ఇప్పట్లో సాధ్యం కాదు
చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడు మత్స్యకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారంలో జాప్యం అనివార్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని అన్నిరంగాల్లో అల్లకల్లోలంలోకి నెట్టేసిందన్నారు. ఫలితంగా ఆర్థికంగా కుంటువడిపోయిందని చెప్పారు. అలాగని మత్స్యకారుల సమస్యను కేంద్రం ఎంతమాత్రం విస్మరించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాధాన్యక్రమంలో ఇతర సమస్యల పరిష్కారాన్ని సైతం తీవ్రంగా పరిగణిస్తున్నందున కొంత జాప్యం తప్పదని చెప్పారు. ఒక అనుకూలమైన పరిస్థితుల్లో మత్స్యకారుల సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. చెన్నై నగరంలో మెట్రోరైల్ పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయన్నారు. తిరువొత్తియూరు వరకు మెట్రోరైల్ పొడిగింపు పరిశీలన దశలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నీతి ఆయోగ్‌పై అనుమానాలు వద్దు: ప్రణాళికా సంఘం స్థానంలో ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ పై ఎటువంటి అనుమానాలకు తావులేదని వెంకయ్య అన్నారు. ఈ చట్టం వల్ల దేశంలో అనేక పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు లభించడం ఖాయమన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతనే నీతి ఆయోగ్ చట్టం రూపకల్పన జరిగిందన్నారు. ఈ పథకం పూర్తి వివరాలను అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపామని చెప్పారు. కేంద్ర స్థాయిలో అభివృద్ధి జరిగితే చాలదు, దేశంలోని అన్నిరాష్ట్రాలు అదేరీతిలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
అడ్డుకోవడం సహజం
కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రగతిని అడ్డుకోవడం సహజమని వెంకయ్య అన్నారు. గతంలో 50 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రణాళికా సంఘం ద్వారా ఎటువంటి అభివృద్ధిని సాధించలేదని అన్నారు. ప్రకటనతోనే పథకాలను సరిపెట్టిన గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతిని పక్కనపెట్టిందని వ్యాఖ్యానించారు.