
భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘మనం రేపటి నుండి రాజకీయంగా ఓటు ద్వారా మనిషికి ఒకే విలువను సాధించుకున్నాం. కానీ సామాజికంగా సమానతను సాధించుకోవాల్సి ఉంది’ అన్నారు. కులమత అంతరాలు ఆర్థిక అసమానతలు, దోపిడీ పీడనలు లేని సమాజాన్ని కలగన్న ఆనాటి మహనీయుల కలలు ఇంకా నెరవేరనే లేదు.
భారతదేశ చాతుర్వర్ణ కుల వ్యవస్థ భారత సమాజాన్ని నిలువునా చీల్చిందనీ, కుల నిర్మూలన జరగకుండా, అంధ విశ్వాసాలు తొలగి పోకుండా సమాజం పురోగమించదనీ, ఆ లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ స్ఫూర్తితో సమాజాన్ని పాలకులు ముందుకు నడపాలి. అయితే వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల దొంతరలలోని కులాలను స్థిరీకరిస్తూ, అంతరాలను పెంచి పోషిస్తున్నారు.
కులం కట్టుబాట్లను అనుసరించి... తమ ఇష్టానిష్టాలకు భిన్నంగా ఆ యా కులాల్లోనే వివా హాలు చేసుకోవడం ఒకరకంగా దోపిడీకి గురికావడం లాంటిదే. రెండు వందల ఏళ్ల నాడే సావిత్రీబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలేలు ఈ కుల కట్టుబాట్లను తుదమట్టిస్తూ, కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్స హించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవా లనుకునే జంటలకు కాని, కులమత అడ్డుకోటలను కూల్చాలనుకునే ప్రేమి కులకు కాని, కుల కట్టుబాట్లు, సంప్రదాయాలు, పెళ్లి తంతులు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లిళ్లు చేసుకొనేవారు అనేకమంది విడిపోతున్నారు.
ఇవాళ కుటుంబంలో అమ్మాయి పుట్టిందంటే భయపడే పరిస్థితి ఎందుకుంది? ఆమె పెరిగి, పెద్దదై పెళ్లి చేసుకునేదాకా తల్లితండ్రులు భయాందోళనలకు గురికావలసి రావడానికి కారణం ఏమిటి? సమాజంలో పాతుకుపోయిన మనువాదమే కదా. ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హసి’ (ఏ స్త్రీ కూడా స్వేచ్ఛకు అర్హురాలు కాదు) అనే భావం నరనరాల్లో జీర్ఙించుకున్న సమాజం కదా మనది. స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా, కుటుంబ పరువును కాపాడవలసిన జీవిగా పురుషాధిక్య సమాజం చూడటం వల్లే... ఆమె కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే పరువు హత్యలకు పాల్పడుతున్నారు.
రాజ్యాంగం మనిషికి స్వేచ్ఛగా బ్రతికే హక్కుని ప్రసాదించింది. ఇష్టమైనవారిని కులమతాల ప్రసక్తి లేకుండా వివాహమాడే స్వేచ్ఛను కల్పించింది. వరకట్నం చట్ట వ్యతిరేకమని తెలిసినా పట్టించుకుంటున్నది ఎంతమంది? కట్నాలు లేకుండా, కులపట్టింపులు లేకుండా తమకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటే వారి మీద కత్తులు నూరటం దుర్మార్గం.
ఇవాళ్టి సామాజిక సందర్భంలో పిల్లలు ఒకరిని ఒకరు కలుసు కోవడం, తెలుసుకోవడం, భావి జీవితం గురించి కలలు కనటం అనేది చాలా సహజాతి సహజమైన పరిణామం. ఇందుకు తల్లిదండ్రులు, సమాజం ప్రోత్సహించాల్సిందిపోయి... వాళ్ళు ఏదో సమాజానికి కీడు చేస్తున్నట్టు నియంత్రించడం తగదు. కులం అనే ఒక కాగితపు పులిని చూసి మనిషి తన కన్న బిడ్డల్ని చంపుకొనే క్రూర జంతువుగా మారడం దారుణం. కుల పెద్దలుగా చలామణీ అయ్యేవారు, నాయకులు కులాంతర వివాహం చేసుకున్న జంటల్ని వెంటాడి వేధిస్తు న్నారు.
సినిమాల్లో ప్రేమల్ని, ప్రేమికుల కష్టాల్ని చూసి కన్నీళ్లు కార్చే పెద్దలు, తమ కడుపున పుట్టిన బిడ్డలు తమకి ఇష్టం వచ్చిన అబ్బాయినో, అమ్మాయినో కోరుకుంటే... పరువు పోయిందని హత్యలకు తెగపడటం చూస్తూనే ఉన్నాం. సూర్యాపేటలో బంటినీ, మిర్యాలగూడలో ప్రణయ్ లాంటి ప్రేమికులనూ చంపడం ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవలసి ఉంది. ప్రేమ వివాహాలు, కులాంతర పెళ్లిళ్లు చేసుకునే పిల్లలకు చట్టం, సమాజం మద్దతుగా నిలవాలి.
తమ ఇష్టాలకు అనుగుణంగా పెళ్లిళ్లు చేసుకునే పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడం ద్వారా నిజమైన ప్రేమికుల్ని కాపాడుకోవాల్సి ఉంది. అలాగే వాళ్లకు నచ్చకపోతే విడిపోయి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలను కూడా సమాజం ఇవ్వాలి. కులాంతర వివాహం... మానసిక, శారీరక వైకల్యం లేని క్రియాశీల భవిష్యత్ తరానికి బాటలు వేస్తుంది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహ కాలు పెంచాలి. ఈ జంటలపై దాడులు చేసేవారిని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే విచారణ చేసి శిక్షించాలి.
– ప్రభాకర్ కస్తూరి
సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ‘ 94409 70454
Comments
Please login to add a commentAdd a comment