మోదీజీ సహాయం చేయండి: పన్నీర్ సెల్వం లేఖ
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం లేఖ రాశారు. శ్రీలంకలో బంధీలుగా ఉన్న తమిళనాడు మత్స్యకారులను విడిపించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమిళనాడు తీర ప్రాంతం లంకకు దగ్గరగా ఉండటంతో తమ జలాల పరిధిలోకి వచ్చారని ఆరోపిస్తూ చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను లంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకుని వారి పడవలను సీజ్ చేస్తున్నట్లు సీఎం పన్నీర్ సెల్వం ప్రధానికి విన్నవించారు.
మరోవైపు వార్దా తుపాను ఉత్తర తమిళనాడు తీరంలో చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాలయాలన్నింటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మూడు జిల్లాల్లో ప్రైవేట్ ఆఫీసులకు సెలవు ప్రకటించాలని పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం తీరం దాటే అవకాశం ఉండటంతో ఉత్తర తమిళనాడు జిల్లాల్లోని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.