పెట్రో ధరలు ఎవరి నియంత్రణలో లేనట్టు పెరిగిపోవడం దేశ ప్రజల్ని అసహ నానికి గురి చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలియం ధరల పెరుగుదలను ఓ ధర్మ సంకటంగా అభివర్ణించారు. పెట్రోధరల నియం త్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వ యంతో పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? ఈలోపు పెట్రోల్, డీజిల్ ధరలు రెండూ సెంచరీ మార్కు దాటేశాయి.
ఇటీవల కోవిడ్ ఔషధాలను తక్కువ శ్లాబ్‌లోకి చేర్చడానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. పెట్రో ఉత్పత్తులపై పన్ను తగ్గింపు అంశాన్ని ఎవ్వరూ చర్చించలేదు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న ప్రస్తావన ఇరువైపుల నుండి రాలేదు. పెట్రో ధరల దూకుడుకు కళ్లెం వేయడానికి కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేనట్లు అర్థమవుతున్నది. కరోనా దెబ్బతో రాబడులు తగ్గి ఆర్థికంగా సతమతమవుతూ వైద్య ఆరోగ్యరంగంలో, సంక్షేమ రంగంలో అదనంగా నిధులు ఖర్చుపెట్టాల్సిన నేపథ్యంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై తమవంతు భారం వేశాయి. కేంద్రం ఏకపక్షంగా పెట్రో ఉత్పత్తులపై వివిధ రకాల సెస్సులు విధిస్తూ తద్వారా సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు దామాషా ప్రకారం వాటా ఇవ్వకుండా మొత్తాన్ని తమ ఖజానాలో జమ చేసుకొంటున్న నేపథ్యంలో రాష్ట్రాలకు మరో ప్రత్యామ్నాయం ఏముంది?
పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించకుండా కారణాలు ఏమి చెప్పినా అవి ప్రజలను సంతృప్తి పర్చలేవు. భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేస్తున్న కొన్ని దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించి డిమాండ్‌ను పెంచుకున్న మాట వాస్తవమే. కరోనా నేపథ్యంలో కేంద్రం ఆరోగ్యరంగంలో అధిక నిధులు ఖర్చు పెట్టాల్సిరావడం కూడా నిజమే. అందుకు పెట్రో ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు విధించి సామాన్యులను దొంగ దెబ్బ తీయడం సహేతుకం కాదు. కరోనా బెడద ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. భారత్‌తో పోల్చితే సాపేక్షంగా ఆర్థికంగా బలహీనమైన పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఒకవైపు కరోనాతో యుద్ధం చేస్తూనే తమ ప్రజలపై అదనపు భారం మోపకుండా పెట్రో ధరల్ని నియం త్రణలో ఉంచాయి. భారత్‌లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటిన దశలో నేపాల్‌లో లీటర్ రూ.51, శ్రీలంకలో రూ.55 మాత్రమే. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘కేర్’ నివేదిక ప్రకారం వివిధ దేశాలలో పెట్రోల్ స్థూల ధరపై జర్మనీలో 65%, ఇటలీలో 62%, జపా¯Œ లో 45%, అమెరికాలో 20% పన్నులు ఉండగా భారత్‌లో 260% మేర ఉన్నాయి. దీనిని ఎవరు సమర్థించగలరు? స్థూలంగా చూస్తే లీటర్ పెట్రోల్ రూ.100 ఉంటే అందులో రూ.59 పన్నుల రూపంలో పోతోంది.
ప్రతియేటా దేశంలో అవసరమయ్యే పెట్రో ఉత్పత్తులు సగటున 211.6 మిలియన్ల టన్నులు కాగా, ఏటా 3.9% మేర ముడిచమురు వాడకం పెరుగుతోంది. దేశ అవసరాలలో 83% ముడిచమురును దిగుమతి చేసుకొంటున్న భారత్ అందుకు తన జీడీపీలో 4% నిధుల్ని ఖర్చు చేస్తోంది. ముడిచమురుకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిం చాలన్న లక్ష్యాలు నెరవేరకపోవడం వల్లనే ముడిచమురు అవసరాలు పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్‌జీ, హైడ్రోజన్ ఫ్యూయల్, ఇథనాల్, మిథనాల్, విద్యుత్, సౌర విద్యుత్, బయోడీజిల్ మొదలైన వాటిని ఉపయోగించు కోలేకపోతున్నాం. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వ వైఖరే.
ఉదాహరణకు ఇథనాల్, మిథనాల్‌లను పెట్రోల్‌లో 10% మేర కలిపి వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడమేకాక, దిగుమతుల బిల్లులో దాదాపు రూ. 50,000 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. కానీ, దశాబ్దకాలంలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 8% మించలేదు. తాజాగా 2025 నాటికి ఇథనాల్ మిశ్రమం 20%కు పెంచాలని, తద్వారా ముడిచమురు దిగుమతులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. చెరకు, మొక్కజొన్న, ఇతర రకాల వ్యవసాయ వ్యర్థాల నుండి ఇథనాల్, మిథనాల్‌లను తయారు చేస్తారు. కనుక చెరకు, మొక్కజొన్న పండించే రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని, వీటి ఉత్పత్తుల కోసం అదనపు భూమిని సాగులోకి తేవాలన్న సూచనలు గతంలోనే అందాయి. సాగునీటి సదుపాయాలను పెంచడం కోసం దేశంలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, అందుకు అవసరమయ్యే నిధులను పబ్లిక్, ప్రైవేటు సంయుక్త రంగం నుండి సేకరించాలని నిపుణులు సూచించారు. దీనిపై పార్లమెంట్‌లో కూడా అనేక సందర్భాలలో చర్చలు జరిగాయి. కానీ, ఆ దిశగా తగిన చొరవ కనపడలేదు.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టస్థాయికి పడిపోయినప్పుడు కూడా ఆ అనువైన పరిస్థితుల్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. కారణం దేశంలో ముడిచ మురును నిల్వ చేసుకొనే మౌలిక సదుపాయాలు అరకొరగా ఉండటమే. దేశంలో ప్రస్తుతం 23 ముడిచమురు శుద్ధి ప్లాంట్లు, ముడిచమురును దిగుమతి చేసుకోవడానికి 12 పోర్టులు, ముడి చమురు తెచ్చుకోవడానికి 10,406 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే దేశ అవసరాలకు 14 రోజులపాటు సరిపోయే ముడిచమురును మాత్రమే నిల్వ చేసుకోవడం సాధ్యపడుతుంది. ముడిచమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు విఫలం చెందాయి. ఇంధన విధానంపై అనుసరించాల్సిన మార్గసూచీని 2020లో నీతి ఆయోగ్ అందిం చింది. నీతి ఆయోగ్ సూచనలను కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదు.
ముడిచమురు చౌకగా దిగుమతి చేసుకోవడానికి కొత్త మార్కెట్లను అన్వేషించాలి. భారత్‌కు ముడిచమురు ఎగుమతి చేస్తున్న దేశాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి కృత్రిమ డిమాండ్‌ను సృష్టించడం ద్వారా అనుచిత లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ హయాంలో విధించిన ఆంక్షల కారణంగా చౌకగా ముడిచమురు సరఫరా చేసే ఇరాన్, వెనిజులా దేశాల్ని భారత్ దూరం చేసుకొంది. ఇపుడు, అమెరికాలో అధికారం ట్రంప్ నుండి జో బైడెన్‌కు దక్కిన నేపథ్యంలో తిరిగి ఇరాన్, వెనిజులాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించు కోవచ్చు. ఆ దిశగా కేంద్రం చొరవ చూపాలి. దేశంలో ‘ఆయిల్ సప్లయ్ ఎమర్జెన్సీ’ విధానం లేకపోవడాన్ని ఇంధన రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. పెట్రో ఉత్పత్తులపై విధించే సర్‌చార్జీ నిధులను కేంద్రం ఆ రంగంపైనే ఖర్చు చేయాల్సి ఉండగా వాటిని దారి మళ్లిస్తున్నారు. ఫలితంగా, ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో ఉత్పత్తులపై సెస్సులు విధించడం ఎన్డీఏ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
దేశవ్యాప్తంగా కరోనా రెండోవేవ్ తగ్గుముఖం పడుతూ, ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంధన ధరల్ని నియంత్రించగలిగితేనే ఆర్థికరంగం గాడిన పడుతుంది. ముఖ్యంగా ఒకవైపు ఉపాధి, ఆదాయాలు కోల్పోయి ఇంకోవైపు వైద్య ఖర్చులు పెరిగిన ఈ కీలక దశలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కోలుకోవాలంటే పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాలి. ఆ ధరలు తగ్గితేనే ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర కార్యాచరణ ప్రకటించాలి. దేశ ప్రజలపై పెట్రో భారాన్ని వదిలించాలి.
సి. రామచంద్రయ్య
– వ్యాసకర్త శాసన మండలి సభ్యులు – ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్
Comments
Please login to add a commentAdd a comment