క్రిమినల్‌ను సీఎంగా ఎలా చేస్తారు?
క్రిమినల్‌ను సీఎంగా ఎలా చేస్తారు?
Published Mon, Feb 6 2017 10:54 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
నేర చరిత్ర ఉన్న శశికళా నటరాజన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారంటూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈనెల ఐదో తేదీన రాసిన లేఖలో శశికళకు ఉన్న క్రిమినల్ నేపథ్యం మొత్తాన్ని ఆమె ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం, అన్నాడీఎంకే నాయకులంతా ఏకగ్రీవంగా శశికళా నటరాజన్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం తెలిసిందే. దాంతో చిన్నమ్మ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మార్గం మొత్తం సుగమమైంది. దాంతో ఆమె తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఈనెల 9వ తేదీని ముహూర్తంగా కూడా పెట్టుకున్నారు.
జయలలిత అక్రమాస్తులకు సంబంధించిన కేసు సహా పలు కేసులలో శశికళ పేరు ఉంది. ఆ కేసులో జయలలిత నిర్దోషి అని కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. కానీ, మిగిలిన కేసులు మాత్రం చిన్నమ్మ మీద బాగానే ఉన్నాయని శశికళా పుష్ప అంటున్నారు. ఆమెను ముఖ్యమంత్రి చేస్తే.. రాజకీయ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని లేఖలో పేర్కొన్నారు. శశికళ అసలు పార్టీకి ఎలాంటి పని చేయలేదని, జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా శశికళను ఆమె ముఖ్యమంత్రి పదవికి సూచించకుండా.. పన్నీర్ సెల్వానికి బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. శశికళ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఎక్కువవుతాయని, రాజకీయాల్లో నేరచరిత్ర పెచ్చుమీరుతుందని అన్నారు. దానివల్ల రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందని కూడా చెప్పారు. అందువల్ల శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆహ్వానించవద్దని ప్రధానమంత్రితో పాటు తమిళనాడు గవర్నర్‌ను కూడా తాను గట్టిగా కోరతున్నట్లు ఆమె చెప్పారు.
Advertisement
Advertisement