Tamil Nadu fishermen
-
విధ్వంసం సృష్టించిన లంక నేవీ
సాక్షి, చెన్నై: తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారంటూ తమిళ జాలర్లను నిర్బంధించే శ్రీలంక నేవీ ఈసారి మరింత పేట్రేగిపోయింది. ఏకంగా తమిళ జాలర్ల బోట్లపై దాడి చేసి ధ్వంసం చేసింది. కచ్ఛతీవు దీవి సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లిన తమిళజాలర్లను వెంటాడిన శ్రీలంక నావికా దళం మరోసారి ఇక్కడికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. అంతటితో ఆగక దాదాపు ఇరవై బోట్లను ధ్వంసం చేసింది. వారి దాడిలో 10మంది మత్స్యకారులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను తోటి వారు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత వారిని డిశ్చార్జి చేశారు. సోమవారం రాత్రి సముద్రంలోకి వెళ్లిన దాదాపు 2,500 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ బలవంతంగా వెనక్కి పంపేసింది. తమ బంధీలుగా చేసుకున్న దాదాపు 80 మంది మత్స్యకారులను నేడు విడుదలయ్యారు. వీరంతా రామనాథపురం, పుదుక్కొట్టై, నాగపట్టణం, కన్యాకుమారి, తిరునల్వేలి, మధురై, పుదుచ్చేరి జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. -
భారత జాలర్ల అరెస్ట్.. బోట్లు స్వాధీనం
రామేశ్వరం: తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీలంక ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్నారన్న కారణంగా తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది జాలర్లను బుధవారం శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు బోట్లు స్వాధీనం చేసుకున్నారు. కంకేసంతురై నేవీ క్యాంపునకు జాలర్లును తరలించినట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న జాలర్లు పుడుకొట్టై జిల్లా కొట్టాయిపట్టినానికి చెందిన వారని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మోదీజీ సహాయం చేయండి: పన్నీర్ సెల్వం లేఖ
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం లేఖ రాశారు. శ్రీలంకలో బంధీలుగా ఉన్న తమిళనాడు మత్స్యకారులను విడిపించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమిళనాడు తీర ప్రాంతం లంకకు దగ్గరగా ఉండటంతో తమ జలాల పరిధిలోకి వచ్చారని ఆరోపిస్తూ చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను లంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకుని వారి పడవలను సీజ్ చేస్తున్నట్లు సీఎం పన్నీర్ సెల్వం ప్రధానికి విన్నవించారు. మరోవైపు వార్దా తుపాను ఉత్తర తమిళనాడు తీరంలో చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాలయాలన్నింటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మూడు జిల్లాల్లో ప్రైవేట్ ఆఫీసులకు సెలవు ప్రకటించాలని పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం తీరం దాటే అవకాశం ఉండటంతో ఉత్తర తమిళనాడు జిల్లాల్లోని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. -
మూత్రం తాగి బతికాం
చెన్నై, సాక్షి ప్రతినిధి:‘నడి సంద్రంలో మునిగిన నావ, దాహం తీర్చుకునేందుకు ఏదీ త్రోవ...అందుకే మూత్రం తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నాం’ అని సముద్రంలో చేపలవేటకు వెళ్లి వారం రోజుల పాటు అవస్థలు పడిన తమిళనాడు జాలర్లు తెలిపారు. వారి కథనం మేరకు.. చెన్నై కాశిమేడు జీవరత్నం నగర్‌కు చెందిన కడుంపాడి(42), మాయాండి (30), శక్తివేల్ (29), మణి (30), సురేష్ (32) గత నెల 21వ తేదీన ఫైబర్ బోటును తీసుకుని సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. 22వ తేదీ అర్ధరాత్రి రాక్షస అలల తాకిడికి వీరు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. చేపలవేటకు వెళ్లిన వారు రెండురోజులైనా తిరిగి రాకపోవడంతో మత్స్యకార గ్రామాల్లో విషాదం అలుముకుంది. తమవారిని వెతికిపెట్టాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సముద్రతీర గస్తీదళాలు హెలికాప్టర్‌తో గాలించాయి. జాలర్లు సైతం అనేక బోట్లలో సముద్రంలో వెతికినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో తమవారు క్షేమంగా ఉన్నారని సమాచారం అందడంతో తమిళ జాలర్ల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇదిలావుండగా జాలర్లు కొట్టుకుపోతున్న బోటును ఈదుకుంటూ వెళ్లి పట్టుకున్నారు. మరికొంత సేపటికి మళ్లీ రాక్షస అలరావడంతో పడవబోల్తా పడడమేగాక ఇంజిన్లోకి నీళ్లు వెళ్లి చెడిపోయింది. బోల్తాపడిన పడవ పైభాగంలో ఐదుగురు నిలుచుని ఆదుకునేవారి కోసం ఎదురుచూశారు. ఇలా రెండురోజులు గడిచిపోగా ఆకలి, తట్టుకోలేని దాహం వేసింది. నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి జీవం ఉన్న చేపలను ఆరగించి ఆకలిని తీర్చుకున్నారు. దాహం తీర్చుకునేందుకు ఉప్పునీటిని తాగలేకపోయారు. మూత్రాన్ని దోసిట్లో పట్టుకుని తాగి దాహం తీర్చుకున్నారు. ఇలా వారం రోజులు గడిచిపోగా ఆకలి కారణంగా నలుగురు జాలర్లు స్పృహ తప్పిపోయారు. వారిని రక్షించుకుంటూ కాలం గడుపుతున్న మణిని మచిలీపట్నం సముద్రతీరంలో చేపలు పడుతున్న ఆంధ్రా జాలర్లు గుర్తించారు. వారిని చూడగానే మణి రక్షించండి అంటూ కేకలు వేయసాగాడు. ఆంధ్రా జాలర్లు వారందరినీ ఒడ్డుకు తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సతో కోలుకున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లు గత నెల 31వ తేదీన స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు జాలర్ల కుటుంబాలు సంతోషించాయి. మంగళవారం మీడియా ముందుకు వచ్చిన కడుంపాండి జరిగిన ఘటనను వివరించాడు. తమ ప్రాణాలు కాపాడిని ఆంధ్రా జాలర్లకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేశాడు. -
ఇప్పట్లో సాధ్యం కాదు
చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడు మత్స్యకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారంలో జాప్యం అనివార్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని అన్నిరంగాల్లో అల్లకల్లోలంలోకి నెట్టేసిందన్నారు. ఫలితంగా ఆర్థికంగా కుంటువడిపోయిందని చెప్పారు. అలాగని మత్స్యకారుల సమస్యను కేంద్రం ఎంతమాత్రం విస్మరించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాధాన్యక్రమంలో ఇతర సమస్యల పరిష్కారాన్ని సైతం తీవ్రంగా పరిగణిస్తున్నందున కొంత జాప్యం తప్పదని చెప్పారు. ఒక అనుకూలమైన పరిస్థితుల్లో మత్స్యకారుల సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. చెన్నై నగరంలో మెట్రోరైల్ పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయన్నారు. తిరువొత్తియూరు వరకు మెట్రోరైల్ పొడిగింపు పరిశీలన దశలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నీతి ఆయోగ్‌పై అనుమానాలు వద్దు: ప్రణాళికా సంఘం స్థానంలో ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ పై ఎటువంటి అనుమానాలకు తావులేదని వెంకయ్య అన్నారు. ఈ చట్టం వల్ల దేశంలో అనేక పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు లభించడం ఖాయమన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతనే నీతి ఆయోగ్ చట్టం రూపకల్పన జరిగిందన్నారు. ఈ పథకం పూర్తి వివరాలను అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపామని చెప్పారు. కేంద్ర స్థాయిలో అభివృద్ధి జరిగితే చాలదు, దేశంలోని అన్నిరాష్ట్రాలు అదేరీతిలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అడ్డుకోవడం సహజం కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రగతిని అడ్డుకోవడం సహజమని వెంకయ్య అన్నారు. గతంలో 50 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రణాళికా సంఘం ద్వారా ఎటువంటి అభివృద్ధిని సాధించలేదని అన్నారు. ప్రకటనతోనే పథకాలను సరిపెట్టిన గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతిని పక్కనపెట్టిందని వ్యాఖ్యానించారు. -
పీఎంకు ‘పన్నీర్’ తొలిలేఖ
జాలర్ల విడుదలకు వినతి చెన్నై, సాక్షి ప్రతినిధి : పీఎంకు లేఖ రాయడం ద్వారా కొత్త సీఎం విధుల్లో నిమగ్నమయ్యూరు. శ్రీలంక చెరలో ఉన్న తమిళనాడు మత్స్యకారుల విడుదలపై జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్‌సెల్వం తొలిసారిగా ప్రధానికి లేఖను రాశారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో శ్రీలంక వివాదం ఒకటి. భారత్ చేతుల్లోని కచ్చదీవులపై హక్కులను శ్రీలంకకు అప్పగించిన నాటి నుంచి అంటే సుమారు మూడు దశాబ్దాలుగా ఈ వివాదం నలుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చున్నా వారి ముందు ఉండే ప్రధాన సమస్య శ్రీలంక దాష్టీకమే. తమ సరిహద్దుల్లోని కచ్చదీవుల్లోకి తమిళ జాలర్ల చేపలవేట సాగిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు తరచూ విరుచుకు పడుతుంటాయి. మత్స్యకారులను, వారి పడవలను వారి దేశానికి తీసుకెళుతుంటారుు. భారతదేశం నుంచి ఒత్తిడి రాగానే విడిచిపెట్టడం, మళ్లీ చెరపట్టడం శ్రీలంకకు పరిపాటి. ఇలా ప్రస్తుతం శ్రీలంక చెరలో ఉన్న 20 మంది జాలర్లను, 75 మరపడవలను విడిపించేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం ప్రధాని నరేంద్రమోడీకి ఉత్తరం రాశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం హోదాల్లో కేంద్రంపై ఒత్తిడి తె స్తూ సాగించిన కృషి ఫలితంగా గతంలో 76 మంది మత్స్యకారుల్లో 72 మందిని మంగళవారం నాడు శ్రీలంక విడుదల చేసిందని తెలిపారు. జాలర్ల విడుదలపై జోక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అయితే, మత్స్యకారులను విడుదల చేసినా వారి స్వాధీనంలో ఉన్న 71 మరపడవలను మాత్రం అప్పగించలేదని ప్రధాని దృష్టికి సీఎం పన్నీర్‌సెల్వం తన ఉత్తరం ద్వారా తీసుకెళ్లారు. గతనెల 27వ తేదీన రామేశ్వరం నుంచి చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక మళ్లీ చెరపట్టిందని తెలిపారు. జాలర్లందరినీ కాంగేశన్ హార్బర్‌కు తరలించి శ్రీలంక కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 10 వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు చెప్పారు. గత నెల 29న మరో 16 మందిని శ్రీలంక దళాలు అరెస్ట్ చేశాయన్నారు. శ్రీలంక చెరలో ఉన్న మత్స్యకారులను విడుదల చేయించాలని, అలాగే వారి స్వాధీనంలో ఉన్న మరపడవలను సైతం అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం పన్నీర్‌సెల్వం బుధవారం ప్రధానికి లేఖ రాశారు. -
చావో రేవో!
సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక సేనల పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూపీఏ హయూంలో తమ మీద జరిగిన వరుస దాడులతో విసిగి వేసారిన తమిళ జాలర్లు, ఎన్నికల వేళ నరేంద్ర మోడీ ఇచ్చిన హామీతో ఊరట చెందారు. అయితే, కేంద్రంలో అధికారం మారిందేగానీ, జాలర్లకు భద్రత మాత్రం దక్కలేదు. శ్రీలంక సేనలు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారుు. బందీలుగా పట్టుకెళ్లడం, కేంద్రం ఒత్తిడితో విడిచి పెట్టడం పరిపాటిగా మారింది. అయితే, జాలర్ల పడవలను మాత్రం శ్రీలంక సేనలు అప్పగించడంలేదు. కేంద్రం ఇటీవల కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ జాలర్లకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. శ్రీలంకకు దారాదత్తం చేసిన ఒకప్పటి తమిళ భూభాగమైన కచ్చదీవుల్లో తమిళ జాలర్లకు చేపలను వేటాడే హక్కులేదని ప్రకటించడం ఆగ్రహం కలిగించింది. యూపీఏ బాణిలోనే కొత్త ప్రభుత్వం నడుస్తుండడంతో తమ భద్రత విషయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఢీ కొట్టేందుకు జాలర్లు రెడీ అయ్యారు. వదిలేద్దాం: దినదిన గండంగా చేపల వేట మారుతుండడంతో ఈ వృత్తినే వదిలేద్దామన్న నిర్ణయానికి రామేశ్వరం జాలర్లు వచ్చారు. అప్పోసప్పో చేసి చేపల వేటకు వెళితే, చివరకు చిల్లి గవ్వ మిగలడంలేదని, ఇక, లంక సేన దాడు ల పుణ్యమా అని పడవలు పోగొట్టుకోవాల్సి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తమ భద్ర విషయంలో చావో రేవో తేల్చుకోవడం లేదా, వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తిని వదులుకోవడమా? అన్నది తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జాలర్ల సంఘాలన్నీ ఏకమై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు చేశారుుగడువు : సోమవారం రామేశ్వరం హార్బర్లో జాలర్ల సంఘాలు, జాలర్ల నేతృత్వంలో భారీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా తమ భద్రత లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. కడలిలో తమకు భద్రత కల్పించే విధంగా భరోసా ఇవ్వడం, లంక సేనల ఆగడాలకు పూర్తిగా కళ్లెం వేయడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి సిద్ధం అయ్యారు. కచ్చదీవుల్లో చేపల వేటపై తమకు ఉన్న హక్కును కాలరాసే విధంగా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను పునః సమీక్షించడం, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమకు అక్కడ చేపల్ని వేటాడుకునే అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రామేశ్వరంలో మరో 22మంది తమిళ జాలర్ల అరెస్ట్
రామేశ్వరం: శ్రీలంక జలశయాల్లోకి చేపల వేటకు వెళ్లిన మరో 22మంది తమిళ జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది. పుదుకొట్టాయి పాల్క్ జలసంధి వద్ద అక్రమంగా ప్రవేశించారనే నేపంతో మత్య్సకారులను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వారితోపాటు ఆరు పడవలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. చేపల వేటకు వెళ్లిన మరో తమిళ జాలర్ల బృందాన్ని కూడా శ్రీలంక నావికదళ సభ్యులు పట్టుకునేందుకు యత్నించారు. అంతేకాకుండా వారి చేపల వలలను నాశనం చేశారు. 22మంది జాలర్లను శ్రీలంక నావీ అరెస్ట్ చేయడంపై తీరప్రాంతమైన పుదుకొట్టాయిలో ఉద్రిక్తత నెలకొన్నట్టు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేసి, శ్రీలంక జైల్లో నిర్భందించిన నాగపట్నం, కరాయికల్, పదుకొట్టాయి జిల్లాలకు చెందిన 227మంది తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా మత్స్యకారుల సంఘం డిమాండ్ చేస్తోంది. లంక దాడులపై నిరసనగా వారంతా సమ్మెబాట పట్టారు. దీనిపై తమిళనాడు మత్స్యకారుల ప్రతినిధులు శనివారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా నిర్బంధించిన జాలర్ల విషయమై లంక ప్రభుత్వంతో చర్చలు జరిపి తమిళ జాలర్లను విడుదలకు కృషిచేయాలని వారు ప్రధానిని కోరినట్టు సమాచారం.