శశికళకు ఆ హక్కు లేదు
చెన్నై: అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప వేసిన పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ ప్రిసైడింగ్ చైర్మన్ మధుసూధనన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శశికళ పుష్ప అన్నాడీఎంకే పార్టీ సభ్యురాలు కాదని, పార్టీ వ్యవహారాలకు సంబంధించి కోర్టులో పిటిషన్ వేసే హక్కు ఆమెకు లేదని మధుసూదనన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
డీఎంకే ఎంపీతో గొడవ పడిన శశికళ పుష్పను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. కాగా జయలలిత మరణించిన తర్వాత ప్రస్తుత అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్పై శశికళ పుష్ప తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ అర్హురాలు కాదంటూ విమర్శించిన పుష్ప తాను ఆ పదవికి పోటీచేయనున్నట్లు ప్రకటించారు. పుష్ప తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమె భర్త లింగేశ్వర తిలగన్‌ను అన్నా డీఎంకే కార్యకర్తలు చితకబాదారు. ఈ సంఘటన తర్వాత తన భర్త ఆచూకీ తెలియట్లేదని పుష్ప హైకోర్టులో పిటిషన్ వేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ నియామకాన్ని అడ్డుకోవాలని కోరుతూ అంతకుముందు శశికళ పుష్ప హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా, జయలలిత మృతి వెనుక రహస్యాలు బయటపెట్టాలంటూ శశికళ పుష్ప సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు.