ఎంపీ శశికళ పుష్పకు భారీ ఊరట
చెన్నై: లైంగిక వేధింపులు, హత్యకేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పకు భారీ ఊరట లభించింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు శశికళ కుటుంబంపై నమోదు అయిన కేసును బాధితులు ఎట్టకేలకు విత్ డ్రా చేసుకున్నారు. శశికళ భర్త లింగేశ్వర్ తిలకన్, ఆమె కుమారుడు ప్రదీప్ రాజా తనతో పాటు తన సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వారింట్లో పని చేసిన భానుమతి, ఝాన్సీరాణి అనే మహిళలు గతంలో తిరునల్వేలి జిల్లా తుత్తికుడి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తమను ఇంట్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టారని బాధితులు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే శశికళ పుష్ప ... దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా గళం విప్పిన అనంతరం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పాటు, పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పనిమనుషులు భానుమతితో పాటు ఝాన్సీరాణి కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా లేఖ రాశారు. మరోవైపు రాజకీయంగా తనను, తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికే వేధింపుల పేరుతో కుట్ర పన్నారని శశికళ పుష్ప ఆరోపించారు. కాగా ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీని చెంపదెబ్బ కొట్టడంతో శశికళ పుష్ప పార్టీ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే.