న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెడితే తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించే ఈ బిల్లుకు బేషరతుగా మద్దతిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సోమవారం లేఖ రాశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీలు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసేలా మహిళలు తమ హక్కును పొందేందుకు ఈ సమావేశాల్లోనే ఆ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ప్రధానిని కోరారు.
‘మహిళల జీవితాలపై మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు వచ్చే పార్లమెంటు సమావేశాలకన్నా గొప్ప అవకాశం, సరైన సమయం ఏముంటుంది?’ అని అందులో రాహుల్ పేర్కొన్నారు. 2010లోనే రాజ్యసభలో ఆమోదం పొందినా.. లోక్‌సభలో గత ఎనిమిదేళ్లుగా నిలిచిపోయిందని రాహుల్ గుర్తుచేశారు. బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో కృషి చేసినా, బీజేపీ కలసిరాలేదని విమర్శించారు. మహిళల సాధికారతకు ఇప్పటికైనా రాజకీయాలకతీతంగా కలిసి పనిచేద్దామని ప్రధానిని కోరారు.
లోక్‌సభలో బలముందిగా..!
‘ఈ బిల్లు ఆమోదంపై మీ పార్టీలో కొందరికి విశ్వాసం లేదు. అలాంటి వారికి .. పంచాయతీ, మునిసిపాలిటీల స్థాయిలోనూ పురుషుల కంటే మహిళలే సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరును మీరు వివరించడాన్ని హర్షిస్తున్నా’ అని రాహల్ పేర్కొన్నారు. లోక్‌సభలో బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలకు బలమైన మెజారిటీ ఉందని గుర్తు చేస్తూ.. ఈ చరిత్రాత్మక బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ఇంతకన్నా ఏం కావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment