నేనేంటో అసెంబ్లీలో చూపిస్తా: సెల్వం
చెన్నై: రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వారు పడుతున్న బాధలను తమ వద్ద వాపోతున్నారని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే వద్ద నలుగురు గూండాలు కాపలా ఉన్నారని వెల్లడించారు. తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మొసలి కన్నీరుతో ప్రజలను దృష్టిని మరల్చాలని శశికళ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన బలమేంటే అసెంబ్లీలో చూపిస్తానని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తమిళ పౌరుడు శశికళ సీఎం కాకూడదని కోరుకుంటున్నారని చెప్పారు. చెన్నైలోనే కాదు.. దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయన్నారు. జయలలిత భౌతిక కాయాన్ని చూడడానికి ఆమె మేనకోడలు దీపను కూడా అనుమతించలేదని వాపోయారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నానని, పాలన సవ్యంగానే నడుస్తోందని పన్నీర్ సెల్వం చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో మీడియాలో నాలుగో స్తంభం అని, రిసార్టులో ఏం జరుగుతుందో ప్రజలకు చూపాలని ఆయన కోరారు.