ఇట్లాంటి చొరబాట్లు చాలానే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి పరీక్షలను ఏకీకృతం చేసింది. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకే పరిమితమైన బీఎస్‌ఎఫ్ దళాల పరిధిని 50 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఓడ రేవులపై రాష్ట్రాల అధికారాన్ని కూడా కబళించ చూస్తున్నారు.
ఇదేమి ఫెడరల్ స్ఫూర్తి? ఇదేమి రాజ్యాంగబద్ధత? ఈ దేశ ప్రజలకు దక్కాల్సినవి ఏమిటో స్ఫటిక స్పష్టంగా చెప్పింది – మన రాజ్యాంగం. అన్ని వ్యవస్థలూ ఇందుకు లోబడి పనిచేసే అనివార్య తను కల్పించే విషయంలో రాజీ పడవద్దు. అప్రమత్తంగా ఉందాం. అది మన బాధ్యత. హక్కు కూడా! అప్పుడే మనం మిథ్యాతాత్పర్యాల కేంద్రం నుంచి రాష్ట్రాలను రక్షించుకోగలం! వధ్యశిల నుంచి తప్పించు కోగలం!!
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల, తెరాస నాయకుడు
డాక్టర్ సతీష్ చంద్ర, ఎండీ, ఎఫ్‌ఆర్‌సీఎస్ (జీపీ), ఇంగ్లండ్
Comments
Please login to add a commentAdd a comment