ప్రత్యేక హోదాపై పోరాటమా? వంకాయా?
ఏలూరు : అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటాలా? వంకాయేం కాదూ... లోక్ సభలో 500పైగా స్థానాలుంటే..375 ఏమో ఎన్డీయేకి మెజార్టీ ఉంది. ఏంది నేను చేసేది పోరాటం' అని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి సోనియాగాంధీయే కారణమని, రాష్ట్రాన్ని తన స్వలాభం కోసం నాశనం చేశారని జేసీ దివాకర్ రెడ్డి నిన్న ఇక్కడ నిప్పులు చెరిగారు.
ఈ నష్టాన్ని పూడ్చాలంటే యాభై ఏళ్లు పడుతుందన్నారు. విభజన జరిగిన విషయంపై అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి ఉందన్నారు. న్యాయబద్ధంగా జరిగిన విభజన కాదని, నాలుగు గోడల మధ్య ఎవరు చెయ్యి ఎత్తారో, ఎవరు చెయ్యి ఎత్తలేదో తేలీకుండా విభజన జరిగిందన్నారు. ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీని ఆరడుగుల గోయ్యిలో పూడ్చేస్తారని, అభివృద్ధి కుంటుపడుతుందని తాను అప్పుడే చెప్పానన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు వెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర నమస్కారాలు చేసి రావటం తప్ప చేయగలిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇంతకు ముందు లేని గొడవలు అన్నీ వస్తున్నాయన్నారు.