పన్నీరూ.. నీ ఆస్తుల గుట్టు విప్పుతాం!
- పన్నీర్ సెల్వం కుటుంబానికి భారీగా ఆస్తులు
- వాటి గుట్టు విప్పేందుకు ఎంక్వైరీ కమిషన్ వేస్తాం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం కుటుంబసభ్యులకు దేశ, విదేశాల్లో భారీగా వ్యాపారాలు, వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీవీవీ దినకరన్ ఆరోపించారు. భారీగా పెరిగిపోయిన ఆయన ఆస్తుల గుట్టువిప్పేందుకు త్వరలోనే ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటుచేస్తామని ఆయన హెచ్చరించారు. తిరువన్నమలైలో శనివారం రాత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి దినకరన్ మాట్లాడారు. 2000 సంవత్సరంలో తానే పన్నీర్‌సెల్వాన్ని దివంగత సీఎం జయలలితకు పరిచయం చేశానని, కేవలం దశాబ్దికాలంలోనే ఆయన ఆస్తులు అమాంతం ఎలా పెరిగిపోయాయని దినకరన్ ప్రశ్నించారు.
’పెరియా కులానికి చెందిన తొలి ఎమ్మెల్యేగా 2001లో పన్నీర్ సెల్వం చెన్నైకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఢిల్లీకి ఎందుకు తరచూ వెళుతున్నారో త్వరలోనే ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటుచేసి గుట్టు విప్పుతాం’ అని దినకరన్ పేర్కొన్నారు. పన్నీర్ సెల్వం కొడుకులు, అలుళ్లు తరచూ చెన్నై నుంచి ఢిల్లీకి, విదేశాలకు ఎందుకు వెళుతున్నారో, నిత్యం వారు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటో దర్యాప్తులో బట్టబయలు చేస్తామని, త్వరలోనే ఈ దర్యాప్తు ప్రారంభం కాబోతున్నదని అన్నారు.
శశికళ అక్క కొడుకైన దినకరన్ ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వంలో తిరుగులేని శక్తిగా ఉన్నారు. శశికళ జైలుకు వెళ్లిన నేపథ్యంలో అధికార పార్టీని డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నడిపిస్తున్న ఆయన పన్నీర్ సెల్వం ఆస్తులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలను చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.