letter to modi
-
‘బొమ్మై’ ప్రభుత్వంలో ‘అవినీతి’ అందలం.. ప్రధానికి 13,000 స్కూల్స్ ఫిర్యాదు!
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ సుమారు 13,000 పాఠశాలలు.. ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశాయి. ‘ద అసోసియేటెడ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్’, ‘ద రిజిస్టర్డ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్’.. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశాయి. విద్యాసంస్థలకు గుర్తింపు పత్రం జారీ కోసం రాష్ట్ర విద్యాశాఖ లంచం డిమాండ్ చేసిన ఘటనను పరిశీలించాలని కోరాయి. ‘అశాస్త్రీయమైన, అహేతుకమైన, వివక్షణ లేని, పాటించని నిబంధనలు అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. భారీ అవినీతి జరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, వాటిని పక్కనపెట్టేశారు. బీసీ నగేశ్ రాజీనామా చేయాలి. మొత్తం వ్యవస్థలోని దుర్భర పరిస్థితులను అర్థం చేసుకోవటం, సమస్యలను పరిష్కరించటంలో విద్యాశాఖ అలసత్వం వహిస్తోంది. పాఠశాలల బడ్జెట్‌కు ఇద్దరు బీజేపీ మంత్రులు తీరని నష్టం చేకూరుస్తున్నారు. మరోవైపు.. వారి విద్యాస్థల్లోకి భారీగా పెట్టుబడి దారులను ఆహ్వానిస్తూ విద్యార్థుల నుంచి అధికమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు.’ అని లేఖలో పేర్కొన్నాయి పాఠశాలల యాజమాన్యాలు. విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు ప్రభుత్వం సూచించిన పుస్తకాలు పాఠశాలలకు చేరలేదని అసోసియేషన్స్ ఆరోపించాయి. తల్లిదండ్రులు, విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆచరణాత్మకంగా అమలు చేయగల నిబంధనలను రూపొందించి.. నియంత్రణలను సరళీకరించడానికి విద్యాశాఖ మంత్రికి శ్రద్ధ లేదని పేర్కొన్నాయి. ఈవిషయాన్ని పరిగణనలోకి తీసుకుని కర్ణాటక విద్యాశాఖ మంత్రిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరాయి. ఇదీ చదవండి: Jayalalitha Death Mystery: 600 పేజీలతో నివేదిక.. సీఎం స్టాలిన్ చేతికి రిపోర్టు -
విభజనవాద శక్తులను కట్టడి చేయండి
న్యూఢిల్లీ: దేశంలో విభజనవాద శక్తులను కట్టడి చేయాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)బెంగళూరు, అహ్మదాబాద్‌లకు చెందిన విద్యార్థులు, బోధనాసిబ్బంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధాని మౌనం దాల్చడం విద్వేషాలను రెచ్చగొట్టే వారికి ధైర్యాన్నిస్తోందని పేర్కొన్నారు. దేశంలో మైనారిటీలపై దాడుల ఘటనలు, విద్వేష పూరిత ప్రసంగాల నేపథ్యంలో రాసిన ఈ లేఖపై 180 మందికి పైగా సంతకాలు చేశారు. ‘మిశ్రమ సంస్కృతులకు గౌరవించే మీరు.. దేశంలో పెరుగుతున్న అసహనంపై మౌనంగా ఉండటం మమ్మల్ని బాధిస్తోంది. మీ మౌనం విద్వేషపూరిత గొంతుకలకు బలాన్నిస్తోంది’ అని లేఖలో పేర్కొన్నారు. -
గవర్నర్‌గా ధన్కర్ వద్దంటూ ప్రధానికి మూడుసార్లు లేఖ రాశా
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ధన్కర్ను ఉపసంహరించుకోవాలంటూ ప్రధాని మోదీకి ఇప్పటి వరకు మూడుసార్లు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ‘చిన్న పిల్లాడైతే బుజ్జగించవచ్చు కానీ, ఒక వృద్ధుడిని అలా చేయలేం కదా. ఈ విషయంలో మాట్లాడకుండా ఉండటమే మంచిది’అంటూ మమత వ్యాఖ్యానించారు. గవర్నర్ ధన్కర్ను తొలగిస్తారంటూ వార్తలు వస్తున్నాయి కదా? అని మీడియా ప్రశ్నించగా ఆ విషయాలేవీ తనకు తెలియవన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ధన్కర్ను కేంద్రం నియమించింది. ఆయన్ను వెనక్కి తీసుకోవాలని మోదీకి లేఖలు రాశా’అని తెలిపారు. రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వంతో గవర్నర్ ధన్కర్ మధ్య విభేదాలు మొదట్నుంచీ కొనసాగుతున్నాయి. అమిత్ షాను కలిసిన ధన్కర్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ధన్కర్.. గురువారం హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై ధన్కర్ హోం మంత్రికి వివరించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం కోల్‌కతాలో గవర్నర్‌కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. -
‘కేరళ బంగారం’ కేసు ఎన్ఐఏకు
న్యూఢిల్లీ: తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం కేసు విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారం దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హోం శాఖ పేర్కొంది. ఈ అంశంపై జోక్యం చేసుకుని, మరింత మెరుగైన దర్యాప్తు జరపాలంటూ కేరళ సీఎం విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన మరుసటి రోజే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆదివారం గల్ఫ్ నుంచి తిరువనంతపురం వచ్చిన ఓ విమానంలో దౌత్యపరమైన సామగ్రి పేరుతో ఉన్న బ్యాగులో సుమారు 30 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. -
ఆ ముగ్గురికి భారతరత్న ఇవ్వండి
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని కాంగ్రెస్ నేత, ఆనంద్‌పుర్ సాహెబ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మనీశ్ తివారీ కోరారు. అంతకన్నా ముందు వారిని ‘షహీద్ ఎ ఆజమ్’బిరుదుతో సత్కరించాలని, మొహాలిలోని చండీగఢ్ విమానాశ్రయానికి భగత్‌సింగ్ పేరు పెట్టాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించడం ద్వారా ఈ ముగ్గురు వారి కాలంలో ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించారని, ఆ క్రమంలోనే 1931 మార్చి 23వ తేదీన దేశంకోసం ప్రాణాలు అర్పించారని మనీశ్ తివారీ తెలిపారు. -
జడ్జీలను పెంచండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుతో పాటు అన్నిహైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై గొగోయ్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి మూడు లేఖలు రాశారు. ఈ సందర్భంగా హైకోర్టుల్లో జడ్జీల పదవీవిరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న కేసుల్ని పరిష్కరించేందుకు పదవీవిరమణ చేసిన జడ్జీలను నిర్ణీతకాలానికి మళ్లీ విధుల్లో తీసుకోవాలని సూచించారు.‘సుప్రీంకోర్టులో ప్రస్తుతం 58,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో ఈ కేసులను విచారించలేకపోతున్నాం. మీకు(మోదీకి) గుర్తుందనుకుంటా. 1988లో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 18 నుంచి 26కు చేరుకుంది. అనంతరం రెండు దశాబ్దాల తర్వాత అంటే 2009లో సీజేఐతో కలిపి జడ్జీల సంఖ్య 31కి చేరుకుంది. సుప్రీంకోర్టు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని, ఇందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను. దీనివల్ల కోర్టు మెట్లు ఎక్కే ప్రజలకు నిర్ణీత సమయంలోగా న్యాయం దొరుకుతుంది’ అని లేఖలో గొగోయ్ తెలిపారు. సుప్రీం, హైకోర్టుల్లో జడ్జీల పోస్టులకు అర్హులైనవారి సంఖ్య పెరిగినప్పటికీ, అదే స్థాయిలో న్యాయమూర్తుల సంఖ్య మాత్రం పెరగలేదన్నారు. హైకోర్టుల్లో తీవ్రమైన కొరత.. హైకోర్టుల్లో జడ్జీల కొరత తీవ్రంగా వేధిస్తోందని జస్టిస్ గొగోయ్ ప్రధాని మోదీకి రాసిన తన రెండో లేఖలో తెలిపారు. ‘ప్రస్తుతం దేశంలోని అన్నిహైకోర్టుల్లో కలిపి 39 శాతం అంటే 399 జడ్జి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. శక్తివంచనలేకుండా కృషి చేస్తే తప్పించి ఈ ఖాళీలను భర్తీచేయడం సాధ్యం కాదు. అలాగే హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీవిరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని మిమ్మల్ని(ప్రధాని) కోరుతున్నా. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణను చేపట్టండి. గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘాలు కూడా దీన్ని సూచించాయి’ అని జస్టిస్ గొగోయ్ వెల్లడించారు. పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఆయన మరో లేఖలో కోరారు. నిర్ణీత కాలానికి వీరిని న్యాయమూర్తులుగా నియమించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణలకు సవరణ చేయాలని సూచించారు. దీనివల్ల అపార అనుభవం ఉన్న జడ్జీలు మరింత ఎక్కువకాలం సేవలు అందించడం వీలవుతుందని పేర్కొన్నారు. -
నీతి ఆయోగ్ భేటీ వృథా
కోల్‌కతా: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈనెల 15వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. తమ రాష్ట్ర అవసరాలకు మద్దతుగా నిలిచే ఆర్థిక అధికారాలు లేని నీతిఆయోగ్ వృథా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘రాష్ట్రాల ప్రణాళికలకు ఆర్థికంగా తోడ్పాటునందించే అధికారం లేని నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం దండగ. ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఈ వ్యవస్థ కంటే అంతర్ రాష్ట్ర కౌన్సిల్‌ను బలోపేతం చేయడం అవసరం. లేకుంటే రాష్ట్రాల మధ్య అసమతౌల్యాన్ని తగ్గించేలా నిధులు కేటాయించే అధికారాన్ని నీతి ఆయోగ్‌కు ఇవ్వాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కూడా సుప్రీంకోర్టులోని కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ‘జడ్జీల ఎంపిక కోసం సుప్రీంకోర్టులో కొలీజియం ఉంటుంది. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఎన్నికల సంఘంలో కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలి’ అని అన్నారు. -
మహిళా బిల్లుకు మద్దతిస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెడితే తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించే ఈ బిల్లుకు బేషరతుగా మద్దతిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సోమవారం లేఖ రాశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీలు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసేలా మహిళలు తమ హక్కును పొందేందుకు ఈ సమావేశాల్లోనే ఆ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ప్రధానిని కోరారు. ‘మహిళల జీవితాలపై మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు వచ్చే పార్లమెంటు సమావేశాలకన్నా గొప్ప అవకాశం, సరైన సమయం ఏముంటుంది?’ అని అందులో రాహుల్ పేర్కొన్నారు. 2010లోనే రాజ్యసభలో ఆమోదం పొందినా.. లోక్‌సభలో గత ఎనిమిదేళ్లుగా నిలిచిపోయిందని రాహుల్ గుర్తుచేశారు. బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో కృషి చేసినా, బీజేపీ కలసిరాలేదని విమర్శించారు. మహిళల సాధికారతకు ఇప్పటికైనా రాజకీయాలకతీతంగా కలిసి పనిచేద్దామని ప్రధానిని కోరారు. లోక్‌సభలో బలముందిగా..! ‘ఈ బిల్లు ఆమోదంపై మీ పార్టీలో కొందరికి విశ్వాసం లేదు. అలాంటి వారికి .. పంచాయతీ, మునిసిపాలిటీల స్థాయిలోనూ పురుషుల కంటే మహిళలే సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరును మీరు వివరించడాన్ని హర్షిస్తున్నా’ అని రాహల్ పేర్కొన్నారు. లోక్‌సభలో బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలకు బలమైన మెజారిటీ ఉందని గుర్తు చేస్తూ.. ఈ చరిత్రాత్మక బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ఇంతకన్నా ఏం కావాలన్నారు. -
మోదీకి తొమ్మిది పైసల చెక్కును పంపిన సామాన్యుడు
సిరిసిల్లటౌన్ : పెట్రో ధరల అమలులో కేంద్ర సర్కారు తల.. తోక లేకుండా వ్యçవహరించండంపై సామాన్యుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. రూపాయల్లో పెంచుతూ.. పైసల్లో తగ్గిస్తే..ప్రజలకు ఒనగూరేదేమి లేదంటూ ఓ సామాన్యుడు తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశాడు. నిన్న తగ్గించిన 0.09 పైసలను చెక్కు రూపంలో పీఎం సహాయనిధికి విరాళంగా ఇస్తూ.. వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు. సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేటకు చెందిన వీరగోని చందు సోమవారం తన బైక్‌లో సిరిసిల్లలోని భారత్ పెట్రోలియంకు చెందిన బంక్ కే. శ్రీనివాస్ అండ్ కంపెనీలో పెట్రోల్ పోయించుకున్నాడు. దీనికిగాను బంక్‌నుంచి రశీదు తీసుకోగా.. అతడికి 0.09 తగ్గించి, రూ.82.87 పైసలకు లీటర్‌గా రశీదు ఇచ్చారు. చందు తన జేబునుంచి రూ.100 నోటు బంక్‌లో ఇవ్వగా రూ. 13 రూపాయలు మాత్రమే చెల్లించారు. మిగతా చిల్లర ఇవ్వాలని కోరగా..0.87 పైసలు ఇస్తే రూ.1 ఇస్తామని బంక్ సిబ్బంది ఎదురు ప్రశ్నించారని చందు పేర్కొన్నాడు. ప్రభుత్వం తగ్గించిన 0.09 పైసలతో పాటు అదనంగా 13పైసలు కూడా బంక్ సిబ్బంది ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి చెందాడు. కేంద్ర సర్కారు తీరుపై నిరసన తెలుపుతూ..0.09 పైసలను చెక్కు రూపలో ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా పంపించాలంటూ కలెక్టర్‌కు అందించాడు. -
మోదీకి మమత బెనర్జీ లేఖ
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి చేసిన సిఫారసులను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె ఆ లేఖలో తెలిపారు. జనాభా అధారిత సంవత్సరంగా 1971 బదులు 2011 సంవత్సరంగా మార్చడం, దాని వల్ల కలిగే నష్టాల గురించి లేఖలో వివరించారు. 15వ ఆర్థిక సంఘం కొత్తగా చేసిన సిఫారసుల వల్ల రాష్ట్రాలకు నిధుల పంపకంలో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఆర్థిక సంఘం సిఫారసులను వ్యతిరేకిస్తు మోదీకి లేఖ రాసిన మొదటి సీఎం మమతనే కావడం విశేషం. గత కొంతకాలంగా 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి చేసిన సిఫారసులను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే బహిరంగంగా ఏ రాష్ట్రం విమర్శించలేదు. కాగా జనాభా అధారిత సంవత్సరంగా 1971కి బదులుగా 2011ను ప్రతిపాదించడంతో తమ రాష్ట్రానికి 25,000 కోట్ల నుంచి 35,000 కోట్ల నష్టపోయే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. సమాఖ్య విధానంలో రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమాఖ్య విధానానికి విరుద్ధం అని మమత విమర్శించారు. గత ఐదేళ్లుగా 1971 జనాభా ఆధారంగానే రాష్ట్రంలో అనేక సామాజిక, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. జనాభా ఆధారిత సంవత్సరాన్ని మార్చడంతో పశ్చిమ బెంగాల్ మాత్రమేకాక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాలు అధికంగా నిధులు కోల్పోతున్నాయని లేఖలో వివరించారు. ఉత్తర భారతంలో ఉన్న రాష్ట్రాలు బిహార్, రాజస్తాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులు మంజూరుచేస్తోందని, మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం నిధుల కుదించడం అన్యాయమని విమర్శించారు. -
టీడీపీలో కలకలం రేపిన పురందేశ్వరి లేఖ
-
టీడీపీలో కలకలం రేపిన పురందేశ్వరి లేఖ
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురేందేశ్వరి లేఖ రాయడం టీడీపీలో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించడాన్ని లేఖలో ఆమె తప్పుబట్టారు. ఏపీ, తెలంగాణలో ఫిరాయింపుల చట్టం అపహాస్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని స్పష్టం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే పార్టీ ఇమేజ్ దెబ్బ తింటుందని హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కఠినచట్టం తేవాలని కోరారు. ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో వైఎస్సార్ సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది. పార్టీ ఫిరాయించిన మంత్రి పదవులు ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడికి పురందేశ్వరి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
క్రిమినల్‌ను సీఎంగా ఎలా చేస్తారు?
నేర చరిత్ర ఉన్న శశికళా నటరాజన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారంటూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈనెల ఐదో తేదీన రాసిన లేఖలో శశికళకు ఉన్న క్రిమినల్ నేపథ్యం మొత్తాన్ని ఆమె ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం, అన్నాడీఎంకే నాయకులంతా ఏకగ్రీవంగా శశికళా నటరాజన్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం తెలిసిందే. దాంతో చిన్నమ్మ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మార్గం మొత్తం సుగమమైంది. దాంతో ఆమె తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఈనెల 9వ తేదీని ముహూర్తంగా కూడా పెట్టుకున్నారు. జయలలిత అక్రమాస్తులకు సంబంధించిన కేసు సహా పలు కేసులలో శశికళ పేరు ఉంది. ఆ కేసులో జయలలిత నిర్దోషి అని కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. కానీ, మిగిలిన కేసులు మాత్రం చిన్నమ్మ మీద బాగానే ఉన్నాయని శశికళా పుష్ప అంటున్నారు. ఆమెను ముఖ్యమంత్రి చేస్తే.. రాజకీయ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని లేఖలో పేర్కొన్నారు. శశికళ అసలు పార్టీకి ఎలాంటి పని చేయలేదని, జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా శశికళను ఆమె ముఖ్యమంత్రి పదవికి సూచించకుండా.. పన్నీర్ సెల్వానికి బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. శశికళ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఎక్కువవుతాయని, రాజకీయాల్లో నేరచరిత్ర పెచ్చుమీరుతుందని అన్నారు. దానివల్ల రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందని కూడా చెప్పారు. అందువల్ల శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆహ్వానించవద్దని ప్రధానమంత్రితో పాటు తమిళనాడు గవర్నర్‌ను కూడా తాను గట్టిగా కోరతున్నట్లు ఆమె చెప్పారు. -
మోదీజీ సహాయం చేయండి: పన్నీర్ సెల్వం లేఖ
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం లేఖ రాశారు. శ్రీలంకలో బంధీలుగా ఉన్న తమిళనాడు మత్స్యకారులను విడిపించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమిళనాడు తీర ప్రాంతం లంకకు దగ్గరగా ఉండటంతో తమ జలాల పరిధిలోకి వచ్చారని ఆరోపిస్తూ చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను లంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకుని వారి పడవలను సీజ్ చేస్తున్నట్లు సీఎం పన్నీర్ సెల్వం ప్రధానికి విన్నవించారు. మరోవైపు వార్దా తుపాను ఉత్తర తమిళనాడు తీరంలో చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాలయాలన్నింటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మూడు జిల్లాల్లో ప్రైవేట్ ఆఫీసులకు సెలవు ప్రకటించాలని పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం తీరం దాటే అవకాశం ఉండటంతో ఉత్తర తమిళనాడు జిల్లాల్లోని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. -
చనిపోనివ్వాలంటూ మోదీకి లేఖ
భోపాల్: దివ్యాంగులకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ వైపు మాట్లాడుతుండగా.. సాధారణ వ్యక్తి కంటే ఎక్కువ చదివినా తనకు ఉద్యోగం దొరకలేదని భోపాల్ కు చెందిన లక్ష్మీ యాదవ్ అనే దివ్యాంగురాలు ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో)కు ఉత్తరం రాసింది. గత పదేళ్లుగా ప్రైవేటు ఉద్యోగం కోసం తిరిగినా దివ్యాంగురాలిననే కారణంతో తనను ఉద్యోగానికి ఎంపిక చేయడం లేదని, దయచేసి చనిపోయేందుకు అనుమతించాలని లేఖలో కోరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లకు కూడా లక్ష్మీ లేఖలు రాసింది. లేఖలోని విషయాలు: గత 12 ఏళ్లుగా ఎంఫిల్, ఎల్ఎల్ఎమ్ డిగ్రీలు చేత పట్టుకుని కంపెనీల ఇంటర్వూలకు ఉద్యోగం కోసం తిరిగినట్లు లక్ష్మీ లేఖలో పేర్కొంది. దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు ఉన్నా ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు సంశయించాయని ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలకు చాలా పథకాలు ప్రారంభించిందని పేర్కొంది. ప్రైవేటు కంపెనీల్లో ఇంటర్వూలకు వెళ్లిన ప్రతిసారీ చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పింది. మెట్లు ఎక్కలేనని, సరిగా పనిచేయగలిగే సామర్ధ్యం ఉందా? లాంటి కారణాలతో తనను ఉద్యోగానికి ఎంపిక చేయలేదని తెలిపింది. అవకాశం ఇస్తేనే కదా తన సామర్ధ్యం తెలిసేదని లక్ష్మీ లేఖలో వాపోయింది. ఉద్యోగం రాని జీవితం తనకు వద్దని చనిపోవడానికి అవకాశం కల్పించాలని లేఖలో కోరింది. -
మోదీకి లేఖ రాసిన 84ఏళ్ల వృద్ధురాలు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 84ఏళ్ల రిటైర్డ్ టీచర్ లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రే స్వయంగా మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా వెల్లడించారు. తాను ఇచ్చిన 'గివ్ ఇట్ ఆప్' పిలుపుకు స్పందించిన ఆమె సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ను వదులుకుందని చెప్పారు. ఆమె లేఖలో సారాంశం ఇలా ఉంది. దేశంలోని పేద తల్లులకు మీరు మంచి చేస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి వారికి విముక్తిని కల్పిస్తున్నారు. దేశంలోని పేద తల్లులకు పొగరాని పొయ్యిలను అందించడానికి తన వంతుగా 50వేల రూపాయల సాయం చేస్తున్నానని ఆమె తెలిపారు. కాగా లేఖపై స్పందించిన మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ఆమె గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఎంత డబ్బు సాయం చేశారనేది ముఖ్యం కాదని అన్నారు. పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న ఓ తల్లి దేశంలోని సోదరుల కోసం సాయం చేయడం గొప్పతనాన్ని తెలియజేస్తుందని అన్నారు. దేశంలోని గొప్ప తల్లుల దీవెనలు తనకు ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. లేఖలో ఆమె తనను ప్రధానమంత్రి మోదీగా కాకుండా మోదీ భయ్యా అని సంభోదించారని ఉద్వేగంగా తెలిపారు. ఇటువంటి సంఘటనలు దేశ ప్రజలకు ఏదైనా చేయాలనే స్ఫూర్తిని తనలో రగుల్చుతుంటాయని చెప్పారు. ఈ సందర్భంగా 'గివ్ ఇట్ అప్' పిలుపు మేరకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ను వదులుకున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పీఎం తరఫున ఆమె ఇంటికి వెళ్లిన ప్రతినిధి ఒకరు మోదీ స్వయంగా రాసిన ఉత్తరాన్ని అందజేశారు. ఎల్పీజీ సబ్సిడీ కనెక్షన్ ను వదులుకున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. -
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
‘గవర్నర్‌కు శాంతిభద్రతల’పై ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌పై గవర్నర్‌కు పెత్తనమిచ్చే నిబంధనలను పాటించాలంటూ.. మీ అనుమతి లేకుండానే కేంద్ర హోంశాఖ తెలంగాణ సర్కారుకు లేఖ రాసిందని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని గవర్నర్ ద్వారా పాలనను చేతుల్లోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.. ఇది ఎంతో బాధ కలిగిస్తోంది.. ఈ విషయంలో మీరు తక్షణం జోక్యం చేసుకోవాలి..’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ హైదరాబాద్ విషయంలో తెలంగాణ మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ పనిచేయాలని ఉందని, రాజ్యాంగం ప్రకారమూ ఇదే సరైన విధానమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వెంటనే కలగజేసుకుని సమస్య పరిష్కారానికి చర్య తీసుకోవాలంటూ కేసీఆర్ శనివారం రాత్రి ప్రధానికి లేఖ రాశారు. కేసీఆర్ లేఖ పూర్తి పాఠమిదీ... ప్రధాని నరేంద్రమోడీ గారికి, ‘సమాఖ్య వ్యవస్థకు సంబంధించి అత్యంత ముఖ్యమైన రాజ్యాంగపరమైన అంశం గురించి ఎంతో బాధతో ఈ లేఖ రాస్తున్నాను. కేంద్ర హోంశాఖ నుంచి అందిన లేఖ మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద గవర్నర్ అధికారాలు, విధులను గురించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలంటూ కొన్ని అనవసర నిబంధనలను ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసుస్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను, ఏసీపీ/డీసీపీలను నియమించే విషయంలో కూడా ప్రభుత్వం నిర్దిష్ట విధానాన్ని పాటించాలని సూచించే వరకు ఆ నిబంధనలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ విధుల నిర్వహణ గురించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 8(3)లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి మండలితో సంప్రదింపుల తర్వాతే గవర్నర్ తన నిర్ణయాధికారాన్ని వినియోగించాలి. మంత్రి మండలి మినహా మరే ఇతర పరిపాలనాపరమైన వ్యవస్థ గవర్నర్‌కు సలహాలు ఇవ్వడానికి పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యాంగం ఎలాంటి అవకాశం కల్పించలేదు. ఈ విషయాల్లో గవర్నర్ మంత్రి మండలి నుంచి తప్ప మరెవరి నుంచీ సలహాలు లేదా సూచనలు తీసుకోలేరు. తెలంగాణ మంత్రి మండలిని కాదని గవర్నర్ ద్వారా పరిపాలనా వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవాలని అనుకోవడం మన దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమే అవుతుంది. కేంద్ర హోంశాఖ ద్వారా మా ప్రభుత్వానికి అందిన లేఖను దీనితో పాటు జతచేస్తున్నాను. మీ అనుమతి తీసుకోకుండానే హోం శాఖ మాకు ఈ లేఖను పంపించిందని విశ్వసిస్తున్నాను. ఈ విషయంలో మీరు వెంటనే జోక్యం చేసుకుని సమాఖ్య సంప్రదాయాలు, ప్రజాస్వామిక విధానాలకు అనుగుణంగా హోం శాఖ తమ లేఖను ఉపసంహరించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వగలరు..’ - కె.చంద్రశేఖరరావు