'సోనియా వ్యవహారం పిచ్చోని చేతిలో రాయిలా'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాను అనుకున్నది జరుగుతుంది అనటానికి రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అర్థం అవుతుందని ఆపార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో సోనియా వ్యవహారం పిచ్చోని చేతిలో రాయిలా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే ఎవరూ సీమాంధ్ర రాజధాని ఎక్కడ అనే అంశంపై ఎవరూ పోరాటాలు చేయొద్దని జేసీ సూచించారు.
తాము చేసిన ఎలాంటి డిమాండ్లను గుడ్డి, చెవిటి ప్రభుత్వం పట్టించుకోలేదని జేసీ అన్నారు. తాను అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని, అయితే ఏ పార్టీలో చేరతాను అనేది కాలమే నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. జేసీ శనివారం కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవని సీఎంకు చెప్పానని, సీమాంధ్రలో కాంగ్రెస్ ఉనికి ఉండదని అన్నారు. తమిళనాడులో లాగానే ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని జేసీ పేర్కొన్నారు.