కొన్ని మాటలు చెప్పుకోవడానికి సొంపుగా ఉంటాయి. కానీ, ఆచరణలో చూసినప్పుడు ఆవేదన కలుగుతుంది. ‘సమాఖ్య స్ఫూర్తి’ అనే మాట అటువంటిదే. భారతదేశం రాష్ట్రాల కూటమిగా ఉంటుందనీ, సహకార సమాఖ్య భావస్ఫూర్తితో పని చేస్తుందనీ భారత రాజ్యాంగం చెబుతుంది. కేంద్రం, రాష్ట్రాలు వాటి పరిధిలో వేటికవి సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి ఒకదానికొకటి సహ కరించుకొంటూ జాతీయ సమైక్యతతో ముందుకు సాగుతాయి. ఇందుకు అనుగుణంగానే శాసన నిర్మాణాధికారాలు, కార్యనిర్వహణాధికారాలు, ఆర్థిక నిర్వహణాధికారాల విభ జన జరిగింది. ఆచరణలో ఇది జరుగుతున్నదా?
తాజా ఉదాహరణనే చూద్దాం. సరిహద్దు భద్రతాదళాల (బీఎస్‌ఎఫ్) చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఓ సవరణ చేసింది. దాని ప్రకారం, సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, అసోం, పశ్చిమ బెంగాల్‌లలో 15 కిలోమీటర్ల లోపలికి వచ్చి సోదాలు, జప్తులు, అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసేందుకు ఉన్న అధికారాల పరిధిని పెంచారు. తాజా సవరణతో బీఎస్‌ఎఫ్ బలగాలు 50 కిలోమీటర్ల లోపలికి వెళ్లవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అక్కర్లేదు. కేంద్రం తన వద్ద నున్న సమాచారంతో భద్రతా చర్యల దృష్ట్యా ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చునన్న ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’తో సమర్థించాలనుకొన్నా, సదరు నిర్ణయం తీసుకోవడానికి ఆయా రాష్ట్రాలతో సంప్రదించాల్సిన అవసరం లేదా? పార్ల మెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవాలి కదా?
భారతీయ జనతా పార్టీ తనను తాను ‘పార్టీ విత్ ఎ డిఫరెన్స్’ అని చెప్పుకొనేది. తాము అధికారంలోకి వస్తే అన్ని వ్యవస్థలను సమూలంగా మార్చేస్తామని చెప్పు కోవడం అందరికీ తెలుసు. గుజరాత్‌కు 13 ఏళ్లు ముఖ్య మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ... అప్పుడు కేంద్రంలో ఉన్న యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల కేంద్రీకృత విధానా లను ప్రతి సందర్భంలోనూ ఎండగట్టారు. తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో మాట్లాడే అవకాశం కలిగి నప్పుడు ఆయన ఎంచుకొన్న అంశం... ‘యూపీఏ ఎ గ్రేవ్ థ్రెట్ టు అవర్ ఫెడరలిజం’. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరించడాన్ని మోదీ తీవ్రంగా నిరసించారు. రాష్ట్రాలు తమ వార్షిక ప్రణాళికలను ఆమోదింపజేసుకోవడానికి ఢిల్లీలోని యోజన భవన్‌లో ఉన్న ప్లానింగ్ కమిషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవస్థపై గట్టిగా మాట్లాడారు. అసలు రాష్ట్రాల ప్రాధాన్యతలు కేంద్రానికి ఏం తెలుస్తాయంటూ ప్రశ్నించడమేకాక, రాష్ట్రాలను పెద్దస్థాయి మున్సిపాలిటీ లుగా మార్చేశారని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తను ఎదుర్కొంటున్న వివక్షను ఎత్తి చూపినప్పుడు ఆయనకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించింది.
2014లో నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చినప్పుడు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో కొత్త శకం ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టే, బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య స్ఫూర్తికి సంబంధించి 8 ప్రధాన హామీలు ఇచ్చింది. గవర్నర్ల నియామకంలో రాష్ట్రాలను సంప్రదించే సత్‌సంప్రదాయాన్ని పాటిస్తామనీ, రాష్ట్రాలు చట్టాలు చేసే అధికారంలో జోక్యం చేసుకోబోమనీ, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకొనే దుష్ట సంప్రదాయానికి చెల్లుచీటీ పాడుతామనీ... ఇలా నిర్ది ష్టమైన హామీలు అందులో ఉన్నాయి. ‘సమాఖ్య స్ఫూర్తి’కి ఓ నూతన నమూనా ప్రవేశపెడతామని చెప్పారు. కాంపిటీటివ్ ఫెడరలిజం అంటూ కొత్త పదాలు వాడారు. అధికారం చేపట్టిన తర్వాత ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి ఆ స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ప్రవేశ పెట్టడం మినహా ఏ నూతన ఒరవడిని సృష్టించలేదు.
అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఆర్టికల్ 356ను ఉపయోగించి బీజేపీయేతర ప్రభుత్వాలను దింపివేశారు. ‘ఒకే దేశం, ఒకే పన్ను’ నినాదంతో అమలులోకి వచ్చిన జీఎస్టీ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా సెస్సులు, సర్‌చార్జీలు వసూలు చేసుకొంటూ రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదు. రాష్ట్రాల జాబితాలోని ‘వ్యవసా యం’కు సంబంధించి ఏ చర్చా లేకుండా 3 వ్యవసాయ బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకొన్న తీరు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసింది. ఉమ్మడి జాబితాలోని విద్య, విద్యుత్‌లకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలు, అంగీకారాలు లేకుండానే నూతన విద్యా విధానం, విద్యుత్ సవరణ బిల్లులు రూపుదిద్దుకొన్నాయి.
ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్రాలలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆస్థులను ప్రైవేటుపరం చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంతో ఆయా రాష్ట్రాలలో అశాంతి రేకెత్తు తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లాభాలలో నడుస్తున్న విశాఖ ఉక్కుకు క్యాప్టివ్ మైన్స్ లేవని, నష్టాలు వస్తున్నాయని ప్రైవే టీకరణ చేయడానికి సిద్ధం కావడంతో ఆ ప్రాంత ఉద్యో గులు, ప్రజలలోనేకాక రాష్ట్రవ్యాప్తంగా అలజడి నెలకొంది. నష్టాల సాకుతో ప్రైవేటీకరణ చేస్తున్నామని చెబుతున్న కేంద్రం లాభాల్లో నడుస్తున్న ఎల్‌ఐసీని ఎందుకు ప్రైవేటీ కరణ చేయాల్సి వస్తున్నదో చెప్పడం లేదు.
‘చిన్న రాష్ట్రాలు బలమైన కేంద్రం’ ఉండాలన్నది బీజేపీ మొదట్నుంచీ నమ్మిన సిద్ధాంతం. అందుకు అను గుణంగానే ఆంధ్రప్రదేశ్ విభజనలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. అయితే, విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వాన్ని... ఆంధ్రకు ఐదేళ్లు కాదు, పదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు ఏడేళ్లుగా మౌనంగా ఉంటున్నారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన తెలుగుదేశం నిష్క్రియాపరత్వం రాష్ట్రానికి శాపమైంది. కృష్ణానదీ జలాల వాటాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను పెద్దన్నపాత్ర పోషించి పరిష్కరించవలసిన కేంద్రం కొన్ని ప్రాజెక్టులను తమ పరిధిలోకి తెచ్చుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, దేశప్రధానిగా ఏడేళ్లు పాలనా పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న నరేంద్ర మోదీ దేశ ప్రజల జీవన పరిస్థితులు మెరుగు చేశానని, అద్భుతాలు జరిగాయంటూ తనకు తానే కితాబు నిచ్చుకొన్నారు. ప్రపంచ ఆహార సూచీలో భారత్ ర్యాంకింగ్ పొరుగునున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి చిన్న దేశాలకంటే దిగజారడం ఓ అద్భుతమేమో! అభివృద్ధికి కొలమానాలు ఇంతకంటే మెరుగైనవి ఉంటే అవేమిటో బీజేపీ పాలకులు చెప్పాలి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర సంబం ధాలను ఏవిధంగా మెరుగుపరిచారో చెప్పాలి.
సి. రామచంద్రయ్య
వ్యాసకర్త శాసన మండలి సభ్యులు
ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్
Comments
Please login to add a commentAdd a comment