సోనియా గాంధీపై జేసీ సంచలన వ్యాఖ్యలు
అనంత: కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం అనంతరం స్పందించిన జేసీ.. ఏఐసీసీ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ ఇకనైనా కాంగ్రెస్ నాయకత్వం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశం మొత్తంగా కాంగ్రెస్ ఖాళీ అవడం ఖాయమని జేసీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఇక కాలం చెల్లిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తప్పుకుని యువకులకు అవకాశం ఇవ్వాలని జేసీ సూచించారు. సోనియా గాంధీ లేకపోతే పార్టీ లేదనుకోవటం పొరపాటని అన్నారు.
125 ఏళ్ల కాంగ్రెస్ సంస్కృతిలో ఇంకా సీల్డ్ కవర్ సంస్కృతినే కొనసాగిస్తే పార్టీ సర్వనాశనం అయిపోతుందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం సమర్ధుడైన నాయకుడికి కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించాలన్నారు. అవిశ్వాసం తీర్మానం పెట్టిన కాంగ్రెస్ ఎంపీలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మాత్రం ఆగే ప్రసక్తే లేదన్నారు.