డేట్ ఫిక్స్ చేసిన చిన్నమ్మ
చెన్నై: ఊహాగానాలు నిజమయ్యాయి. తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారాయి. జయలలిత నెచ్చెలి, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 9:30 గంటలకు తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణం చేయనున్నారు. తమిళనాడుకు మూడో మహిళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తానని శశికళ అన్నారు.
ఆదివారం పోయెస్ గార్డెన్లో జరిగిన అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే చిన్నమ్మ సీఎం అయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి శశికళ పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, మంత్రులు, ఎమ్మల్యేలందరూ మద్దతు పలికారు. శాసనసభ పక్ష నిర్ణయాన్ని తెలియజేసేందుకు ఎమ్మెల్యేలు.. గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్‌మెంట్ కోరారు. గవర్నర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి నేటికి 60 రోజులయ్యింది. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న జయలలిత మరణించారు. ఆ తర్వాత సీఎంగా పన్నీరు సెల్వం, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. 60 రోజుల తర్వాత అన్నా డీఎంకే రాజకీయాలు మారిపోయాయి. పార్టీని పూర్తిగా తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్న శశికళ.. ఇప్పుడు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు.