కేంద్రీకృత విధానాలకు అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ కాగా, ఆ విధానాలను తూర్పారపడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ.. రాష్ట్రాల హక్కులను హరించడంలో తామేమీ కాంగ్రెస్ పార్టీ కంటే భిన్నం కాదని నిరూపిస్తోంది. నోట్లరద్దు, ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరణ, రాష్ట్రాల అధికారాలలో కోత వంటి అంశాల్లో కేంద్రం ఏకపక్ష ధోరణి ప్రస్ఫుటం. కాగా జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సమాఖ్య స్ఫూర్తిని నీరుగార్చేదిగా ఉంది. జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకొనే క్రమంలో రాష్ట్రాలకు ఇచ్చిన హామీ, అందుకు అనుగుణంగా చట్టంలో చేర్చిన అంశాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట. జీఎస్టీ రాబడులు తగ్గాయి కాబట్టి రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు ఎగ్గొట్టడం మన సమాఖ్య స్ఫూర్తికే భంగకరం.
మన దేశంలో ఉన్నది అర్థఫెడరల్ విధా నంతో కూడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని; కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగానూ, పరస్పరం సహకరించుకొంటూ రాజ్యాంగ లక్ష్యాలను సాధించే దిశగా సాగాలని రాజ్యాంగ నిర్మాతలు ప్రవచించినా, అది ఆచరణకు నోచలేదు. రాజ్యాంగ స్వరూపంలోనే కేంద్రానికి ఎక్కువ అధికారాలు దఖలు పడ్డాయి. కారణాలు ఏవైనా, ప్రపంచంలోని ఏ ప్రజాస్వామిక సమాఖ్య వ్యవస్థలో లేనన్ని వైరు ధ్యాలు మన వద్ద కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అందులో ప్రధానమైనవి వనరుల సమీకరణ, ప్రజా సంక్షేమ బాధ్యత. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఎప్పటికప్పుడు మెరుగుపరిచే గురుతర బాధ్యత రాష్ట్రాలపైనే ఎక్కువ. ప్రజా రక్షణ, దేశ భద్రత, సామాజిక విముక్తి, ఆర్థికాభివృద్ధి, రాజకీయ సుస్థిరత మొదలైన అంశాలలో కేంద్ర, రాష్ట్రాలది ఉమ్మడి బాధ్యత. దీని ఆధారంగానే విధులు, బాధ్యతలు, హక్కుల విషయంలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబి తాలు ఏర్పాటయ్యాయి. వైరుధ్యం ఎక్కడ ఉందంటే ఎక్కువ బాధ్య తలు కలిగిన రాష్ట్రాలకు తక్కువ అధికారాలు కల్పించబడ్డాయి. దీనిని ఆసరాగా చేసుకొని కేంద్రం తనకున్న అపరిమితమైన అధికారాలతో రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవడం ఎక్కువగా కనపడుతుంది. ఫలితంగానే, రాష్ట్రాలు ఆశిం చిన స్థాయిలో బలపడలేకపోయాయి.
పాత బాటలోనే ఎన్డీఏ
కేంద్రీకృత విధానాలకు అంకురార్పణ చేసింది కేంద్రంలో సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీయే. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రా లలో ప్రభుత్వాలను కీలుబొమ్మలుగా చేసుకొని అధికారం చలాయిం చిన చరిత్ర, తమ పార్టీ అధికారంలేని రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత సృష్టించిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. ఆ విధానాలను తూర్పార పడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రాల హక్కులను హరిం చడంలో తామేమీ కాంగ్రెస్ పార్టీ కంటే భిన్నం కాదని నిరూపిస్తోంది. గత ఎన్డీఏ–1 ఐదేళ్ల పాలనగానీ, ప్రçస్తుత ఎన్డీఏ–2 పద్నాలుగు నెలల పాలనగానీ పరిశీలించినపుడు నోట్ల రద్దు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నిరాకరణ, తదితర అంశాలలో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణి ప్రస్ఫుటం. రాష్ట్రాల పరిధిలోని అంశాలను ఉమ్మడి జాబితాకు బదిలీ చేసి, మళ్లీ వాటిల్లో కొన్నింటిని కేంద్ర జాబితాకు బదిలీ చేసు కోవడం కేంద్రానికి పరిపాటిగా మారింది.
జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకొనే క్రమంలో రాష్ట్రాలకు ఇచ్చిన హామీ, అందుకు అనుగుణంగా చట్టంలో చేర్చిన అంశాలకు పూర్తి విరు ద్ధంగా వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట. ‘కరోనా’ కారణంగా పారిశ్రామిక వ్యాపార రంగాలు కుదేలైన నేప థ్యంలో జీఎస్టీ వసూళ్లు అంచనాలు అందుకోలేకపోయాయని, మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు వసూలు కావల్సి ఉండగా కేవలం 65,000 కోట్లు మాత్రమే వచ్చాయని, కనుక రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలను చెల్లించలేమని కేంద్రం తెగేసి చెప్పడం అసాధారణం. లాభాలొస్తే మాకు, నష్టాలొస్తే మీకు అనే చందంగా వ్యవహరించడం కేంద్రానికి తగని పని. రాష్ట్రాలకు నష్టపరిహారంగా ఉపయోగించాల్సిన రూ. 47,272 కోట్ల నిధులను కేంద్రం అక్రమంగా తనవద్ద ఉంచేసుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనలర్ (కాగ్) తన నివేదికలో పేర్కొంది. కాగ్ నివేదికను పరిశీలించినట్లయితే, కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లం ఘించినట్లు స్పష్టమవుతుంది.
కరోనా కష్టకాలంలో ఉమ్మడి బాధ్యత
‘ఒకే దేశం–ఒకే పన్ను’ నినాదంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం లోని ఎన్డీఏ–1 ప్రభుత్వం 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2016 సెప్టెంబర్ 8న వస్తు, సేవల పన్నులను నిర్ణయించడానికి జీఎస్టీ కౌన్సిల్ అనే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. జీఎస్టీని సజావుగా ఆమోదింపజేసుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ఆ సందర్భంగా రాష్ట్రాలకు పలు వాగ్దానాలు చేశారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాల ఆదాయాలకు నష్టం వాటిల్లదని, ఒకవేళ లోటు ఏర్పడినట్లయితే కేంద్ర సంచితనిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రాష్ట్రాల ఆర్థికలోటును భర్తీ చేస్తామని జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలలో నాటి కేంద్ర ఆర్థికమంత్రి పదేపదే చెప్పారు. నిజానికి, జీఎస్టీ బిల్లు ముసాయిదాలోనే రాష్ట్రాల అభ్యంతరాలకు చోటు లేకుండాపోయింది. బిల్లులోని సెక్షన్ 12(9) ప్రకారం జీఎస్టీ కౌన్సిల్‌లో ఏ నిర్ణయమైనా జరగాలంటే, ఆ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేవారిలో 75% మంది ఆమోదం పొందాలి. అయితే, జీఎస్టీ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న రాష్ట్రాలకు 67% ఓట్లు మాత్రమే కల్పించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున పాల్గొనే ఇరువురు మంత్రులకు 33% ఓట్లు నిర్ధారించారు. అటువంటప్పుడు జీఎస్టీ కౌన్సిల్‌లో తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే అవకాశమే లేదు.
జీఎస్టీ వసూళ్లు మందగించడానికి కరోనా కారణం అని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన కొంతవరకు నిజమే. కానీ, కరోనా ప్రభావం ఎక్కువగా రాష్ట్రాలపై పడింది. కరోనా దెబ్బకు కేంద్రానికి లభించే ఆదాయంలో దాదాపు 40% మేర క్షీణత నమోదుకాగా, రాష్ట్రా లకు లభించే ఆదాయంలో 60% నుంచి 70% తగ్గుదల కనిపిస్తున్నది. పైగా, కరోనా కట్టడికి, బాధితుల చికిత్సకు కేంద్రం కంటే రాష్ట్రాలే అధిక మొత్తంలో నిధులు ఖర్చు పెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ గడ్డు పరిస్థితులలో రాష్ట్రాలకు బకాయిలు చెల్లించ కుండా అవసరమైన నిధుల సమీకరణకు ‘అప్పులు తెచ్చుకోండి’ అని కేంద్రం నోటి మాటగా చెప్పడమే ఆశ్చర్యం. ఒకవైపు రుణాల స్వీకరణకు రాష్ట్రాలపై ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులు మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయి. ఇంకోవైపు పరిమితులను మించి రుణాలు స్వీకరించాలంటే సంస్కర ణల అమలు పేరుతో కొన్ని రంగాలలో అదనంగా పన్నులు వేయా లన్న కేంద్రం ఆంక్షలు మరోవైపు. కోవిడ్ ఎంత కాలం ఉంటుందో, రెవెన్యూ లోటు ఎంత పెరుగుతుందో తెలియనపుడు రాష్ట్రాలు అధిక వడ్డీపై ఏవిధంగా అప్పులు తెచ్చుకోగలవు? బ్యాంకుల నిరర్థక ఆస్తులు గత యూపీఏ హయాంలో దాదాపు 4 లక్షల కోట్లు ఉండగా, గత ఆరేళ్లల్లో ఆ మొత్తం 10 లక్షల కోట్లకు చేరాయి. దీంతో బ్యాంకులే నిధుల కొరతతో సహాయానికై రిజర్వు బ్యాంకు వైపు చూస్తున్నాయి.
ఎంతకాలం ఇలా?
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉన్నదంటే జీఎస్టీ వసూళ్లలోనూ మొండిబకాయిలు కొండలా పెరుగుతున్నాయి. జీఎస్టీ రేట్లు, శ్లాబుల మార్పుపై జీఎస్టీ కౌన్సిల్ మొదట్లోనే సహేతుకమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, శ్లాబులలో మార్పులు చేసి ఉంటే పారిశ్రామిక వర్గాలకు వెసులుబాటు లభించేది. జీఎస్టీని ఎవ్వరూ ఎగ్గొట్టేవారు కాదు. కేంద్రం ఏకపక్షంగా ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా అనేక పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడి జీఎస్టీ కట్టలేక చేతులెత్తేశాయి. కేంద్రం అవలంభించిన ఇటువంటి విధానాలు రాష్ట్రాలకు శాపాలుగా మారాయి. ప్రణాళికాసంఘం రద్దు కానంత వరకు కనీసం ఆ సంస్థ రాష్ట్రాల విన్నపాలను, డిమాండ్లను పట్టిం చుకొనేది. ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి ఆ స్థానంలో ఏర్పాటు చేసిన ‘నీతి ఆయోగ్’ కేవలం కేంద్రానికి సలహాలిచ్చే వ్యవస్థ మాదిరిగా పని చేస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఎవరు ఉన్నారు? అన్నది ప్రశ్న కాదు. ఎందుకు రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నారు? సమాఖ్య స్ఫూర్తిని ఎందుకు అమలు చేయడం లేదు? అన్నదే అసలు సమస్య. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన కేంద్రం సాధ్యమని రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. కానీ, రాష్ట్రాలు బలోపేతం కాకుండా కేంద్రమే అడ్డుపడుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహపర్చడం, ఆర్థిక నిర్వహణ సరిగాలేని రాష్ట్రాలకు అధికమొత్తంలో నిధులు ఇవ్వడం, ఓట్ల రాజకీయాల మాయలోపడి కొన్ని రాష్ట్రాలకు భారీ ఆర్థిక ప్యాకే జీలు ప్రకటించడం, ఇచ్చిన వాగ్దానాలపై వెనక్కి పోవడం, పార్లమెంట్ చేసిన చట్టాలను గౌరవించకపోవడం తదితర ఏకపక్ష కేంద్రీకృత పోకడల్ని కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టాలి. కరోనా నుంచి నేర్చుకొనే పాఠాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేయాలన్నది ఒకటి. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడా నికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో కలిసి ప్రధానమంత్రి చెప్పిన విధంగా ‘ఆత్మ నిర్భర్’తో ముందుకు సాగాలి. ‘మేము ఏమీ చేయలేం. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్’ అంటూ నిస్సహాయంగా చేతులు ఎత్తేస్తే ప్రజలు క్షమించరు. కేంద్రం ఇప్పటికైనా సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలి. రాష్ట్రాలకు అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలవాలి.
సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Comments
Please login to add a commentAdd a comment