petrole price
-
పెట్రో రేట్లు పెంచి 4 లక్షల కోట్లు లాగేశారు
బహరాంపూర్: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా పెట్రోల్, డీజిల్ ధరలను 69 సార్లు పెంచిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శనివారం చెప్పారు. ఈ పెంపుతో ప్రభుత్వం ఏకంగా రూ.4.91 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించిందని అన్నారు. పెట్రోల్ ధర రూ.100 దాటిందని, డీజిల్ సైతం సెంచరీకి చేరువలో ఉందని, ఇక గ్యాస్ సిలిండర్ ధర రూ.850కి ఎగబాకిందని ఆక్షేపించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో రూ.25 లక్షల కోట్లు రాబట్టుకుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సామాన్యుల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను రద్దు చేసిందని, తద్వారా ధర లీటర్‌కు రూ.12 చొప్పున తగ్గిపోయిందని గుర్తుచేశారు. మిగతా అన్ని రాష్ట్రాలూ ఇదే తరహాలో ప్రజలకు ఉపశమనం కల్పించాలని అధిర్ రంజన్ చౌదరి కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే వ్యాట్ ఎత్తివేయాలని విన్నవించారు. -
‘మన్‌కీ బాత్’ బదులు ‘పెట్రోల్‌కీ బాత్’
కోల్‌కతా: ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం నాశనం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ‘ఇంధన ధరలు రోజు రోజుకీ పైకెగబాకుతున్నా కేంద్రం ప్రభుత్వం లో చలనం లేదు. మన ప్రధానమంత్రి మాత్రం ‘మన్‌కీ బాత్’తో బిజీ అయిపోయారు. అందుకు బదులుగా ఆయన ‘పెట్రోల్, వ్యాక్సిన్‌కీ బాత్’నిర్వహిస్తే బాగుంటుంది’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ జాన్ బార్లాను కేబినెట్లోకి తీసుకో వచ్చన్న వార్తలపై ఆమె స్పందిస్తూ..ఉత్తర బెంగాల్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలంటూ బార్లా డిమాండ్ చేసిన కొన్ని రోజులకే మంత్రి పదవి లభించింది. దీనిని బట్టి కాషాయపార్టీ విభజన రాజకీయాలు అవగతమవు తున్నాయి’ అని ఆరోపించారు. -
పెట్రోలు ధరలు తగ్గాలంటే...
పెట్రో ధరలు ఎవరి నియంత్రణలో లేనట్టు పెరిగిపోవడం దేశ ప్రజల్ని అసహ నానికి గురి చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలియం ధరల పెరుగుదలను ఓ ధర్మ సంకటంగా అభివర్ణించారు. పెట్రోధరల నియం త్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వ యంతో పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? ఈలోపు పెట్రోల్, డీజిల్ ధరలు రెండూ సెంచరీ మార్కు దాటేశాయి. ఇటీవల కోవిడ్ ఔషధాలను తక్కువ శ్లాబ్‌లోకి చేర్చడానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. పెట్రో ఉత్పత్తులపై పన్ను తగ్గింపు అంశాన్ని ఎవ్వరూ చర్చించలేదు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న ప్రస్తావన ఇరువైపుల నుండి రాలేదు. పెట్రో ధరల దూకుడుకు కళ్లెం వేయడానికి కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేనట్లు అర్థమవుతున్నది. కరోనా దెబ్బతో రాబడులు తగ్గి ఆర్థికంగా సతమతమవుతూ వైద్య ఆరోగ్యరంగంలో, సంక్షేమ రంగంలో అదనంగా నిధులు ఖర్చుపెట్టాల్సిన నేపథ్యంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై తమవంతు భారం వేశాయి. కేంద్రం ఏకపక్షంగా పెట్రో ఉత్పత్తులపై వివిధ రకాల సెస్సులు విధిస్తూ తద్వారా సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు దామాషా ప్రకారం వాటా ఇవ్వకుండా మొత్తాన్ని తమ ఖజానాలో జమ చేసుకొంటున్న నేపథ్యంలో రాష్ట్రాలకు మరో ప్రత్యామ్నాయం ఏముంది? పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించకుండా కారణాలు ఏమి చెప్పినా అవి ప్రజలను సంతృప్తి పర్చలేవు. భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేస్తున్న కొన్ని దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించి డిమాండ్‌ను పెంచుకున్న మాట వాస్తవమే. కరోనా నేపథ్యంలో కేంద్రం ఆరోగ్యరంగంలో అధిక నిధులు ఖర్చు పెట్టాల్సిరావడం కూడా నిజమే. అందుకు పెట్రో ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు విధించి సామాన్యులను దొంగ దెబ్బ తీయడం సహేతుకం కాదు. కరోనా బెడద ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. భారత్‌తో పోల్చితే సాపేక్షంగా ఆర్థికంగా బలహీనమైన పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఒకవైపు కరోనాతో యుద్ధం చేస్తూనే తమ ప్రజలపై అదనపు భారం మోపకుండా పెట్రో ధరల్ని నియం త్రణలో ఉంచాయి. భారత్‌లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటిన దశలో నేపాల్‌లో లీటర్ రూ.51, శ్రీలంకలో రూ.55 మాత్రమే. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘కేర్’ నివేదిక ప్రకారం వివిధ దేశాలలో పెట్రోల్ స్థూల ధరపై జర్మనీలో 65%, ఇటలీలో 62%, జపా¯Œ లో 45%, అమెరికాలో 20% పన్నులు ఉండగా భారత్‌లో 260% మేర ఉన్నాయి. దీనిని ఎవరు సమర్థించగలరు? స్థూలంగా చూస్తే లీటర్ పెట్రోల్ రూ.100 ఉంటే అందులో రూ.59 పన్నుల రూపంలో పోతోంది. ప్రతియేటా దేశంలో అవసరమయ్యే పెట్రో ఉత్పత్తులు సగటున 211.6 మిలియన్ల టన్నులు కాగా, ఏటా 3.9% మేర ముడిచమురు వాడకం పెరుగుతోంది. దేశ అవసరాలలో 83% ముడిచమురును దిగుమతి చేసుకొంటున్న భారత్ అందుకు తన జీడీపీలో 4% నిధుల్ని ఖర్చు చేస్తోంది. ముడిచమురుకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిం చాలన్న లక్ష్యాలు నెరవేరకపోవడం వల్లనే ముడిచమురు అవసరాలు పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్, ఇథనాల్, మిథనాల్, విద్యుత్, సౌర విద్యుత్, బయోడీజిల్ మొదలైన వాటిని ఉపయోగించు కోలేకపోతున్నాం. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వ వైఖరే. ఉదాహరణకు ఇథనాల్, మిథనాల్‌లను పెట్రోల్‌లో 10% మేర కలిపి వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడమేకాక, దిగుమతుల బిల్లులో దాదాపు రూ. 50,000 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. కానీ, దశాబ్దకాలంలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 8% మించలేదు. తాజాగా 2025 నాటికి ఇథనాల్ మిశ్రమం 20%కు పెంచాలని, తద్వారా ముడిచమురు దిగుమతులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. చెరకు, మొక్కజొన్న, ఇతర రకాల వ్యవసాయ వ్యర్థాల నుండి ఇథనాల్, మిథనాల్‌లను తయారు చేస్తారు. కనుక చెరకు, మొక్కజొన్న పండించే రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని, వీటి ఉత్పత్తుల కోసం అదనపు భూమిని సాగులోకి తేవాలన్న సూచనలు గతంలోనే అందాయి. సాగునీటి సదుపాయాలను పెంచడం కోసం దేశంలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, అందుకు అవసరమయ్యే నిధులను పబ్లిక్, ప్రైవేటు సంయుక్త రంగం నుండి సేకరించాలని నిపుణులు సూచించారు. దీనిపై పార్లమెంట్లో కూడా అనేక సందర్భాలలో చర్చలు జరిగాయి. కానీ, ఆ దిశగా తగిన చొరవ కనపడలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టస్థాయికి పడిపోయినప్పుడు కూడా ఆ అనువైన పరిస్థితుల్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. కారణం దేశంలో ముడిచ మురును నిల్వ చేసుకొనే మౌలిక సదుపాయాలు అరకొరగా ఉండటమే. దేశంలో ప్రస్తుతం 23 ముడిచమురు శుద్ధి ప్లాంట్లు, ముడిచమురును దిగుమతి చేసుకోవడానికి 12 పోర్టులు, ముడి చమురు తెచ్చుకోవడానికి 10,406 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే దేశ అవసరాలకు 14 రోజులపాటు సరిపోయే ముడిచమురును మాత్రమే నిల్వ చేసుకోవడం సాధ్యపడుతుంది. ముడిచమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు విఫలం చెందాయి. ఇంధన విధానంపై అనుసరించాల్సిన మార్గసూచీని 2020లో నీతి ఆయోగ్ అందిం చింది. నీతి ఆయోగ్ సూచనలను కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదు. ముడిచమురు చౌకగా దిగుమతి చేసుకోవడానికి కొత్త మార్కెట్లను అన్వేషించాలి. భారత్‌కు ముడిచమురు ఎగుమతి చేస్తున్న దేశాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి కృత్రిమ డిమాండ్‌ను సృష్టించడం ద్వారా అనుచిత లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ హయాంలో విధించిన ఆంక్షల కారణంగా చౌకగా ముడిచమురు సరఫరా చేసే ఇరాన్, వెనిజులా దేశాల్ని భారత్ దూరం చేసుకొంది. ఇపుడు, అమెరికాలో అధికారం ట్రంప్ నుండి జో బైడెన్‌కు దక్కిన నేపథ్యంలో తిరిగి ఇరాన్, వెనిజులాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించు కోవచ్చు. ఆ దిశగా కేంద్రం చొరవ చూపాలి. దేశంలో ‘ఆయిల్ సప్లయ్ ఎమర్జెన్సీ’ విధానం లేకపోవడాన్ని ఇంధన రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. పెట్రో ఉత్పత్తులపై విధించే సర్‌చార్జీ నిధులను కేంద్రం ఆ రంగంపైనే ఖర్చు చేయాల్సి ఉండగా వాటిని దారి మళ్లిస్తున్నారు. ఫలితంగా, ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో ఉత్పత్తులపై సెస్సులు విధించడం ఎన్డీఏ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. దేశవ్యాప్తంగా కరోనా రెండోవేవ్ తగ్గుముఖం పడుతూ, ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంధన ధరల్ని నియంత్రించగలిగితేనే ఆర్థికరంగం గాడిన పడుతుంది. ముఖ్యంగా ఒకవైపు ఉపాధి, ఆదాయాలు కోల్పోయి ఇంకోవైపు వైద్య ఖర్చులు పెరిగిన ఈ కీలక దశలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కోలుకోవాలంటే పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాలి. ఆ ధరలు తగ్గితేనే ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర కార్యాచరణ ప్రకటించాలి. దేశ ప్రజలపై పెట్రో భారాన్ని వదిలించాలి. సి. రామచంద్రయ్య – వ్యాసకర్త శాసన మండలి సభ్యులు – ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
జనాన్ని విసిగించిన నారా లోకేష్
సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తానని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం వరదయ్యపాళెంలో నిర్వహించిన రోడ్‌షోలో లోకేష్ ప్రజలకు ఈ మాయమాటలు చెప్పారు. మాజీ సీఎం తనయుడి సభకు వెయ్యి మంది కూడా జనం హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఉపఎన్నికల ప్రచారంలో లోకేష్.. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి పదేపదే విమర్శించడంపై జనం విసిగిపోయారు. పనబాక లక్ష్మి గెలుపునకు పెట్రోల్, గ్యాస్ ధరల తగ్గింపుకు సంబంధమేముందని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టడం విచిత్రంగా ఉందని జనం గుసగుసలాడారు. మోదీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకనే రాష్ట్ర ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలతో తన ప్రసంగాన్ని ముగించారు లోకేష్. -
ఎక్కడ తక్కువ ధరో అక్కడే కొంటాం!
న్యూఢిల్లీ: క్రూడ్ ఆయిల్‌ను ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్ కొనుగోలు చేస్తుందని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం స్పష్టం చేశారు. ఉత్పత్తి, సరఫరాల విషయంలో నియంత్రణలు లేకుండా చూస్తూ, తక్కువ ధరకు చమురు సరఫరా చేయాలన్న భారత్ విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా సమాధానం ‘దౌత్యధోరణి’ కాని రీతిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనమిక్ సమావేశంలో ఆయన ప్రసంగం, ఈ అంశానికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే... ►డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు భావిస్తున్న నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 14 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. ►ఈ నేపథ్యంలో చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఇందుకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాలపై నియంత్రణలను సడలించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ►ఈ విజ్ఞప్తిని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఈ నెల మొదట్లో ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. పైగా ఒపెక్ సమావేశం అనంతరం మార్చి 4వ తేదీన సౌదీ అరేబియా భారత్‌కు ఒక ఉచిత సలహా ఇస్తూ, కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సూచించింది. 2020 ఏప్రిల్–మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాటక)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. ►ఒపెక్ చేసిన ప్రకటనపై శుక్రవారం టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనమిక్ సమావేశంలో చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది కరోనా వైరస్‌పరమైన కారణాలతో డిమాండ్ పడిపోయి, ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్ కూటమి నిర్ణయించుకున్నప్పుడు తాము కూడా మద్దతునిచ్చామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని .. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థితికి రావడం లేదని ప్రధాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగిపోతే రేట్లు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ►ప్రపంచంలో చమురు దిగుమతులకు సంబంధించి మూడవ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో రిఫైనర్స్ ఇప్పటికే తమ చమురు అవసరాలకు పశ్చిమ ఆసియావైపుకాకుండా తక్కువ ధరకు లభించే ఇతర దేశాల వైపూ దృష్టి పెడుతున్నాయి. నిజానికి సౌదీ అరేబియా భారత్‌కు రెండవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. ఫిబ్రవరిలో ఈ స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. చమురు దిగుమతుల విషయంలో తన ప్రయోజనాలకు భారత్ ప్రాధాన్యత ఇస్తుందని శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దేశం ఏదైనా తక్కువ ధరకు లభ్యమైనచోటి నుంచే చమురును కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. భారత్ చమురు వినియోగంపై సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్లాజిజ్ బిన్ సల్మాన్ చేసిన ప్రకటనను ‘‘సన్నిహితమైన స్నేహితుని’’ నుంచి ‘‘దౌత్యరీతిలేని సమాధానం’’ అని ప్రధాన్ అభివర్ణించారు. ఇలాంటి వైఖరిని భారత్ అసలు అంగీకరించబోదని అన్నారు. భారత్ వ్యూహాత్మక చమురు నిల్వలను ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలన్నది భారత్ నిర్ణయమని పేర్కొన్నారు. ►సౌదీ అరేబియాకన్నా, అమెరికాకే భారత్ ప్రాధాన్యత ఇస్తుంది అన్న విషయాన్ని ఫిబ్రవరి చమురు దిగుమతి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్న అంశం ఇక్కడ ప్రధానం కాదు. భారత్ ప్రయోజనాల పరిరక్షణ ఎలా అన్నదే ఇక్కడ ముఖ్యం. మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతిచేసుకునే అవకాశం మా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రైవేటు రంగం చమురు ద్గిగజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది ప్రధానం కాదు.’’ అని అన్నారు. ప్రస్తుత ధరలు ఇలా... ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ ధర బ్యారల్‌కు 61.16 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ క్రూడ్ ధర 64.64 వద్ద ట్రేడవుతోంది. ఒపెక్, అనుబంధ దేశాలు సరఫరాపై నియంత్రణలు కొనసాగించనున్న నేప థ్యంలో విశ్లేషకులు... ముడిచమురు ధరల అంచనాలను కూడా సవరించడం ప్రారంభించారు. 2020 రెండో త్రైమాసికంలో బ్రెంట్ క్రూడ్ రేటు మరో 5 డాలర్లు పెరిగి 75 డాలర్లకు (బ్యారల్‌కు) చేరవచ్చని, మూడో త్రైమాసికానికి 80 డాలర్లకు చేరొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రెంట్ రేటు 75 డాలర్లకు (బ్యారల్‌కు), నైమెక్స్ క్రూడ్ 72 డాలర్లకు (బ్యారల్‌కు) చేరొచ్చని యూబీఎస్ అంచనాలను సవరించింది. దేశంలో పెట్రో ధరల మంట... గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు రేటు బ్యారల్‌కు 50 డాలర్ల కన్నా తక్కువే ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం దఫదఫాలుగా పెంచుకుం టూ వస్తుండటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం ఢిల్లీలోని రేట్ల ప్రకారం పెట్రోల్ ధరలో మూడో వంతు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుండగా, డీజిల్ ధరలో 40 శాతం దాకా ఉంటోంది. దీనికి రాష్ట్రాలు విధించే పన్నులు కూడా తోడవడం రేట్లకు మరింతగా ఆజ్యం పోస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటిపోయింది. తాజాగా అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు ఇంకా పెరిగిన పక్షంలో దేశీయంగా ఇంధనాల రిటైల్ రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. పెట్రోల్, డిజిల్ ధరలను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తెస్తే, ధర కొంత తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నప్పటికీ అలాంటిది ఇప్పట్లో సాధ్యంకాదని కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ రికార్డు
పెట్రోల్, డీజిల్ ధరలు భగభగలాడుతున్నాయి. అంతకంతకూ పైపైకి ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆదివారం పెట్రో ఉత్పత్తుల ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. రోజువారీ సైలెంట్ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్‌లో అత్యధికం కాగా, పెట్రోల్ ధరలో ముంబై తర్వాత స్థానానికి చేరింది. రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్, డీజిల్ ధర ఆల్‌టైమ్ రికార్డును సైతం అధిగమించింది. సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. రోజువారీ సైలెంట్ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్‌లో అత్యధికం కాగా, పెట్రోల్ ధరలో ముంబై తర్వాత స్థానానికి చేరింది. రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్, డీజిల్ ధర ఆల్‌టైమ్ రికార్డును సైతం అధిగమించింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.15, డీజిల్ రూ.82.80కు చేరింది. విదేశీ మారక ద్రవ్యం రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నెలలో రోజువారీ ధరల సవరణలో భాగంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 2.10, డీజిల్‌పై 2.20 బాదేశాయి. పెట్రో ఉత్పత్తుల ధరల రోజువారీ సవరణ ప్రక్రియ అనంతరం తొలిసారిగా రికార్డు స్థాయిలో ధరలు ఎగబాకుతున్నాయి. రికార్డు స్థాయిలో .. చమురు ధరలు ఆల్‌టైమ్ గరిష్ట రికార్డును అధిగమించాయి. రెండేళ్ల క్రితం 2018, అక్టోబర్ 4న లీటర్ పెట్రోల్ ధర రూ.89.11తో ఇప్పటివరకు ఆల్‌టైమ్ రికార్డుగా నమోదైంది. దానికంటే ఐదేళ్ల క్రితం 2013, సెప్టెంబర్ నెలలో పెట్రోల్ లీటర్ ధర రూ. 83.07తో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ఇక డీజిల్ 2018, అక్టోబర్ 18న లీటర్ ధర రూ.82.38తో ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసుకోగా ప్రస్తుతం గరిష్టానికి చేరిన ధరతో పాత రికార్డును అధిగమించినట్లయింది. పన్నులు అధికమే.. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల వడ్డింపు ఉంది. మొత్తం ధరల్లో పెట్రోల్‌పై 57 శాతం, డీజీల్‌పై 44 శాతం పన్నులు ఉంటాయి. వాస్తవంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను మోత మోగుతోంది. -
స్వల్పంగా తగ్గిన పెట్రోలు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా పెట్రోలు ధరలు దిగి వచ్చాయి. ఆయిల్ కంపెనీలు ధరలు తగ్గించడంతో వివిధ మెట్రో నగరాల్లో శనివారం పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. తాజా తగ్గింపుతో వివిధ నగరాల్లో లీటరు ఇంధన ధరలు హైదరాబాద్ : పెట్రోలు 75.33 డీజిల్ ధర 71.74 విజయవాడ : పెట్రోలు రూ. 74.75, డీజిల్ ధర రూ. 70.79 ఢిల్లీ : పెట్రోలు రూ. 71. డీజిల్ రూ. 65.96 చెన్నై: పెట్రోలు రూ. 73.72 డీజిల్ రూ.69.72 కోలకతా : పెట్రోలు రూ. 73.71 , డీజిల్ రూ. 67.71 ముంబై: పెట్రోలు రూ. 76.64 డీజిల్ రూ. 69.11 -
ఇంధనం మంటలు...!
మరోమారు ఇం‘ధనం’ ధరల మంటలు చెలరేగాయి. గత నవంబర్‌లో లీటర్ పెట్రోల్ రూ 74, డీజిల్ రూ 65.01 ఉండేది. ఇప్పుడు పెట్రోల్ రూ 84.52, డీజిల్ రూ 77.59 ఉంది. రుపాయి పతనం కారణంగా ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పుడంటే రూపాయి దిగజారి పోయిందే అనుకుందాం. ఇన్నాళ్లుగా రూపాయి బిళ్ల ఏమైనా ఎగిరి గంతులు వేసిందా.. అని సామాన్యులు మండిపడుతున్నారు. ఏది పెరిగినా..తరిగినా తిప్పలు మాకే కదా...! అని వాపోతున్నారు. కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్. ఎస్సార్ ఆధ్వర్యంలో 300 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రోజుకు పెట్రోల్ దాదాపు 5 లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల డీజిల్ వినియాగం అవుతోంది. లీటర్ పెట్రోల్‌పై రూ 9.84, డీజిల్‌పై రూ 11.97 పెరుగుదల.. పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నిర్ణయించే చమురు ధరల పెరుగుదల పరంపర తీవ్రతరమైంది. కేంద్ర ప్రభుత్వం చాప కింద నీరులా ప్రతి రోజు పైసలు..రూపాయి చొప్పున పెంచుకుంటూపోతోంది. ఈ ధరలను ఒకసారి పరిశీలిస్తే గుండె జారిపోతుంది. గడిచిన జనవరి 2వ తేదీన (కడపలో) ఒక లీటర్ పెట్రోల్ రూ 75,32 డీజిల్ రూ 66.38 ఉండేది. ఇప్పుడు (ఆదివారం) లీటర్ పెట్రోల్ రూ. 84,52, డీజిల్ రూ. 77.59 ఉంది. స్పీడ్ పెట్రోల్ అయితే అదనంగా రూ 4 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతి నెలా 2వ తేదీ నాటికి పెరిగిన ధరలను గమనిస్తే గడిచిన 8 నెలల కాలంలో లీటర్ పెట్రోల్‌పై రూ 9.84, డీజిల్‌పై 11.97 పెరిగింది. కర్ణాటకలో ఎన్నికలకు ముందు లీటర్ పెట్రోల్ రూ 78.05 డీజిల్ రూ 68.02 ఉండేది. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం రోజుకు దాదాపుగా ఒక రూపాయి చొప్పున ధరను పెంచుకుంటూ పోయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ వ్యాట్ వాత.. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వ్యాట్‌ను విధించింది. దీంతో లీటర్‌పై (పెరిగిన ధరలోనే) రూ 4.50 అదనపు భారం పడుతోంది. ఇది డీలర్లతో పాటు వినియోగదారులకు అదనపు భారంగా మారింది. ఫలితంగా వాహదారులు డీజిల్‌ను ఇతర రాష్ట్రాల్లో పట్టించుకుంటున్నారు. దీంతో బంకులు నడుస్తున్నాయని, వాటిని మూత వేసే పరిస్ధితి ఏర్పడిందని డీలర్లు అంటున్నారు. మరోవైపు ప్రతి రోజూ పెరుగుతున్న ధరలను చూసి ప్రజలు విస్తుపోతున్నారు. -
రోజూ పెట్రో వాతలే!
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయనే నెపంతో కేంద్రం ఇంధన ధరలను రోజు రోజుకు పెంచుతోంది. క్రూడాయిల్ ధరలకు తోడు రూపాయి మారక విలువ పడిపోతుండటం కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారుతోంది. పెట్రో ధరల పెరుగుదల అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): యూపీఏ ప్రభుత్వ హయాంలో పక్షానికోసారి పెట్రో ధరలను సమీక్షించేవారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రోజు వారి సమీక్షకు తెరతీసింది. కొన్ని సందర్భాల్లో మినహా ధరలు తగ్గిన సందర్భం లేదు. ప్రస్తుతం పెట్రోలు రూ.85లకు చేరుకుంది. ఇలాగే పెరుగుతూ పోతే మరో మూడు నెలల్లో రూ.వంద చేరకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతర్జాతీయంగా ముడిఇంధన ధరలు పెరుగుతున్నాయని, రూపాయి మారక విలువ పడిపోతుండటంతో ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయని ఇంధన కంపెనీలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు కారణభూతమవుతోంది. తామెలా బతకాలని చిరుద్యోగులు, ఆటో వాలాలు, వాహనాల యజమానులు వాపోతున్నారు. పన్నుల మోత...: కొత్త విధానంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ బంకుల మధ్య ధరల్లో వ్యత్యాసాలు ఉంటున్నారు. మన రాష్ట్రంలో కంటే పొరుగు రాష్ట్రాల్లోనే పెట్రో ధరలు తక్కువగా ఉంటున్నారు. లీటరు పెట్రోలుపై కర్ణాటకలో రూ.6.50 , తమిళనాడులో రూ.3, తెలంగాణలో రూ.2 తక్కువగా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వ్యాట్ రూపంలో 28శాతం పన్ను వసూలు చేస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పెట్రో ధరలు ఇక్కడ మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపం లో దాదాపు రూ.28 వరకు చెల్లించాల్సి వస్తోంది. అందులో ఏపీ వ్యాట్ రూ.6 నుంచి 8వరకు ఉంటోంది. ఎక్సైజ్ సుంకం తగ్గినా..: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర 74 డాలర్లుగా ఉంది. చమురు సంస్థలు రోజూ 20 పైసల వరకు మార్పులు, చేర్పు లు చేస్తూ వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. అయితే గతేడాది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌లో పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని లీటరకు రూ.2 తగ్గించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ రేటు తగ్గించాలని సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినా రాష్ట్రంలో మాత్రం తగ్గించలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లీటరుకు అదనంగా రూ.4 వ్యాట్ వసూలు చేస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ధరలు భరించలేం తమిళనాడు, కర్ణాటకతో పోలి స్తే రాష్ట్రంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. ఇంధన ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతూ పోతే భరించడం కష్టం. – కృష్ణమోహన్, ప్రభుత్వ ఉద్యోగి ధరలను నియంత్రించాలి పెట్రోల్ ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. రోజువారి ధరల మార్పుతో సామాన్య ప్రజలపై భారం పడుతోంది. పదిహేను రోజులకోసారి ధర నిర్ణయించాలి. – రమణ, ఉపాధ్యాయుడు, కర్నూలు -
లీటరు పెట్రోల్‌పై కేంద్రానికి రూ.25 బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: మండుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మరోసారి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న పెట్రో ధరలపై ఆయన ట్విటర్లో స్పందించారు. లీటరుకు ఒకటి లేదా రెండు రూపాయల చొప్పున ఇంధన ధరలను తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు. తమ ఖజానా నింపుకునేందుకు సాధారణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వమే ఆ భారాన్ని వేస్తోందని విమర్శించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి లీటరుపై రూ. 25 బొనాంజా అంటూ బుధవారం ఆయన వరుస ట్వీట్లలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూనుకుంటే లీటరుకు 25 రూపాయల దాకా తగ్గించే అవకాశం ఉందని ట్విట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.77 ఉంది. అయితే ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.25 లాభం పొందుతోందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినప్పుడు ప్రతి లీటరు పెట్రోల్‌పై సుమారు రూ.15 కేంద్ర ప్రభుత్వం ఆదా చేస్తుందని, ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.10 అదనపు ట్యాక్స్‌ను విధిస్తుందని చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. తద్వారా ప్రతి లీటరుపై రూ.25 కేంద్రానికి ఆదా అవుతుందని ఆయన తెలిపారు. ఆదా అయిన డబ్బు అంతా సగటు వినియోగదారుడికే చెందాలని ఆయన వ్యాఖ్యానించారు. కావాలంటే ప్రభుత్వం ప్రతి లీటరుపై సుమారు రూ.25 తగ్గించవచ్చు అని, కానీ ప్రభుత్వం అలా చేయదు, కేవలం ఒకటి లేదా రెండు రూపాయలు తగ్గిస్తూ ప్రజలను మోసం చేస్తుందని చిదంబరం విమర్శించారు. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018 Bonanza to central government is Rs 25 on every litre of petrol. This money rightfully belongs to the average consumer. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018 -
పెట్రో ధరలతో ఆటలా!
చమురు ధరల విషయంలో మన ప్రభుత్వాలు చేసిన తప్పే చేస్తున్నాయి. తమ విధానాల్లోని లోపాలను సవరించుకోవడానికి బదులు, తమ తప్పులను సరిదిద్దు కోవడానికి బదులు సామాన్యులపై భారాన్ని నెట్టేసి చేతులు దులుపుకుంటు న్నాయి. తాజాగా మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. పెట్రోలుపై లీటరుకు రూ. 3.13, డీజిల్‌పై లీటరుకు రూ. 2.71 చొప్పున పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 75కు, డీజిల్ ధర రూ. 60కి చేరుకున్నాయి. పక్షం రోజుల వ్యవధి లో ఇలా ధర పెరగడం ఇది రెండోసారి. ఈ నెల 1న పెట్రోలుపై లీటరుకు రూ. 4, డీజిల్‌పై లీటరుకు రూ. 2.37 చొప్పున పెరిగాయి. చమురు ధరలు పెరగడంవల్ల పర్యవసానాలెలా ఉంటాయో తెలియనిది కాదు. వీటి ధరలు పెరిగినప్పుడల్లా సరుకు రవాణాతోసహా అన్ని రకాల చార్జీలూ తడిసిమోపెడై నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుల జీవితాలు అస్తవ్యస్థమవుతాయి. అయినా సరే ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. ధరల పెంపే పరిష్కారంగా మాట్లాడుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఏడెనిమిది నెలలుగా చమురు ధర క్రమేపీ తగ్గడం మొదలెట్టింది. నిరుడు మే 26న నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే సమయానికి ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌కు 115 డాలర్లుంటే నవంబర్ నాటికి అది 80 డాలర్లకు దిగివచ్చింది. ఈ జనవరినాటికి అది మరింత తగ్గి 43.36 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు ఇలా తగ్గుముఖం పట్టడం మోదీ ప్రభుత్వానికి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే మన చమురు అవసరాలు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. కనుక చమురు ధరలు పడిపోవడమంటే మన కరెంట్ అకౌంట్ లోటు గణనీయంగా తగ్గిపోవడం...మన విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం. డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ పెరగటం. అది బలపడటం. మొత్తంగా మన ద్రవ్య లోటు తగ్గడం. తగ్గిన చమురు ధర ఆర్థికవ్యవస్థ బలపడటానికి ఇన్నివిధాలుగా తోడ్పడినా సామాన్యుడికి మాత్రం నేరుగా కలిసొచ్చింది లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర 2005నాటి స్థాయికి పడిపోయినా పెట్రోల్, డీజిల్ ధరలు ఆ స్థాయిలో తగ్గలేదు. అప్పట్లో పెట్రోల్ ధర లీటరు రూ. 45, డీజిల్ రూ. 30.25 ఉండగా...ఈసారి పెట్రోల్ రూ. 59, డీజిల్ రూ. 48 ఉన్నాయి. నవంబర్ మొదలుకొని కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలు ఎక్సైజ్ సుంకాలు పెంచడమే ఇందుకు కారణం. పెట్రోల్‌పై మొత్తంగా లీటర్‌కు రూ. 7.75, డీజిల్‌పై లీటర్‌కు రూ. 6.50 చొప్పున సుంకాలు పెరిగాయి. ఇదే అదునుగా రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు భారం వేయడంవల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకొంచెం హెచ్చయ్యాయి. 2013 జనవరిలో ఆనాటి యూపీఏ సర్కారు చమురు ధరలపై నియంత్రణను ఎత్తేసింది. ఇకపై దేశంలో చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉంటాయని ఆ సందర్భంగా ప్రకటించింది. ఎన్డీయే సర్కారు తన వంతుగా నిరుడు అక్టోబర్‌లో డీజిల్ ధరలపై నియంత్రణను తొలగించింది. ధరలు పెంచినప్పుడల్లా అంతర్జాతీయ మార్కెట్‌ను చూపిన పాలకులు తగ్గే సందర్భం వచ్చేసరికి మాత్రం సుంకాలు పెంచి సామాన్య పౌరుల్ని దగా చేశారు. చమురు ధరలు మొన్న మార్చినుంచి మళ్లీ పైపైకి వెళ్లడం మొదలెట్టాయి. మార్చి నెలాఖరుకు బ్యారెల్ ముడి చమురు ధర 53.64 డాలర్లుంటే అది మే నెలకల్లా 64.05 డాలర్లకు ఎగసింది. ఇప్పుడది 68 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉంటాయి. డిమాండులో హెచ్చుతగ్గులు, చమురు ఉత్పాదక దేశాలు ఉత్పత్తిని పెంచడం లేదా తగ్గించడం, షేల్ చమురు మార్కెట్లోకి రావడం, పశ్చిమాసియాలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలు మొత్తంగా మార్కెట్‌ను నిర్దేశిస్తాయి. మన దేశానికి సంబంధించినంతవరకూ డాలర్‌తో రూపాయి మారకం రేటు అదనంగా ప్రభావితం చేస్తుంది. ఇన్ని సంక్లిష్ట అంశాలతో ముడిపడి ఉండే పెట్రో ధరలపై నియంత్రణను తొలగించడం జనసామాన్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దూరదృష్టి పాలకులకు కొరవడింది. పర్యవసానంగా ఇరుగు పొరుగుతో పోల్చినా మన దేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి. క్రితం వారం కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని గమనిస్తే ఇది అర్ధమవుతుంది. ఆయనిచ్చిన లెక్కల ప్రకారమే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ 63.16 ఉండగా...పాకిస్థాన్‌లో 44.05, శ్రీలంకలో 54.75గా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలు విధించడంవల్లే ధరలు ఈ స్థాయిలో ఉంటున్నాయి. ప్రభుత్వాలు పెట్రోల్‌పై 50 శాతంపైగా, డీజిల్‌పై 38 శాతంపైగా పన్నులు, సుంకాలు వసూలు చేస్తున్నాయి. ఈ సుంకాలద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు లక్షల కోట్ల రూపాయలకుపైగా వస్తున్నదని ఒక అంచనా. ఆదాయం కోసం ఇలా ఒక్క రంగంపైనే ప్రభుత్వాలు ఆధారపడటం సరైంది కాదని రంగరాజన్ కమిటీ సైతం తెలిపింది. అయినా ప్రభుత్వాల వైఖరిలో మార్పు రాలేదు సరిగదా...చమురు రంగంనుంచి మరింత ఆదాయాన్ని పిండుకునే దిశగా వెళ్తున్నాయని ఇటీవల విధించిన సుంకాల తీరు రుజువుచేసింది. పాలకులు హేతుబద్ధంగా ఆలోచించాలి. చమురు సంస్థలను తమ విధానాలతో నష్టపరుస్తూ అందుకు అంతర్జాతీయ కారణాలను చెప్పి తప్పించుకునే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సమస్త జీవన రంగాలతో ముడిపడి ఉండే పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి.