సీఎం రాజీనామా, చిన్నమ్మకు లైన్ క్లియర్
చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఇటీవల ప్రచారం జరిగినట్టుగా అధికార అన్నా డీఎంకేలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సీఎం పన్నీరు సెల్వం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
ఆదివారం చెన్నై పోయెస్ గార్డెన్లో జరిగిన అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశంలో పన్నీరు సెల్వం రాజీనామా లేఖను శశికళకు అందజేశారు. ఈ సమావేశంలో పార్టీ శాసనసభ పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం పదవికి శశికళను పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, మంత్రులు, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. దీంతో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రెండు, మూడు రోజుల్లో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం పన్నీరు సెల్వం, శశికళ అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
జయలలిత మరణించిన తర్వాత తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత శశికళ సీఎం పీఠంపై కూర్చునేందుకు పావులు కదుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా తన సన్నిహితులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆమె ఆదేశాల మేరకు జయలలితకు సన్నిహితులైన అధికారులు వైదొలిగారు. శశికళను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునేందుకే ఈ రోజు అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారన్న ఊహాగానాలు నిజమయ్యాయి. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు పన్నీరు సెల్వం నిరాకరిస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా రాజీనామా చేసినట్టు సమాచారం.