ఇది మన ప్రతిజ్ఞ: శశికళ ఉద్వేగం
చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుతో అన్నాడీఏంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ఖిన్నురాలయ్యారు. ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. మన పార్టీని, ప్రభుత్వాన్ని ఎవరూ కదపలేరంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. సంక్షోభానికి పన్నీర్ సెల్వమే కారణమని, మన వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారని వాపోయారు. పార్టీని చీల్చడానికి నానా కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘కచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అమ్మ సమాధి వద్ద ఫొటో దిగి ప్రపంచానికి చూపిద్దాం. ఇది మన ప్రతిజ్ఞ. మీరంతా కుటుంబంలా నాకు అండగా ఉంటే అన్నిటినీ సాధిస్తా. అమ్మ నాతో ఉన్నంత వరకు వెనుకడుగ వేసేది లేదు. 129 ఎమ్మెల్యేల మద్దతు నాకు ఉంది. విజయం సాధించాక దాన్ని అమ్మకు అంకితం ఇద్దాం. డీఎంకే కుట్రలను గెలిపించొద్దు. నేను మహిళను కాబట్టి నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవ’ని శశికళ పేర్కొన్నారు.