నేనూ పోటీలో ఉంటా: శశికళ
న్యూఢిల్లీ: అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. పార్టీలోని ప్రతి ప్రాథమిక సభ్యుడికి ఈ హక్కు ఉందని, పార్టీ నుంచి తనను బహిష్కరించలేదని, అన్నా డీఎంకే తరఫున ఎంపీగా కొనసాగుతున్నానని పేర్కొన్నారు.
జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌కు వ్యతిరేకంగా శశికళ పుష్ప తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జయలలితను చంపేందుకు శశికళ నటరాజన్ ప్రయత్నించిందని, దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ బాధ్యతలు చేపడుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను పోటీలో ఉన్నట్టు శశికళ పుష్ప ప్రకటించారు. కాగా శుక్రవారం వచ్చే హైకోర్టు తీర్పును బట్టి తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. పార్టీ పగ్గాలు శశికళ నటరాజన్‌కు అప్పగించడానికి పార్టీ కేడర్‌లో దాదాపు 75 శాతం మంది సంతోషంగా లేరని చెప్పారు. అంతేగాక ఆమె పార‍్టీలో సభ్యురాలు కాదని అన్నారు.