విలీనం ఓకే..అదే మిలియన్ డాలర్ క్వశ్చన్
చెన్నై:తమిళనాట సంచలనంగా మారిన పళని స్వామి, పన్నీరు సెల్వం విలీనంపై శశికళవర్గం స్పందించింది. విలీనం సంతోషమే...కానీ తమను (టీటీవీ దినకరన్, సరస్వతి) ఎందుకు దూరం పెడుతున్నారని ఏఐఏడీఎంకే నేత సీఆర్ సరస్వతి ప్రశ్నించారు. అదే మిలియన్ డాలర్ల క్వశ్చన్ అని ఆమె మండిపడ్డారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరో కీలక మార్పుకు నాంది పడింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాగైనా పాగా వేయాలని భావించిన శశికళ 'చిన్నమ్మ' వరుస చిక్కుల్లో చిక్కుకుంటుండగా తాజా పరిణామాలు ఆసక్తి కరంగా మారాయి.
ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీని చీల్చి, భంగపడిన మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం దిగి వచ్చి పళని స్వామితో ఒక అంగీకారాన్ని కుదుర్చుకున్నారు. ఈ మేరకు సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి విలీనానికి ఇరువర్గాలు అంగీకరించినట్టు సోమవారం అధికారింగా ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు ఎంజీఆర్ మెమోరియల్, మెరినా మెమోరియల్‌ను సందర్శించి దివంగత మాజీ ముఖ్యమంత్రికి,అమ్మ జయలలితకు నివాళులర్పించారు. అలాగే పార్టీ పదవినుంచి శశికళ తొలగించడంపై పార్టీ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించనున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా పళని స్వామి తెలిపారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేయగా, పన్నీరు సన్నిహితుడు పాండి రాజన్ కూడా కొత్త క్యాబినెట్‌లో మంత్రిగా చేరారు.