ఉంటానంటే... కాదు పొమ్మంటున్నారు: జేసీ
యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఇప్పటి వరకు తనకు అందలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో తన కుటుంబానికి మూడు తరాల అనుబంధం ఉందని జేసీ గుర్తు చేశారు. అంత అనుబంధం ఉన్న పార్టీని విడిచిపెట్టడం బాధకరమని ఆయన వ్యాఖ్యానించారు.
షోకాజ్ నోటీసు జారీ చేశామని దిగ్విజయ్ సింగ్ చెప్పినా... ఆ నోటీసేది తనకందలేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నోటీసు మధ్యలో ఎక్కడైనా ఆగిందేమోనని చమత్కరించారు. కాంగ్రెస్‌లో తనందరికంటే సీనియర్‌నని...కాంగ్రెస్‌లోనే కొనసాగాలన్నది తన అభిమతమని జేసీ అన్నారు. కాని పార్టీ పెద్దలు మాత్రం తాను వెళ్లిపోవాలని పోరుతున్నారని తెలిపారు. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పనైపోయిందన్న జేసీ... పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై తీవ్రంగా మండిపడ్డారు. తాడిపత్రిలో పోటీ చేసి గెలవాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు. తాడిపత్రికి చెందిన నాయకుడు నాగిరెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరడం సంతోషమని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.